రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ

కొండా రాజీవ్‌గాంధీ ఆగ్ర‌హం

 వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్ర‌తినిధి కొండా రాజీవ్ గాంధీ

 పోలీస్ వ్యవస్థ పొలిటికల్ సెన్సార్‌షిప్ ఆర్గనైజేషన్‌గా మారింది

 సోష‌ల్ మీడియాని చూసి ఎందుకు అంత‌లా వ‌ణికిపోతున్నారు?

 ఎక్స్‌కు ఎఫ్‌బీఐ పేరుతో పంపిన మెయిల్స్‌పై సమాధానం చెప్పాలి

 స్టూడెంట్ జేఏసీ కోరుతున్న విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి

 యువత, విద్యార్థులపై పోలీసుల నిఘా పెట్ట‌డం ఆపాలి

 కొండా రాజీవ్ గాంధీ డిమాండ్

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకరకమైన అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రజల గొంతు నొక్కడమే లక్ష్యంగా పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం, యువతను మోసం చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత, విద్యార్థులు తమ సమస్యలపై ఉద్యమిస్తే వారిపై నిఘా పెట్టడం, కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేసే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించి రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అయినా యువత ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వైయ‌స్ జ‌గ‌న్ గారి నేతృత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఆయ‌న ఇంకా ఏం మాట్లాడారంటే...

విద్యార్థులు, యువతపై నిఘా పెట్టడం ఏంటి?

జీవో నంబర్ 9ను అమలు చేయాలని చూస్తున్నారు. దీని ద్వారా ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజలు, ప్రతిపక్షాలు, విద్యార్థులు, మహిళలు, ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో భాగం. ప్రశ్నించినంత మాత్రాన దాన్ని శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించడం సరికాదు. యువతకు ఎన్నికల సమయంలో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చి, ఇప్పుడు ఉద్యోగాలు, నోటిఫికేషన్లు అడిగితే వారిపై కేసులు పెట్టడం ఏమిటి? యువత తమ ఆస్తులు, పదవులు అడగడం లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారు. విద్యార్థులు, యువతపై నిఘా పెట్టడం, వారి ఉద్యమాలను అడ్డుకోవడం, సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించడం ఆపాలి.

చేత‌నైతే పార‌ద‌ర్శకంగా నియామ‌కాలు చేయండి

యువత, విద్యార్థులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని విద్యార్థులు ర్యాలీలు నిర్వహిస్తే కేసులు పెట్టడం, విద్యార్థుల ఉద్యమాలపై చర్యలు తీసుకోవడం, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై ఆంక్షలు విధించడం ఎందుకు? యువత భయపడాల్సిన అవసరం లేదు; అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించి నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించింది. యువత తరఫున వైయ‌స్ఆర్‌సీపీ గళం విప్పుతుంది, వారికి అండగా నిలుస్తుంది. స్టూడెంట్ జేఏసీ కోరుతున్న విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి, బ్యాక్‌డోర్ వ్యవహారాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించాలి

యువత, విద్యార్థుల సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న సమయంలో ఎందుకు మాట్లాడటం లేదు? సామాన్య ప్రజలకు ఒక న్యాయం, అధికారంలో ఉన్న వారికి మరో న్యాయం ఉండకూడదు. ప్రభుత్వం తీసుకున్న నిఘా, నిర్బంధ చర్యలకు సంబంధించిన ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.

ఎఫ్‌బీఐ పేరును ఎవ‌రి అనుమ‌తితో వాడారు?

ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థ, రాజకీయ సెన్సార్‌షిప్ వ్యవస్థలా పనిచేస్తోంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పోస్టులను ఉంచడం, వ్యతిరేకంగా ఉన్న పోస్టులను తొలగించే విధంగా పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులను చూసి ప్రభుత్వం ఎందుకు వణికిపోతోంది? యువత సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తోందనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఎక్స్‌కు ఎఫ్‌బీఐ పేరుతో పోలీసులు పంపిన మెయిల్స్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. ఎఫ్‌బీఐ పేరు ఎవరి అనుమతితో ఉపయోగించారు, ఏ పోస్టులను తొలగించాలని కోరారు, వాటిని తొలగించేందుకు చట్టపరమైన ఆధారాలు ఏమిటో ప్రభుత్వం వెల్లడించాలి. ఎఫ్‌బీఐ నుంచి టేక్‌డౌన్ రిక్వెస్ట్ రాలేదని ఎక్స్ సంస్థ తెలిపింది.

యువతలో ప్రశ్నించే స్వరం, తిరుగుబాటు మొదలైంది. అందుకే ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టులు, ఉద్యమాలపై ఆంక్షలు విధిస్తోంది. ప్రభుత్వాన్ని చూసి యువత భయపడాల్సిన అవసరం లేదు. వారి వెనుక వైయ‌స్ జ‌గ‌న్ గారు, వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటాయని కొండా రాజీవ్ గాంధీ భరోసా ఇచ్చారు.

Back to Top