తిరుపతి: శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఆధునికీకరణ పనుల్లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే 85 శాతం పనులు పూర్తయ్యాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. లండన్ మ్యూజియంతో సమానంగా ఎస్వీ మ్యూజియాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని వివరించారు. వైయస్ జగన్ ఆదేశాలతో మ్యూజియం అభివృద్ధికి టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని, టాటా సంస్థలు రూ.125 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు కేటాయించాయని భూమన తెలిపారు. బెంగళూరుకు చెందిన మ్యాప్ సంస్థ పనులకు రూ.20 కోట్ల సహకారం అందించిందని పేర్కొన్నారు. టాటా సంస్థల ఇంజినీర్లు, ఇతర నిపుణులతో ప్రత్యేక డిజైన్ రూపొందించి మ్యూజియాన్ని ఆధునికీకరించినట్లు భూమన తెలిపారు. రూ.145 కోట్ల వ్యయంతో ఒరిజినల్ రాగి రేకులు, మైసూరు మహారాజు ముత్యాల పల్లకి, శ్రీవారి బంగారు వస్తువులను భద్రపరిచినట్లు చెప్పారు. గతంలో ఉన్న ఏడు గ్యాలరీలను 14 గ్యాలరీలకు విస్తరించామని వివరించారు. మిగిలిన పనులకు రెండున్నరేళ్లు మ్యూజియం పనుల్లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 85 శాతం పూర్తయితే, మిగిలిన 15 శాతం పనులను పూర్తి చేయడానికి ప్రస్తుత పాలకులు రెండున్నరేళ్లు సమయం తీసుకున్నారని భూమన పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత మ్యూజియం పనులను టీటీడీ పారిశుధ్య విభాగం అధికారికి అప్పగించడం ద్వారా పనుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి పురావస్తు శాఖ, ప్రదర్శనశాలల అభివృద్ధిపై ఉన్న ఆసక్తితోనే 1980 నుంచి ఉన్న ఎస్వీ మ్యూజియాన్ని ఆధునికీకరించే నిర్ణయం తీసుకున్నారని భూమన తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు ప్రస్తుత ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఎస్వీ మ్యూజియం అభివృద్ధికి సంబంధించి వాస్తవాలు భక్తులకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వివరాలను వెల్లడిస్తున్నట్లు చెప్పారు.