ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతిపై వైయస్ జగన్ సంతాపం

ప్రముఖ సినీ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి సింగీతం శ్రీనివాసరావు గారి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు దక్షిణ భారత సినీ రంగంలో సింగీతం శ్రీనివాసరావు గారు తనదైన ప్రత్యేక ముద్ర వేశారని శ్రీ వైయస్ జగన్ పేర్కొన్నారు. దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా ఆయన ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞ చిరస్మరణీయమన్నారు.

ఎన్నో విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని మరింత ఉన్నతంగా నిలిపారని కొనియాడారు. మూస ధోరణులకు భిన్నంగా కొత్త కథలు, కొత్త సాంకేతికత, వినూత్నమైన ఆలోచనలతో తరతరాల సినీ ప్రేక్షకులను అలరించారని పేర్కొన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని, ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారని గుర్తుచేశారు. 94 ఏళ్ల వయసులోనూ సినిమాపై అదే అంకితభావంతో పనిచేయడం ఆయనలోని కళాతపనకు నిదర్శనమని అన్నారు.

సింగీతం శ్రీనివాసరావు గారి మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని శ్రీ వైయస్ జగన్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ రంగానికి చెందిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top