క‌రవుతో రైతులు అల్లాడుతుంటే..  పాలకులు ఆర్భాటాలకే పరిమితం

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి: కరవుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం ఆర్భాట ప్రచారాలతో కాలం వెళ్లదీస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. చిన్నమండెం మండలంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు, ప్రభుత్వ హామీల అమలు, బీసీ రిజర్వేషన్లు, పార్టీ కార్యకర్తల సంక్షేమంపై మాట్లాడారు.

జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు కరవు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, మామిడి తదితర ఉద్యాన పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రచార సభలపై కాకుండా రైతులు, నిరుద్యోగ యువత, మహిళల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. కొత్త పెన్షన్లు, ఇళ్లు, మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ యువతకు రూ.3,000 భృతి వంటి హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో చట్టం తీసుకురావాలని శ్రీకాంత్‌రెడ్డి కోరారు. చట్టం తీసుకొస్తే వైయ‌స్ఆర్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. చిన్నమండెం మండలంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 4 వేలకు పైగా పక్కా ఇళ్లు మంజూరు చేశామని, శ్రీనివాసపురం రిజర్వాయర్‌, తాగునీటి పనులకు గత ప్రభుత్వమే పునాది వేసిందని పేర్కొన్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులకు కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని శ్రీకాంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. గుర్తింపు కార్డు కార్యకర్త సేవకు, పార్టీ నమ్మకానికి ప్రతీక అని చెప్పారు. ప్రమాదవశాత్తు కార్యకర్త మృతి చెందితే పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవనాథరెడ్డి, మండల కన్వీనర్‌ గోవర్ధన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చుక్కా అంజనప్ప, మహిళా నాయకురాలు అమ్మాజీ, మాజీ సర్పంచ్‌ ముసల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top