అనంతపురం: రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులపై స్పష్టత ఇవ్వాలని వైయస్ఆర్‌సీపీ ఐటీ విభాగం జోనల్ అధ్యక్షుడు మంజునాథ్ యాదవ్ డిమాండ్ చేశారు. హడావుడి ప్రచారంతో కాకుండా రిలయన్స్‌తో కుదిరిన ఒప్పందాలు, ఖరారైన పెట్టుబడులు, ప్రాజెక్టుల వివరాలు, రైతులకు కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం అధికారికంగా ప్రజల ముందుంచాలని కోరారు. అనంత్ అంబానీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో జరిగిన సమావేశాలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాయలసీమకు వచ్చే పెట్టుబడులు, వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మంజునాథ్ యాదవ్ కోరారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌లో రిలయన్స్ భాగస్వామ్యం, పెట్టుబడి, నిర్మించబోయే ప్రాజెక్టులు, రైతులకు కలిగే ప్రత్యక్ష ప్రయోజనాలపై అధికారిక వివరాలు వెల్లడించాలన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేఆరు. రూ. 1 లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్‌లో రూ.60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడులుగా వస్తాయని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో అందులో రిలయన్స్ వాటా ఎంత, ఎంత పెట్టుబడి ఖరారైంది, ఏ ఒప్పందాలు లేదా ఎంఓయూలు కుదిరాయి అనే వివరాలను ప్రజల ముందుంచాలని మంజునాథ్ యాదవ్ పట్టుబట్టారు. రిలయన్స్ ప్రకటించిన బయోగ్యాస్ పెట్టుబడులను హార్టికల్చర్ హబ్ పెట్టుబడులతో కలిపి చూపకుండా, పండ్లు–కూరగాయల ఉద్యాన పంటలు, ఎనర్జీ క్రాప్స్, బయోగ్యాస్ ప్రాజెక్టులను విడివిడిగా వివరించాలని పేర్కొన్నారు. అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ విషయంలోనూ స్పష్టత అవసరమని తెలిపారు. ₹2.73 లక్షల కోట్ల పెట్టుబడిని ఇప్పటికే ఖరారైన పెట్టుబడిగా చూపకుండా, ప్రతిపాదన, ఒప్పందం, ఆమోదం, వాస్తవ అమలు మధ్య తేడాను ప్రభుత్వం ప్రజలకు వివరించాలన్నారు. రైతుల భూముల అవసరం, భూసేకరణ ప్రతిపాదనలు, పర్యావరణ–సామాజిక ప్రభావం, అమలు షెడ్యూల్, రైతులకు కలిగే ప్రత్యక్ష ప్రయోజనాలపై సమగ్ర సమాచారాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. “రాయలసీమకు పెట్టుబడులు రావడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. అయితే ప్రచారం కంటే పారదర్శకత, హామీల కంటే రైతుల భద్రత, ప్రతిపాదనల కంటే వాస్తవ అమలు ముఖ్యం. ఏ కంపెనీ ఎంత పెట్టుబడి పెడుతోంది? ఏం నిర్మిస్తోంది? ఎప్పుడు అమలు చేస్తోంది? రైతులకు ఏం ప్రయోజనం కలుగుతుంది? అనే వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలి. ప్రజలకు కావాల్సింది ప్రచారం కాదు.. స్పష్టత” అని మంజునాథ్ యాదవ్ పేర్కొన్నారు.