రూ. 9 లక్షల డొల్ల కంపెనీకి రూ. 1400 కోట్ల ప్రాజెక్టా? 

అప్పనంగా 40.50 ఎకరాల ప్రభుత్వ భూములు, రూ. 592 కోట్ల ఇన్సెంటివ్స్ లా:

 కూటమి సర్కార్ భూపందేరం పై ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. 

తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం లో మీడియా మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. 
 
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో చంద్రబాబు సర్కార్ భారీ బినామీ దందా: 

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో 'రావోక్స్ అగ్రిటెక్' పేరిట పక్కా స్కెచ్

వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పేదల ఇళ్ల స్థలాలు రద్దు:
 
పుట్టి పది నెలలు దాటని కంపెనీలకు మాత్రం వేల కోట్ల భూ దోపిడీయా?: 

సూటిగా ప్రశ్నించిన పుత్తా శివశంకర్ 

తాడేపల్లి : చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో తమ అనుయాయులకు, బినామీ కంపెనీలకు అడ్డగోలుగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, రాయితీలను దోచిపెడుతోందని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ సాక్ష్యాధారాలతో సహా నిలదీశారు. తాడేపల్లి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో  మీడియాతో  మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో విశాఖపట్నంలో ఉర్సా  లాంటి డొల్ల కంపెనీలకు రూపాయికే ఎకరం చొప్పున భూములు కట్టబెట్టిన తరహాలోనే, ఇప్పుడు రాయలసీమలోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో 'రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్' పేరిట మరో భారీ దోపిడీకి తెరలేపారని ఆయన విమర్శించారు.  ఏడాది కూడా నిండని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎలాంటి ముందస్తు అనుభవం లేని, కేవలం రూ. 9 లక్షల పెయిడ్ అప్ క్యాపిటల్‌తో రిజిస్టర్ అయిన సంస్థకు ఏకంగా రూ. 1388.14 కోట్ల ప్రాజెక్టును ఆపాదించి, 40.50 ఎకరాల ఏపీఐఐసీ విలువైన భూమితో పాటు రూ. 592.22 కోట్ల మేర టైలర్ మేడ్ ఇన్సెంటివ్‌లను జీవో ఎంఎస్ 259 ద్వారా ధారాదత్తం చేశారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలో 50 వేల మంది నిరుపేదలకు గతంలో వైయస్. జగన్ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసిన చంద్రబాబు, తమ వారి లబ్ధి కోసం నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే బినామీ సంస్థలకు ప్రజల ఆస్తులను దోచిపెడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... 

రూ. 9 లక్షల కంపెనీకి రూ. 1400 కోట్ల పెట్టుబడి సామర్థ్యం ఎక్కడిది?

గత ఏడాది నవంబర్ 20, 2025న ప్రారంభమైన రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పెయిడ్ అప్ క్యాపిటల్ కేవలం రూ. 9 లక్షలు మాత్రమేనని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ROC) రికార్డులే చెబుతున్నాయి. కనీసం రూ. 2.5 లక్షల రుణం పొందే అర్హత కూడా లేని ఈ పసిగుడ్డు కంపెనీ ఏకంగా రూ. 1388.14 కోట్ల పెట్టుబడి పెడుతుందంటే ఎవరైనా నమ్ముతారా? అసలు ఈ కంపెనీ వెనుక ఉండి నల్లధనాన్ని పెట్టుబడిగా పెడుతున్న బడా బాబులు ఎవరు? కేవలం పేపర్ మీద కంపెనీ పెట్టి, ప్రభుత్వ భూములు చేజిక్కించుకుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పారిపోయే కుట్ర కాదా ఇది?
సర్జికల్ గ్లౌజులు చేసేవారికి ఫుడ్ ప్రాసెసింగ్ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది?
ఈ సంస్థ డైరెక్టర్లకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కనీస అనుభవం ఉందా? వీరికున్న మరో కంపెనీ ఈజిస్ గ్లోవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం ఏఎంటీజెడ్‌లో సర్జికల్ హ్యాండ్ గ్లౌజులు తయారు చేస్తుంది. గ్లౌజులు తయారు చేసేవారికి, టమోటా, మామిడి ప్రాసెసింగ్ చేసే అనుభవం ఎలా ఆపాదించారు? పైగా వీళ్ల అనుబంధ సంస్థ 'దిసూత్ర ల్యాబ్స్'ను మొన్న 2026 ఏప్రిల్‌లో కేవలం రూ. 10 వేల క్యాపిటల్‌తో పెట్టారు. ఐటీసీ, డాబర్ వంటి దిగ్గజ సంస్థలను కాదని, ఏ అనుభవమూ లేని ఇలాంటి డొల్ల కంపెనీలకు 40.50 ఎకరాల భూమిని ఎలా అప్పగిస్తారు?

జీవో రాకముందే రూ. 1090 కోట్ల మెషినరీ ఆర్డర్లు ఎలా ఇచ్చారు?

ప్రభుత్వం జీవో ఎంఎస్ 259ను సెప్టెంబర్ 25న విడుదల చేసింది. ఎస్‌ఐపీసీ మీటింగ్ సెప్టెంబర్ 7న, ఎస్‌ఐపీబీ మీటింగ్ సెప్టెంబర్ 18న జరిగితే.. జీవోలోని ప్రాజెక్ట్ షెడ్యూల్ ప్రకారం జూలై 1 నాటికే రూ. 1090 కోట్ల ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్డర్ ప్లేస్ చేసినట్లు ఎలా రాశారు? భూమి రాకుండా, ప్రభుత్వ అనుమతులు రాకుండానే రూ. 9 లక్షల మూలధనం ఉన్న కంపెనీ వెయ్యి కోట్లకు పైగా విలువైన యంత్రాలకు జూలైలోనే ఆర్డర్ ఇచ్చిందా? ఇదంతా ముందస్తు కుమ్మక్కు కాదా?

*రూ. 592 కోట్ల ప్రజాధనాన్ని ఇన్సెంటివ్‌ల పేరిట ఎవరి జేబుల్లోకి మళ్లిస్తున్నారు?*

రూ. 1388 కోట్ల ప్రాజెక్టు విలువలో ఏకంగా 46.61 శాతం, అంటే రూ. 592.22 కోట్లను టైలర్ మేడ్ ఇన్సెంటివ్‌లుగా ప్రకటించడం విడ్డూరం కాదా? రూ. 9 లక్షల కంపెనీకి రూ. 592 కోట్ల ఇన్సెంటివ్‌లు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఎక్కడైనా ఉందా? 40.50 ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వడమే కాకుండా, రూ. 592 కోట్లు ప్రభుత్వం నుంచే దోచిపెడుతుంటే ఇది బినామీ దందా కాక మరేమిటి?
అధికారులు అసలు ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్ చేశారా? కళ్లు మూసుకుని ఆమోదించారా?
ఎస్‌ఐపీబీ, ఎస్‌ఐపీసీ కమిటీల్లో కూర్చున్న ఐఏఎస్ అధికారులు ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను అసలు పరిశీలించారా? కంపెనీ ఆర్థిక స్తోమతను పరిశీలించకుండానే చంద్రబాబు చెప్పినట్లు సంతకాలు పెట్టేశారా? 20 లక్షల ఉద్యోగాలంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కప్పిపుచ్చుకోవడానికి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ముసుగులో ఇలాంటి బోగస్ లెక్కలు చూపిస్తున్నారా?
పేదల ఇళ్ల స్థలాలు లాక్కుని.. బినామీలకు వేల కోట్లు ధారాదత్తం చేయడమేనా మీ సుపరిపాలన?

రాజధాని అమరావతిలో 50 వేల మంది పేదలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసిన చంద్రబాబు నాయుడు, నిన్న కాక మొన్న పెట్టిన బోగస్ కంపెనీలకు 40 ఎకరాలు కట్టబెట్టడం ఏ రకమైన న్యాయమని శివశంకర్ నిలదీశారు. పరిశ్రమలు రావడం, స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కడం వైఎస్సార్సీపీకి ఎల్లప్పుడూ సమ్మతమేనని.. . కానీ పరిశ్రమల ముసుగులో జరిగే ఈ బినామీ భూ దోపిడీని మాత్రం సహించేదిలేదని తేల్చి చెప్పారు. 

వైయ‌స్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఈ భూదందా పై సమగ్ర విచారణ జరిపించి దోషులను బోనులో నిలబెట్టడం ఖాయమని హెచ్చరించారు.

Back to Top