నెల్లూరులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి

కలెక్టర్‌కు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి వినతి

నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడకుండా అడ్డుకట్ట వేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. నెల్లూరు కలెక్టరేట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో కలిసి కలెక్టర్‌ను కలిసి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలను ఆయన వివరించారు.

ఓటర్ల జాబితాల్లో ఇష్టారీతిన మార్పులు చేసి కొంతమంది ఓటర్లను జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించి ఎన్నికల్లో ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతల అరెస్టులు, నిర్బంధాలు, తమపై అభ్యంతరకర భాషతో దూషణలకు సంబంధించిన అంశాలను కూడా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

పోలింగ్‌ రోజున కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నెల్లూరులో దౌర్జన్యాలు, బెదిరింపులకు తావులేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top