అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజల సమస్యలు, గ్రామాల అభివృద్ధి, సంక్షేమంపై చర్చ జరిగే ఎన్నికలుగా మార్చాలని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పుట్లూరు మండల కేంద్రంలో మండల కన్వీనర్ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వైయస్ఆర్‌సీపీకి పదవుల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని శైలజానాథ్ స్పష్టం చేశారు. రైతులకు సాగునీరు, యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక భరోసా, విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృద్ధులకు గౌరవప్రదమైన పెన్షన్ కోసం ప్రజల పక్షాన నిరంతరం పోరాడాలని సూచించారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలలు, రోడ్లు, ఆరోగ్య రంగంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకుని, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, రైతులు, మహిళలు, యువత సమస్యలపై నిరంతరం అందుబాటులో ఉండే కార్యకర్తలే పార్టీకి బలమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు పరిస్థితిపైనా గ్రామాల్లో వాస్తవ చర్చ జరగాలని సూచించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తల ఐక్యత, క్రమశిక్షణ, ప్రజలతో నిరంతర సంబంధం కీలకమని శైలజానాథ్ అన్నారు. గ్రామస్థాయి సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడాలని కోరారు. సమావేశంలో యువ నాయకుడు సాకే రుత్విక్ హృదయ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.