రాయలసీమ రైతుకు కావాల్సింది ప్రచారం కాదు — నీరు, ధర, భరోసా!

లక్ష కోట్ల హార్టికల్చర్‌ హబ్‌ అంటున్నారు.. 

ముందు రాయలసీమ రైతు కన్నీళ్లు చూడండి చంద్రబాబూ!

  హార్టికల్చర్‌ హబ్‌ పేరుతో భవిష్యత్తు మాటలు కాదు.. నేడు రైతుకు నీరు, గిట్టుబాటు ధర, భరోసా కావాలి: భూమన కరుణాకర్‌రెడ్డి

 తిరుపతి:  రాయలసీమను లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ఒకవైపు భారీ పెట్టుబడుల ప్రకటనలు చేస్తూనే మరోవైపు రాయలసీమలో రైతులు సాగునీరు లేక, పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

చెరువుల్లో నీళ్లు లేకపోవడం, టమోటా–మామిడి పంటలకు సరైన ధరలు లేక నష్టపోవడం, చీనీ తోటలను కాపాడుకోలేక రైతులు పడుతున్న ఇబ్బందులు, సాగునీటి కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులను ప్రభుత్వం ముందుగా పట్టించుకోవాలని కోరారు. ప్రకటనల్లో రాయలసీమ సస్యశ్యామలంగా కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో రైతు కన్నీళ్లలో ఉన్నాడని అన్నారు.

హార్టికల్చర్‌ హబ్‌ల పేరుతో భవిష్యత్తు ప్రణాళికలు చెప్పడం కంటే ప్రస్తుతం కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు. చెరువులకు నీళ్లు అందించి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు. రాయలసీమ రైతుకు కావాల్సింది ప్రచారం కాదు.. నీరు, ధర, భరోసా అని స్పష్టం చేశారు.

Back to Top