స్థానిక సంస్థల ఎన్నికలకు లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి  

జిల్లా స్థాయిలో లీగల్ టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేయాలి  

నామినేషన్‌ నుంచి కౌంటింగ్‌ వరకు అభ్యర్థులకు అండగా నిలవాలి 

చంద్రబాబు ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొందాం 

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్  సజ్జల రామకృష్ణారెడ్డి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు నామినేషన్‌ నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు అన్ని దశల్లో న్యాయపరమైన అండ అందించేందుకు పార్టీ లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్  సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.

వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులకు లీగల్ సెల్ గట్టిగా అండగా నిలిచిందని అభినందించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా సహకరించాలని సూచించారు. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, పోలింగ్ సందర్భంగా ఎదురయ్యే సమస్యలపై వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అన్నింటిలోనూ విఫలమై సజావుగా స్ధానిక ఎన్నికలు జరిగితే వైయ‌స్ఆర్‌సీపీని ఎదుర్కోలేమన్న కారణంతో పోలీసులను, అధికారులను ఉపయోగించి అక్రమ కేసులు, వేధింపుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసినా ధీటుగా ఎదుర్కొనేందుకు వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ సన్నద్దంగా ఉండాలని సూచించారు. 

ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని లీగల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చోట న్యాయవాదులను అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా సెంట్రల్ ఆఫీస్‌లో లీగల్ వార్‌రూమ్ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.

లీగల్ సెల్ నాయకులు టీమ్ స్పిరిట్‌తో పనిచేయాలని, యువ న్యాయవాదులతో పాటు పార్టీ పట్ల సానుభూతి కలిగిన అనుభవజ్ఞులైన న్యాయవాదుల సేవలను కూడా వినియోగించుకోవాలని కోరారు.

అభ్యర్థుల నామినేషన్లకు లీగల్ సెల్ రక్షణగా నిలవాలి: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేసేలా అవసరమైన న్యాయ సహకారం అందించాలని కోరారు.

అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీలు, పోలీస్ క్లియరెన్స్ తదితర పత్రాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లీగల్ సెల్ ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలన్నారు. నామినేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే వెంటనే న్యాయపరంగా స్పందించాలని సూచించారు.

ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లా స్థాయి లీగల్ నాయకులు పూర్తి సమయం కేటాయించి పార్టీ అభ్యర్థులకు బ్యాక్‌బోన్‌గా నిలవాలని కోరారు. నియోజకవర్గ స్థాయి లీగల్ సెల్ అధ్యక్షులు పార్టీ ఇన్‌చార్జులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.

ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా ముందస్తు కార్యాచరణ అవసరం: లేళ్ల అప్పిరెడ్డి

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, గత ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అందించిన సహకారాన్ని అభినందించారు.

నామినేషన్లకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు ముందుగానే సిద్ధం చేయించడం, నామినేషన్లు సక్రమంగా దాఖలు చేయించడం, ఎన్నికల సమయంలో ఎదురయ్యే సమస్యలను రిటర్నింగ్ అధికారుల నుంచి రాష్ట్ర లీగల్ సెల్ వరకు వెంటనే తీసుకెళ్లేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.

సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నియోజకవర్గాలు, ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా లీగల్ సెల్ ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని కోరారు

ప్రతి మండలానికి న్యాయవాది అందుబాటులో ఉండాలి: లీగల్ సెల్ నాయకత్వం

వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జితో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు.

అవసరమైతే ప్రతి మండలానికి ఒక న్యాయవాదిని కేటాయించి, నామినేషన్లకు ముందే అభ్యర్థులకు అవసరమైన నో డ్యూస్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు, కేసులకు సంబంధించిన వివరాలు, ఇతర పత్రాలను సిద్ధం చేయించాలని చెప్పారు.

నామినేషన్ పత్రాల తయారీ, అఫిడవిట్లు, స్క్రూటినీ సమయంలో అభ్యర్థులకు న్యాయవాదులు ప్రత్యక్షంగా సహకరించాలని సూచించారు. నామినేషన్ తిరస్కరణ జరిగితే వెంటనే సంబంధిత అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించాలన్నారు.

పోలింగ్ సమయంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఎన్నికల కమిషన్‌, జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. పోలింగ్‌, కౌంటింగ్ పూర్తయ్యే వరకు లీగల్ సెల్ నాయకులు, న్యాయవాదులు అభ్యర్థులకు అందుబాటులో ఉండాలని కోరారు.

జూమ్ కాన్ఫరెన్స్‌లో వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న న్యాయవాదులు పాల్గొన్నారు.

Back to Top