పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పేర్కొన్నారు. వర్షాలు లేక పంట పొలాలు బీడు పొలాలుగా మారుతున్నా ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు తాండవిస్తోందని, చంద్రబాబు కరువు కవల పిల్లలని విశ్వేశ్వరరాజు వ్యాఖ్యానించారు. అల్లూరి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం సరికాదన్నారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అల్లూరి సీతారామరాజు జిల్లాను మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, కరువు పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని విశ్వేశ్వరరాజు కోరారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తూ, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు.