తాడేపల్లి : రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాల్లో 10 జిల్లాలు, 303 మండలాలను కలుపుతూ రూ.1 లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికపై పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. రూ.40,352 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలు లేవని, ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ప్రపంచ బ్యాంకు ఆగస్టు 19, 2026న భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖకు రాసిన లేఖలో ఏపీ ప్రభుత్వం పదేళ్ల కాలానికి రూ.30 వేల కోట్లు (3.25 బిలియన్ అమెరికన్ డాలర్లు) బాహ్య ఆర్థిక సహాయం కోరినట్లు ఉందని నాగిరెడ్డి తెలిపారు. అయితే ప్రారంభ దశలో ప్రపంచ బ్యాంకు 300 మిలియన్ డాలర్లు మాత్రమే ప్రతిపాదించిందని, ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరితేనే అదనపు రుణాన్ని పరిశీలిస్తామని పేర్కొందని వివరించారు. ఆ లేఖలో రూ.40,352 కోట్ల రుణానికి తుది ఆమోదం లేదని స్పష్టం చేశారు. రూ.40,352 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణం కాదని, అది పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లో ప్రతిపాదించిన మొత్తం మాత్రమేనని నాగిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు రూ.20,884 కోట్లు, ఉద్యానవన రంగానికి రూ.14,906 కోట్లు, గ్రామీణ రహదారులకు రూ.4,562 కోట్లు కలిపి రూ.40,352 కోట్లుగా చూపించారని తెలిపారు. దీనికి అదనంగా రూ.60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని చెబుతూ మొత్తం ప్రాజెక్టు విలువను రూ.1 లక్ష కోట్లుగా పేర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రూ.40,352 కోట్లకు ప్రపంచ బ్యాంకు బోర్డు ఆమోదం, రుణ ఒప్పందం ఎప్పుడు జరిగిందో ప్రభుత్వం వెల్లడించాలని నాగిరెడ్డి కోరారు. రూ.40,352 కోట్లలో కేంద్రం, రాష్ట్రం, ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థల వాటా ఎంత? రూ.60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులకు ఎన్ని ఎంవోయూలు జరిగాయి? ఫైనాన్షియల్ క్లోజర్ ఎంతవరకు వచ్చింది? రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇప్పటివరకు ఎంత కేటాయించి, ఎంత విడుదల చేసి, ఎంత ఖర్చు చేశారో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు. రాయలసీమ ఇప్పటికే ఉద్యానవన పంటల ఉత్పత్తిలో కీలక ప్రాంతంగా ఉందని నాగిరెడ్డి పేర్కొన్నారు. మామిడి, ఉల్లి, అరటి, చినీ, టమాటా, పుచ్చ, కర్బూజ వంటి పంటలు విస్తృతంగా సాగవుతున్నాయని తెలిపారు. ఇటీవల పంటలకు నష్టాలు ఎదురైన రైతులకు అండగా నిలవకుండా కొత్త హబ్ పేరుతో ప్రచారానికి పరిమితం కావడం సరికాదన్నారు. హార్టికల్చర్ హబ్‌పై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి, ప్రచార సంఖ్యలు కాకుండా ప్రాజెక్టు వాస్తవాలు, నిధుల వివరాలు, రైతులకు కలిగే ప్రత్యక్ష ప్రయోజనాలను స్పష్టంగా వెల్లడించాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.