తిరుపతి: శ్రీ సిటీ సెజ్‌లోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు అక్కడే ఉన్నట్లు వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి ఎలాంటి ఆలస్యం లేకుండా మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే అత్యున్నత వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. పేలుడు ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎంపీ కోరారు. పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అవసరమైన సహాయాన్ని అందించాలని డాక్టర్ మద్దిల గురుమూర్తి కోరారు.