తాడేపల్లి: జగన్ గారి హయాంలో పేదల ఇళ్ల కోసం జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన వాస్తవాలను దాచిపెట్టి తెనాలిలో కూటమి ప్రభుత్వం మరో క్రెడిట్ చోరీకి పాల్పడిందని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకే చంద్రబాబు అబద్ధాల ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. నేడు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇచ్చిన డేటా ప్రకారమే మొత్తం 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి, 22,80,358 ఇళ్లు మంజూరు చేశామని గుర్తుచేశారు. ఇందులో 9,02,000 ఇళ్లు నిర్మాణం పూర్తయితే, మరో 2 లక్షల ఇళ్లు ముగింపు దశలో ఉన్నాయని, మౌలిక వసతుల కోసం రూ.32,909 కోట్లు వ్యయం చేశామని గణాంకాలతో సహా వివరించారు. ఇంతటి మహోన్నతమైన పథకాన్ని చూసి ఓర్వలేకనే వెన్నుపోటు పార్టీ నాయకులు గతంలో కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు వేసి అడ్డుకున్నారని అంబటి మురళీకృష్ణ మండిపడ్డారు. అమరావతిలో 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే సుప్రీంకోర్టు దాకా వెళ్లి స్టే తెప్పించి, పేదలను రోడ్డున పడేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, వైఎస్ జగన్ గారు అర్ధాంతరంగా ఆపిన ఇళ్లను కూడా పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమక్షంలో వాస్తవాలను దాచిపెట్టి జగన్ గారిపై విమర్శలు చేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలోని 388 కరువు మండలాలు, రైతుల గిట్టుబాటు ధరలు, తక్షణ కరువు సాయం వంటి ప్రధాన సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. పేదల ఇళ్లు, రైతుల సమస్యలు, బియ్యం అక్రమ రవాణా అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పాలని అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... - 10 వేల కోట్లు ఖర్చు చేశామని మీరే అంగీకరించారు: జగన్ గారు పేదలందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు, 22,80,358 ఇళ్లు మంజూరు చేశారు, 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. సుమారు 9,02,000 ఇళ్లు నిర్మాణం పూర్తి చేశాం, మరో 2 లక్షల ఇళ్లు ముగింపు దశలో ఉన్నాయి, 11.61 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మౌలిక వసతుల కోసం రూ.32,909 కోట్లు ఖర్చు చేశాం, పేదలకు పంపిణీ చేసిన స్థలాల విలువ రూ.76 వేల కోట్లు. పేదల ఇళ్ల కార్యక్రమం జరగకూడదని అప్పటి ప్రతిపక్షంగా ఉన్న వెన్నుపోటు పార్టీ వివిధ కోర్టుల్లో సుమారు వెయ్యి కేసులు వేసింది. అమరావతి రాజధానిలో 50 వేల మంది పేదలకు పట్టాలు ఇస్తామంటే వెన్నుపోటు పార్టీ కోర్టుకు వెళ్లింది, సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసింది, జగన్ గారు సుప్రీంకోర్టులో స్టేను వెకేట్ చేయించి పేదలకు పట్టాలు ఇచ్చారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న వాస్తవ డేటాను ప్రజల ముందు పెట్టాలి. మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఇచ్చిన లెక్కల్లోనే జగన్ గారి హయాంలో స్థలాల కోసం రూ.10,414 కోట్లు ఖర్చు చేసినట్లు ఉంది. మరి స్థలాలు లేకుండా ఈ రూ.10,414 కోట్లు ఎలా ఖర్చవుతాయి? ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ఈ వాస్తవాలను దాచిపెట్టి జగన్ గారిపై విమర్శలు చేయడం ఎందుకు? - రెండేళ్లుగా ఇళ్లు పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం ఏం చేసింది?: తెనాలి నియోజకవర్గంలో మరో క్రెడిట్ చోరీకి అంకురార్పణ జరిగింది. జగన్ గారు ప్రారంభించి సగం పూర్తి చేసిన ఇళ్ల నిర్మాణాలను కొనసాగించకుండా రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వం ఏం చేసింది? పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పేదలకు పట్టాభిషేకం పేరుతో కొత్త కార్యక్రమాలు చేపట్టడం పేదలను మోసం చేయడం కాదా? జగన్ గారు పేదల కోసం చేసిన కార్యక్రమాలను తమ కార్యక్రమాలుగా చెప్పుకునే క్రెడిట్ చోరీ ఇక నడవదు. పేదల ఇళ్లపై ఉన్న వాస్తవాలను కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గారి ముందు ఎందుకు చెప్పలేదు? జగన్ గారు చేసిన ఇళ్ల నిర్మాణం గురించి వాస్తవాలు చెప్పకుండా, ఆయనపై విమర్శలు చేసే విధంగా కేంద్ర మంత్రిని తప్పుదోవ పట్టించారు. పేదల కోసం జగన్ గారు చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షలకు పైగా మంజూరైన ఇళ్లు, పూర్తయిన సుమారు 9 లక్షల ఇళ్ల వివరాలు ప్రభుత్వ రికార్డుల్లోనే ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి పేదలకు పట్టాభిషేకం పేరుతో ప్రచారం చేయడం కాదు, జగన్ గారు ప్రారంభించిన మిగిలిన ఇళ్లను పూర్తి చేసి చూపించాలి. - శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను వ్యవసాయ శాఖ మంత్రి అని ఎందుకు చెప్పలేదు?: కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖలకు బాధ్యత వహిస్తున్న కేంద్ర మంత్రి. అలాంటి మంత్రిని కార్యక్రమానికి పిలిచి ఆయన పేరుతో కేవలం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగానే ప్రచారం చేశారు. రాష్ట్రంలో 688 మండలాల్లో 388 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన విషయం ఆయన దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ధాన్యానికి, పత్తికి, మొక్కజొన్నకు, కందికి, పెసరకు, మినుముకు గిట్టుబాటు ధరలు లేవు. రైతులు అల్లాడిపోతున్నారు. కరువు మండలాలకు తక్షణ సాయం ఏమిస్తారు, రైతులకు పెట్టుబడి సాయం ఏమిస్తారు, పంటలకు గిట్టుబాటు ధర ఎలా కల్పిస్తారు అని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గారిని అడిగే అవకాశం సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేదా? చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో కూడా కరువు మండలాలు ఉన్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. మరి కుప్పంలో కరువు పరిస్థితిని కూడా కేంద్ర మంత్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? రైతుల ఆవేదనను పట్టించుకోకుండా జగన్ గారిపై విమర్శలు చేయడానికే కేంద్ర మంత్రిని ఉపయోగించుకోవడం సరికాదు. - సీజ్ ద షిప్.. దొంగ బియ్యంపై విచారణకు సిద్ధమా?: మంత్రి నాదెండ్ల మనోహర్ గారు జగన్ గారి హయాంలో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని విచారణ చేస్తామని అంటున్నారు. విచారణకు మేము సిద్ధం, ఏ ఆరోపణపైనైనా విచారణ చేయండి. అదే విధంగా కాకినాడలో సీజ్ ద షిప్ అంటూ దొంగ బియ్యం రవాణాను ఆపినట్లు వారు చేసిన ప్రచారంపై విచారణకు మీరు సిద్ధమా? ప్రతి నియోజకవర్గంలో పేదల బియ్యాన్ని చౌకధరలకు తీసుకుని రాష్ట్ర సరిహద్దులు దాటి తరలిస్తున్నారనే ఆరోపణలపై సివిల్ సప్లయిస్ శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ విచారణకు సిద్ధంగా ఉన్నారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సింది జగన్ గారు కాదు, ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు, మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, మంత్రి నాదెండ్ల మనోహర్లే సమాధానం చెప్పాలని అంబటి మురళీకృష్ణ డిమాడ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకే చంద్రబాబు అబద్ధాల ప్రచారానికి తెరలేపారని, దొంగ ఓట్లను అడ్డంపెట్టుకుని గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంల మీద ప్రజల్లో ఉన్న అనుమానాలను ప్రస్తావిస్తూ.. కచ్చితంగా ఓటర్ లిస్ట్ సరిచేసి ఎన్నికలకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. మసిపూసి మారేడికాయ చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా పేదలందరికీ జగనన్న కాలనీలే శ్రీరామరక్ష అని, రైతన్నలకు న్యాయం జరగాలన్నా, పేదల సంక్షేమం మళ్లీ రావాలన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని అంబటి మురళీకృష్ణ తేల్చిచెప్పారు.