పరిషత్‌ ఎన్నికల్లో పచ్చ ముఠాల అరాచకం

ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యం పాలు

వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై యథేచ్ఛగా దాడులు.. దౌర్జన్యాలు.. కిడ్నాప్‌లు.. 

తొలుత నామినేషన్లు వేయకుండా అడ్డంకులు.. ఆపై పరిశీలనలో తిరస్కరణలు

అయినా సరే బరిలో మిగిలిన వారిని తప్పించేందుకు కుట్రలు

బెదిరించి విత్‌డ్రా ఫారాలపై బలవంతంగా సంతకాలు

మాట వినని వారి సంతకాలు ఫోర్జరీ.. ఉరవకొండలో విపక్ష అభ్యర్థులపై జీఎస్టీ అధికారులను ప్రయోగించిన మంత్రి పయ్యావుల 

కనిగిరిలో పోలీసుల బెదిరింపులు

వేమూరులో ఎంపీటీసీ అభ్యర్థి కిడ్నాప్‌

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నామినేషన్ల విత్‌డ్రా పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టించిన ఖాకీలు

తాడేప‌ల్లి: స్థానిక ఎన్నికల్లో ప్రజా మద్దతుతో గెలవలేమన్న భయంతో పచ్చ ముఠాలు పోటీ లేకుండా చేసుకునేందుకు యథేచ్ఛగా అరాచ­కాలకు పాల్పడుతున్నాయి. అధికార పార్టీ నేతలు బరి తెగించి పోలీస్‌ వ్యవస్థను అడ్డగోలుగా దుర్విని­యోగం చేస్తున్నారు. విపక్షం అసలు నామినేషన్‌ వేయకుండా బెదిరించేందుకు తొలుత బైండోవర్‌  కుట్రలకు తెర తీశారు. వీటికి వెరవకుండా నామినేషన్లు వేసేందుకు ముందుకొచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు, నాయకులపై పోలీసుల సహకారంతో టీడీపీ గూండాలు దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. 

అనంతరం నామినేషన్ల పరిశీలన దశలో ఎన్నికల అధికారులను లొంగదీసుకుని సాకులతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. ఈ అరాచక పర్వం ఇంతటితో ఆగలేదు.. బరిలో మిగిలిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను సైతం పోటీలో లేకుండా చేసేందుకు బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు లాంటి అకృత్యాలను అధికార పక్షం నిర్భీతిగా కొనసాగిస్తోంది. ప్రతిపక్ష అభ్యర్థులను బరిలో లేకుండా చేయడమే లక్ష్యంగా అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్య ప్రక్రియను దారుణంగా అపహాస్యం పాలు చేస్తోంది. 

విపక్ష అభ్యర్థుల సంతకాలను పచ్చ నేతలు ఫోర్జరీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువునా ఖూనీ చేస్తున్నారు. మరోవైపు ఖాకీలు ఈ అరాచకాలకు కొమ్ము కాస్తూ ప్రతిపక్ష అభ్యర్థులను తీవ్రంగా వేధిస్తున్నారు. వేమూరు, కనిగిరి, తొండూరు, తాడిపత్రి, వైఎస్సార్‌ జిల్లా పరిధిలో ఆదివారం చోటు చేసుకున్న ఘటనలు స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీ దారుణ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

వేమూరులో ఎంపీటీసీ అభ్యర్థి కిడ్నాప్‌..
బాపట్ల జిల్లా వేమూరు మండలం బలిజేపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొట్లూరు మరియదాసు కిడ్నాప్‌ ఘటన తీవ్ర కలకలం రేపింది. అబ్బనగూడవల్లికి చెందిన మరియదాసు ఎస్టీ రిజర్వుడ్‌ స్థానంలో వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. శనివారం నామినేషన్‌ పరిశీలనలో ఎలాంటి లోపాలు లేవని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో కొందరు వ్యక్తులు మరియదాసును ఇంటి నుంచి కిడ్నాప్‌ చేశారు. 

ఆయన ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యలు తెలిపారు. వైఎస్సార్‌ సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు, మరియదాసు తల్లి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరియదాసును కిడ్నాప్‌ చేసి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పార్టీ కార్యాలయంలో నిర్బంధించనట్లు తమకు సమాచారం ఉందని అశోక్‌బాబు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని కిడ్నాప్‌ చేయడంపై విచారణ జరపాలని, తక్షణం మరియదాసును కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..
అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద జేసీ వర్గీయులు మోహరించి వీరంగం వేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్దారెడ్డిని చంపుతామంటూ బెదిరింపులకు దిగారని, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడ్డాయి. పెద్దారెడ్డి స్వగ్రామం సింగనమల నియోజకవర్గం తిమ్మంపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నామినేషన్‌ వేయకుండా అడ్డుకుని పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకుని పెద్దారెడ్డి ఆదివారం ఉదయం అక్కడికి వెళ్లారు. అయితే ఆయన లేని సమయంలో జేసీ వర్గీయులు అనంతపురంలోని పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకుని హల్‌చల్‌ చేశారు.  తిమ్మంపల్లికి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అనంతపురానికి తీసుకొచ్చి గృహ నిర్భంధంలోకి తీసుకున్నారు.

కనిగిరిలో నామినేషన్‌ వేస్తే కేసులా?
మార్కాపురం జిల్లా కనిగిరిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులపై పోలీసులు బెదిరింపులకు దిగారు. నామినేషన్లు వేయవద్దని సీఐ ఎం.సుబ్రహ్మణ్యం, ఎస్సై జి.సందీప్‌కుమార్‌ హెచ్చరించారని మండల పార్టీ అధ్యక్షుడు, ఎంపీటీసీ అభ్యర్థి మడతల కస్తూరిరెడ్డి ఆరోపించారు. తాను, తన భార్య నామినేషన్లు వేయడానికి సిద్ధం కాగా ఎస్సై తమను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి బెదిరించారని కస్తూరిరెడ్డి పేర్కొన్నారు. మాట వినకుండా పోటీ చేస్తే గంజాయి కేసులు, ఇతర అక్రమ కేసులు బనాయిస్తామని, ఎన్నికల తరువాత కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లు చెప్పారు. అయినా తాము వెనక్కి తగ్గకుండా నామినేషన్లు వేసేందుకు వెళ్లడంతో ఆంక్షల పేరుతో దాడి చేసి తిరిగి తమపైనే కేసులు పెట్టారని కస్తూరిరెడ్డి తెలిపారు.

తొండూరులో అర్హతలున్నా తిరస్కరణ?
వైఎస్సార్‌ జిల్లా తొండూరు జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన కొప్పల శివశంకర్‌రెడ్డి తన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అవసరమైన పత్రాలు, ఆస్తుల వివరాలు, బ్యాంకు లావాదేవీల సమాచారాన్ని సమర్పించినప్పటికీ నామినేషన్‌ను తిరస్కరించారన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎన్నికల అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారని మండిపడ్డారు. తొండూరు జడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థికి సన్నిహితుడైన ఇనగలూరుకు చెందిన చిట్టిబోయిన గోపాల్‌ వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్‌ వేసినట్లు చూపించారన్నారు. ఈ విషయాన్ని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ద్వారా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని, న్యాయం జరగకుంటే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

కడప ప్రచారంలో కత్తితో దాడి.. ఇద్దరికి గాయాలు
వైఎస్సార్‌ జిల్లా కడప 41వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరికి  తీవ్ర గాయాలయ్యాయి.  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల, మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా సయ్యద్‌ బాషా అనే వ్యక్తి కత్తితో దూసుకొచ్చాడు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మాజీ కార్పొరేటర్‌ షంషీర్, ఖాలీద్‌ హుస్సేన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్‌సీపీ నేతలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌ బాషా పరామర్శించారు. ప్రతిపక్షాలపై భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు.

జగ్గంపేటలో బలవంతంగా విత్‌డ్రా..
జగ్గంపేట మండలంలో నామినేషన్‌ వేసిన తమ ఎంపీటీసీ అభ్యర్థులను కూటమి నేతలు బలవంతంగా విత్‌డ్రా చేయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జగ్గంపేట మండల అధ్యక్షుడు, జడ్పీటీసీ అభ్యర్థి రావుల గణేష్‌ రాజా ఆరోపించారు. మండలంలోని జై.కొత్తూరులో వైఎస్సార్‌ సీపీకి చెందిన నిడమర్తి వేణి, జ్యోతి మువ్వలా నామినేషన్‌లు ఉపసంహరించుకునేలా బెదిరించారన్నారు. జగ్గంపేట మండలంలో అనేక చోట్ల కూటమి నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.

ఉరవకొండలో పయ్యావుల బెదిరింపులు..
అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను బరి నుంచి తప్పించేందుకు మంత్రి పయ్యావుల కేశవ్‌ జీఎస్టీ అధికారులను ప్రయోగించి బెదిరింపులకు దిగారు. ఉరవకొండలో రెండు ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ తరపున జకీర్, షమ్ము నామినేషన్లు వేశారు. టీడీపీ నేతలు బెదిరించినా వారు లెక్క చేయకుండా నామినేషన్‌ వేయడంతో మంత్రి పయ్యావుల కక్ష కట్టారు. ఈ నేపథ్యంలో బంగారం వ్యాపారం నిర్వహిస్తున్న అభ్యర్థుల షాపులపై జీఎస్టీ అధికారులతో దాడులు చేయించి బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చారు.

అభ్యర్థులతో విత్‌డ్రా సంతకాలు తీసుకున్న పోలీసులు
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పోలీసుల ఆగడాలకు తెర పడలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో లేకుండా చేసేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తూ స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారు. సత్తెనపల్లి నియోజవకర్గంలో 41ఎంపీటీసీ, చిలకలూరిపేట నియోజకవర్గంలో 3 ఎంపీటీసీ, వినుకొండలో 5 ఎంపీటీసీ నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి జమ్మలమడక ఆదిబాబు, డమ్మీ అభ్యర్థి మైలా రాజేష్‌లను పోలీసులు బెదిరించి నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టించారు.

అధికారపక్షం ఆగడాలెన్నో..
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఏకగ్రీవం కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడ్డారు. పలుచోట్ల ఎంపీటీసీ అభ్యర్థులను సైతం బెదిరించి దారికి తెచ్చుకునే యత్నాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని నాలుగు ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు శనివారం తిరస్కరించడంతో అప్పీల్‌ చేశారు. అయితే అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగిపోయిన అధికారులు వాటిని తిరస్కరిస్తున్నట్టు ఆదివారం ప్రకటించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరిలోనూ మున్సిపల్‌ మేయర్‌ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించడంతో మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అధికార పక్షానికి కొమ్ముకాస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని రోజా ప్రకటించారు.

 

Back to Top