వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను చూసి భయమెందుకు?

 మంత్రి సవితకు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ సూటి ప్రశ్న

 శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గంలో నిజంగా అభివృద్ధి చేసి, ప్రజలకు మేలు చేసి ఉంటే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను చూసి భయపడాల్సిన అవసరం ఏముందని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ మంత్రి సవితను ప్రశ్నించారు. సోమందేపల్లి మండలం ఈదులబలాపురం గ్రామంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమై ఎన్నికల పరిస్థితులు, ప్రజా సమస్యలు, నామినేషన్ల ప్రక్రియపై చర్చించారు.

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైయస్‌ఆర్‌ రైతు భరోసా, వైయస్‌ఆర్‌ ఆసరా, చేయూత, నాడు–నేడు, ఇళ్ల స్థలాల పంపిణీ, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులకు అండగా నిలిచామని ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పటివరకు ఎన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలే ఎన్నికల్లో మాట్లాడాలని, ప్రత్యర్థి అభ్యర్థులను అడ్డుకోవడం కాదని ఉషశ్రీ చరణ్ స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించివేసిన ఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి వైయస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో అందించిన సంక్షేమాన్ని వివరించాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. 

Back to Top