నంద్యాల: నంద్యాల మున్సిపాలిటీలోని 52 వార్డులకు 52 వార్డుల్లోనూ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను బరిలో నిలిపి, పార్టీ జెండా ఎగరేస్తామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 7, 8, 10, 11వ వార్డుల్లో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అమీర్ బాషా (దాల్మిల్ అమీర్), కౌన్సిలర్ అభ్యర్థులు చిల్లు భాయ్ ఏజాజ్ హుస్సేన్, షేక్ అబ్దుల్ మజీద్, దండే సుధాకర్, షేక్ అబ్దుల్ కలాం బాషాలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మండిపడ్డారు. నిరుపేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. నంద్యాలలో 25 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్న కూటమి నేతలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని నిలదీశారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీలు, పొదుపు సంఘాల రుణమాఫీ, మహిళలకు రూ.15 వేల ఆర్థిక సాయం, 50 ఏళ్లలోపు మహిళలకు ఏడాదికి రూ.18 వేల సాయం వంటి హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో జాప్యంపై ప్రజలకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ పాలనలో నంద్యాల పట్టణంలో ఎనిమిది కొత్త పార్కులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, మిల్క్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయని, నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామని శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తెలిపారు. అమృత్ పథకం ద్వారా పట్టణ తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిని కొనసాగించేందుకు వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, కూటమి ప్రభుత్వ హామీల అమలుపై ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.