సేవ్ వైజాగ్‌

కూట‌మి నుంచి మ‌న  ఆస్తులు కాపాడుకుందాం

వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ మేయర్ అభ్య‌ర్థి వ‌రుదు క‌ళ్యాణి పిలుపు 

విశాఖ న‌గ‌రంలోని ఓ హోట‌ల్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు  కె.కె. 
రాజుతో క‌లిసి మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ మేయర్ అభ్య‌ర్థి, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి

విశాఖ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే వైయ‌స్ఆర్‌సీపీ లక్ష్యం

టాప్‌-5 నగరాల్లో ఒకటిగా విశాఖను తీర్చిదిద్దడమే ల‌క్ష్యంగా కృషి

వైయ‌స్ఆర్‌సీపీ గెలిస్తే అవినీతి రహిత, పార‌ద‌ర్శ‌క పాల‌న 

గెలిచిన వెంట‌నే గీతం భూములు, స్టీల్ ప్లాంట్, సింహాచలం భూముల పరిరక్షణపై తీర్మానాలు 

న‌గ‌రంలో కాలుష్య నియంత్ర‌ణ‌కు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక 

వైయ‌స్ఆర్‌సీపీ  ఎజెండాను మీడియాకు వెల్ల‌డించిన వ‌రుదు క‌ళ్యాణి

 కొండ‌ల విధ్వంసంతో న‌గ‌రంలో తీవ్ర తాగునీటి స‌మ‌స్య 

 బోర్ వెల్స్ కూడా రిపేర్ చేయించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం

 మహిళలకు రూ.54 వేల బకాయి ఎక్కడ? నిరుద్యోగ భృతి ఏమైంది?

 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వ వైఖరేంటి?

 విశాఖకు ఇచ్చిన హామీలు అమలు చేశాకే ఓట్లు అడగాలి

  వ‌రుదు క‌ళ్యాణి డిమాండ్ 

విశాఖ‌ప‌ట్నం:  రెండేళ్ల కూటమి పాల‌న‌లో విశాఖ నగరంలో పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తూ కొండలను తొలిచివేశార‌ని, తాగునీటి స‌మ‌స్య‌తో ప్రజలు అల్లాడిపోతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ మేయ‌ర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. న‌గరంలోని ఓ హోట‌ల్లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆమె పార్టీ జిల్లా అధ్య‌క్షుడు కె.కె.రాజుతో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రావాల్సిన రూ. 54,000 బకాయిలు, పింఛన్ల ద్వారా ఇవ్వాల్సిన రూ. 1.44 లక్షలను ఎగ్గొట్టారని మండిప‌డ్డారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ. 3,000 నిరుద్యోగ భృతిని ఇవ్వకుండా యువతను కూటమి ప్రభుత్వం మోసగించిందని ఇవ‌న్నీ ఇచ్చిన త‌ర్వాతే ప్ర‌జ‌ల‌ను ఓటు అడగాల‌ని డిమాండ్ చేశారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో  వైఎస్ జ‌గ‌న్ గారు విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి విశ్వనగరంగా తీర్చిదిద్దితే, గత రెండేళ్ల కూటమి పాలనలో విశాఖ నగరం సర్వనాశనమైపోయి, ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని కార్మికుల వెంటే నిలిచింది ఒక్క వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమేనని వ‌రుదు క‌ళ్యాణి స్పష్టం చేశారు. 

కూటమి పాలనలో గంజాయి, డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా పెరిగిపోయి మహిళలకు, య‌వతకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో అక్రమ భూకబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని, పేదల ఆస్తులను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. సింహాచలం వద్ద కొండను కొట్టేసి చేసిన పర్యావరణ విధ్వంసం చేస్తున్నార‌ని, ఆ ప్రాంతాన్ని మళ్లీ సుందరంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. మేయర్‌గా గెలిచాక గీతం భూములు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, సింహాచలం అప్పన్న భూముల పరిరక్షణపై మొదటి సంతకం చేసి తీర్మానాలు చేస్తామని ప్రకటించారు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, వైయ‌స్ఆర్‌సీపీ అభివృద్ధి కార్యాచరణను వివరించారు. విశాఖ శ్రేయస్సు కోరే వైయ‌స్ఆర్‌సీపీని గెలిపించి, నగర అభివృద్ధికి సహకరించాలని కె.కె.రాజు, వ‌రుదు క‌ళ్యాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.   

ఆమె ఇంకా ఏమ‌న్నారంటే...

విశాఖ‌ను వేధిస్తున్న తాగునీటి స‌మ‌స్య‌: 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. విశాఖ ప్రజల సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై పోరాడుతున్నాం. విశాఖలో తాగునీటి సమస్య, నిరుద్యోగ యువత ఇబ్బందులు, భూముల పరిరక్షణ, పర్యావరణ విధ్వంసం వంటి అంశాలపై నిరంతరం ప్రజల పక్షాన నిలిచాం. ఈ ఎన్నికలు కేవలం మేయర్ పదవికి సంబంధించినవి కావు. విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, నగర భవిష్యత్తు, ప్రజా ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన ఎన్నికలు. ఒక బీసీ మహిళగా, మీ ఇంటి ఆడబిడ్డగా విశాఖ ప్రజలకు సేవ చేయాలన్నదే నా ఆకాంక్ష. ప్రజలు మాపై నమ్మకంతో బాధ్యత అప్పగిస్తే పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తాను.

హామీల అమలుపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం:

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది. మహిళలకు ఏడాదికి రూ.18 వేల చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పారు. మా లెక్క ప్రకారం మూడేళ్లకు రూ.54 వేలు ఇవ్వాల్సి ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లకు ఒక్కొక్కరికి రూ.1.44 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. ఈ హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలి. విశాఖ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మళ్లీ ఓట్లు అడగడం ఎలా సాధ్యమవుతుంది? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి:

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. స్టీల్ ప్లాంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, వారి కుటుంబాల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనకుండా చర్యలు తీసుకోవాలి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. కేంద్రానికి వినతిపత్రాలు అందించాం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలన్న డిమాండ్‌పై వైయ‌స్ఆర్‌సీపీ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించింది. ఇప్పుడు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న కూటమి నేతలు ప్రైవేటీకరణను ఆపేందుకు ఏ చర్యలు తీసుకున్నారో ప్రజలకు వివరించాలి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో కార్మికుల ప్రయోజనాలే ప్రాధాన్యంగా ఉండాలి.

ప్రజల‌ ఆస్తులను కాపాడటం మా బాధ్యత:

విశాఖలో ప్రభుత్వ, ప్రజా ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి. ప్రజలకు చెందాల్సిన భూములు తిరిగి ప్రజా ప్రయోజనాలకే ఉపయోగపడేలా చూడాలి. సింహాచలం అప్పన్న కొండలు, పర్యావరణానికి సంబంధించిన అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కొండల తవ్వకాలు, పచ్చదనం తగ్గిపోవడం వంటి సమస్యలపై సమగ్ర పరిశీలన చేసి పర్యావరణాన్ని కాపాడాలి. ప్రజా ఆస్తుల విషయంలో ఎలాంటి అక్రమాలకు తావులేని విధంగా చర్యలు తీసుకోవాలి. మేయర్‌గా అవకాశం లభిస్తే గీతం భూముల అంశం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక తీర్మానం, సింహాచలం కొండల పరిరక్షణ వంటి అంశాలపై జీవీఎంసీ వేదికగా తీర్మానాలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాను.

ఖాళీ స్థలాలను హెల్త్‌ అరేనాలుగా అభివృద్ధి చేస్తాం: 

జీవీఎంసీ పరిధిలోని ఖాళీ స్థలాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తాం. కాలనీల్లోని పార్కులు, యోగా ప్రదేశాలు, వ్యాయామ సదుపాయాలతో హెల్త్‌ అరేనాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తాం. స్థానిక కాలనీ అసోసియేషన్లతో చర్చించి వారి సూచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ఖాళీ స్థలాల్లో అక్రమ ఆక్రమణలను తొలగించి ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తాం. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం. విశాఖ బీచ్‌ల అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణ కోసం జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పర్యాటక శాఖ సమన్వయంతో ప్రణాళికలు రూపొందిస్తాం. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే మా లక్ష్యం.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం: 

విశాఖలో తాగునీటి సమస్యను కేవలం తాత్కాలిక చర్యలతో పరిష్కరించలేం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి నిల్వలు, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలి. రిజర్వాయర్ల సామర్థ్యం, నీటి లభ్యత, సరఫరా వ్యవస్థలోని లోపాలను సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. కొండల విధ్వంసం, పర్యావరణ నష్టం వల్ల నీటి వనరులపై పడుతున్న ప్రభావాన్ని శాస్త్రీయంగా పరిశీలించాలి. రిజర్వాయర్లలోకి నీరు చేరే మార్గాలను పరిరక్షించాలి. అవసరమైన చోట అదనపు నీటి నిల్వల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలి. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందేలా కృషి చేస్తాం. బోర్‌వెల్‌ల మరమ్మతులు, రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల సమస్యలను గుర్తించి ప్రాధాన్య క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.

కాలుష్య నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక:

విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అదే సమయంలో పారిశ్రామిక కాలుష్యాన్ని నియంత్రించడం కూడా అత్యంత ముఖ్యం. వన్‌టౌన్‌, గాజువాక, లంకెలపాలెం తదితర ప్రాంతాల్లో కాలుష్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సంబంధిత పరిశ్రమలతో సమన్వయం చేసి సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా గ్రీన్‌బెల్ట్‌ల అభివృద్ధికి కృషి చేస్తాం. జీవీఎంసీ పరిధిలో పచ్చదనం పెంపు, పారిశుద్ధ్యం మెరుగుదల, చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. మురుగునీరు నిలిచిపోయే ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తాం. మురికివాడల్లోని మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి అందేలా కృషి చేస్తాం.

మహిళల భద్రత, యువత భవిష్యత్తుకు ప్రాధాన్యం

మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా తిరగగలిగే నగరంగా విశాఖను తీర్చిదిద్దాలి. గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదకద్రవ్యాల లభ్యతపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సమాధానం చెప్పాలి. విద్యాసంస్థల పరిసరాల్లో మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు అవసరం. మహిళల భద్రతకు వీధి దీపాలు, సురక్షితమైన రహదారులు, ప్రజా ప్రదేశాల్లో తగిన సదుపాయాలు కల్పించాలి. సంబంధిత పోలీసు, ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని మహిళలు, యువతకు భద్రత కల్పించేందుకు కృషి చేస్తాం.

విశాఖను టాప్‌-5 నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం:

విశాఖను దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక అవసరం. మేయర్‌గా అవకాశం లభిస్తే నగరాన్ని టాప్‌-5 నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తాను. అవినీతి రహిత, పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తాను. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తాను. అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతాను. జీవీఎంసీ పరిధిలోని 120 డివిజన్ల ప్రజల అవసరాలను గుర్తించి సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తాను.

సామాజిక న్యాయానికి వైయ‌స్ఆర్‌సీపీ కట్టుబాటు:

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయాల్లో, పాలనలో అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయం. వైఎస్ జగన్ గారి నాయకత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఒక బీసీ మహిళకు మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం ద్వారా ప్రజాసేవకు అవకాశం కల్పించింది. ప్రజల సమస్యలపై పోరాడే బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది. ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నాను. విశాఖ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనకు సంబంధించిన అంశాలను పరిశీలించి మంచి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.  

ప్రజా తీర్పు కోరుతున్నాం:

మీకు ఎవరు సేవ చేశారు, మీ సమస్యలపై ఎవరు పోరాడుతున్నారు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏవి అమలయ్యాయి అన్నది విశాఖ ప్ర‌జ‌లు ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి. మేయర్ అభ్యర్థిగా నన్ను, వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులను ఆదరించండి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మాకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నాను. విశాఖ అభివృద్ధి, ప్రజా ఆస్తుల పరిరక్షణ, తాగునీటి సమస్య పరిష్కారం, మహిళల భద్రత, పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తాం. సేవ్ వైజాగ్ – ప్రజా ఆస్తులను కాపాడుకుందాం, విశాఖ అభివృద్ధికి కృషి చేద్దాం అని వ‌రుదు క‌ళ్యాణి  పిలుపునిచ్చారు.

Back to Top