న‌వంబర్‌ 1న ప్రజాస్వామ్యానికి చీకటి రోజు!

మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు, దాడులతో బరితెగించిన కూటమి ప్రభుత్వం

ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వైఫల్యం

వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఆగ్రహం

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ నేతల ధర్నా

ప్రభుత్వ, ఎన్నికల కమిషన్‌ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు

ఎన్నికల అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వినతిపత్రం అందజేత

ధర్నాలో పాల్గొన్న‌ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లా, పార్టీ నేతలు 
న‌మారు చంద్రశేఖర్‌రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు

విజయవాడ: విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. నవంబర్‌ 1న రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయాయని వారు అభివర్ణించారు. కూటమి నేతలు పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించడం, వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించడం, అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడటం వంటి ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో తన బాధ్యతను నిర్వర్తించాల్సిన కమిషనర్‌ నిస్సహాయత వ్యక్తం చేయడం రాజ్యాంగబద్ధ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో పోలింగ్‌ రద్దు చేసి, రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ, అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మీడియా సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఏమన్నారంటే..

- ఎన్నిక‌ల ప్ర‌క్రియ అప‌హాస్యం: లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నవంబర్‌ 1 ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వాల హయాంలో అనేకసార్లు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నట్లుగా ఇంతటి అరాచకాలు, అక్రమాలు గతంలో ఎప్పుడూ చూడలేదు. పోలీసులను, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేస్తూ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు.

-  బ్యాలెట్‌ను ఎదుర్కోలేక బుల్లెట్‌ బాట

ప్రజలపై నమ్మకం ఉంటే బ్యాలెట్‌ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. కానీ కూటమి పార్టీలు బ్యాలెట్‌తో ఎన్నికలకు వెళితే ఓటమి తప్పదనే భయంతో బుల్లెట్‌ను నమ్ముకున్నాయి. నామినేషన్ల దశ నుంచే అక్రమాలు ప్రారంభమయ్యాయి. కుల ధృవీకరణ పత్రాలు, ఇతర ధ్రువపత్రాల విషయంలో అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేశారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, స్క్రూటినీలో నామినేషన్లు తిరస్కరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. మిగిలిన అభ్యర్థులు పోటీలో ఉంటే ఇప్పుడు పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించి ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారు.

- ఎన్నికల కమిషన్ చేతులెత్తేసింది

రాష్ట్రంలో 12,724 పోలింగ్‌ కేంద్రాలు ఉంటే 6 నుంచి 7 వేల కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన కేంద్రాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. హైకోర్టు, సుప్రీంకోర్టు సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించినా అమలు చేయడం లేదు. మేము ఎన్నికల కమిషనర్‌ను కలిసి పరిస్థితులను వివరించగా, తనకు అధికారాలు లేవని, చట్టాలను మార్చుకోవాలని చెబుతున్నారు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అధిపతి ఇలా చేతులెత్తేయడం ప్రజాస్వామ్యానికి అవమానం.

- అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలి

పులివెందుల, కడప, మదనపల్లె, చిత్తూరు, చీమకుర్తి, మాచర్ల, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో అనేక అక్రమాలు జరిగాయి. వీటన్నింటిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందించాం. అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్‌ నిర్వహించాలి. ఎన్నికల కమిషన్‌ ఒక నిష్పక్షపాత సంస్థగా పనిచేయాలి. ఒకవైపు రాజకీయ పార్టీలతో పోరాడుతూనే, మరోవైపు ఎన్నికల సంఘం వైఫల్యంపై న్యాయపోరాటం కూడా కొనసాగిస్తాం.

 - ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే: మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కూటమి నాయకులు అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. అభ్యర్థులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా భయపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్‌, అధికారులు, పోలీసులపై ఉంది. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల కమిషనర్‌ను కలిసి జరిగిన అక్రమాలన్నీ వివరించి చర్యలు తీసుకోవాలని కోరాం. కానీ ఆయన నిస్సహాయతను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగాలి. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవస్థలు పనిచేస్తే ప్రజల ఓటు హక్కుకు విలువ ఏముంటుంది? కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను తనకు అనుకూలంగా నడిపిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి దురదృష్టకరం. పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించి ఇష్టానుసారంగా వ్యవహరించిన ప్రాంతాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. 

- మహిళలపై దాడులు చేస్తున్న టీడీపీ శ్రేణులు: కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదులు ఇచ్చినా స్పందన లేదు. ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించి వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేశారు. పులివెందులలో 70 మంది ఏజెంట్లను బయటకు పంపించడంతో పాటు మహిళలపైనా దాడులకు పాల్పడ్డారు.

- మహిళా అభ్యర్థులపైనా దాడులు

పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ప్రమిళమ్మపై ఉదయం ఆరు గంటలకే దాడి చేశారు. జమ్మలమడుగులో హైమావతిపై కూడా దాడికి పాల్పడ్డారు. విశాఖ మేయర్‌ అభ్యర్థి వరుడు కల్యాణిపై సైతం దాడి చేశారు. మహిళలు ఓటు వేయడానికి ముందుకు వస్తున్న సమయంలో వారిపై కర్రలతో దాడులు చేయడం దారుణం. మహిళలను రక్షించాల్సిన బాధ్యత ఉన్నవారే దాడులకు పాల్పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్రంలో ఇంతటి దారుణాలు జరుగుతుంటే ఎన్నికల కమిషనర్‌ స్పందించాల్సిన అవసరం లేదా? మేము ఫిర్యాదు చేస్తే మా పరిధిలో లేదని, కేంద్ర కార్యాలయం నుంచి అనుమతులు, కేంద్ర బలగాలు తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణ బాధ్యతలో ఉన్న కమిషనర్‌ ఇలా సమాధానం చెప్పడం బాధాకరం. ఎక్కడైతే అక్రమాలు జరిగాయో అక్కడ ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్‌ నిర్వహించాలి.

 -  వందలాది ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు శూన్యం: రుహుల్లా, ఎమ్మెల్సీ

గత 15 రోజులుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వద్దకు వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను వివరిస్తున్నాం. వైయ‌స్ఆర్‌సీపీ తరఫున వందలాది ఫిర్యాదులు అందించాం. అభ్యర్థులను కొట్టడం, నామినేషన్‌ పత్రాలను చించివేయడం, పోలింగ్‌ సమయంలో రిగ్గింగ్‌కు పాల్పడటం వంటి ఘటనలను వివరించాం. అయినా ఎన్నికల కమిషన్‌ నుంచి సరైన స్పందన లేదు. ఒక రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ఎన్నికల కమిషనర్‌ ప్రజాస్వామ్య పరిరక్షణకు బాధ్యత వహించాలి. కానీ మేము జరిగిన అక్రమాలను వివరించినప్పుడు ఆయన తన వల్ల ఏమీ కాదన్నట్లుగా సమాధానం ఇచ్చారు. ఎన్నికల కమిషనర్‌ ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారనే విషయం ఆయన స్పందనతో స్పష్టమైంది.

Back to Top