పోలింగ్ ప్రక్రియను ఓ ప్రహసనంలా మార్చేశారు

కృత్రిమ విజయం కోసం చంద్రబాబు బరితెగింపు

రీపోలింగ్ కోరతాం, మళ్లీ న్యాయస్దానాల్ని ఆశ్రయిస్తాం

తేల్చిచెప్పిన వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి

స్ధానిక ఎన్నికల్లో పరాకాష్టకు కూటమి కుట్రలు

అక్రమాలపై ముందే అప్రమత్తమై సుప్రీంకోర్టుకెళ్లాం

సుప్రీం ఆదేశాల్నీ ఎస్ఈసీ పట్టించుకోలేదు

విపక్షాన్ని నిస్సహాయస్దితిలోకి నెట్టాలని చూశారు

సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్

పిరికిపంద చంద్రబాబులా బాయ్ కాట్ చేయలేదు

ఎన్నికల్లో తుదికంటా పోరాడాలని భావించాం

అందుకే ఇన్ని కుట్రల్ని తట్టుకుని నిలబడ్డాం

ప్రజాతీర్పు కోరే దమ్ములేక చంద్రబాబు అరాచకాలు

సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

పులివెందులలో మాజీ ముఖ్యమంత్రికీ ఆటంకాలు

పోలింగ్ ఏజెంట్లను అడ్డుకుని యథేచ్ఛగా రిగ్గింగ్ 

ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని పోలీసులు ట్వీట్లా?

బయటి వ్యక్తుల్ని తెచ్చి ఎడాపెడా ఓట్లు వేసుకున్నారు

సజ్జల రామకృష్ణారెడ్డి మండిపాటు

కౌంటింగ్ లోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడే అవకాశం

అయినా బలంగా నిలబడేందుకు వైఎస్సార్సీపీ సిద్దం

వీళ్ల అక్రమాల్ని మళ్లీ జాతీయ స్థాయికి తీసుకెళ్లాం

మరోసారి న్యాయపోరాటానికి సైతం సిద్దంగా ఉన్నాం

సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ

తాడేపల్లి:     రాష్ట్రంలో ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లోనూ నిస్సిగ్గుగా వెన్నుపోటు పార్టీ అక్రమాలకు పాల్పడిందని, తమ పోలింగ్ ఏజెంట్లను లోపలికి రానివ్వకుండా యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకుందని, ఏదో విధంగా తాను గెలిచానని చూపించుకునేందుకే చంద్రబాబు ఆరాటపడుతున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పులివెందులలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారెకి సైతం ఆటంకాలు కల్పించారని, రాష్ట్రంలో పలు చోట్ల మధ్యాహ్నం కల్లా బూత్ లు ఆక్రమించుకుని, రిగ్గింగ్ లతో తాము గెలిచామని చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇది గెలుపు కాదు ఘోరమైన ఓటమి అన్న విషయాన్ని మళ్లీ జాతీయ స్థాయికి తీసుకెళ్తామని, మరోసారి న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. 
ప్రెస్ మీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకేమన్నారంటే...

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో పరాకాష్టకు అరాచకాలు

ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆరాచక శక్తులు, రౌడీ మూకలు, చెదురుమదురు ఘటనలు ప్రతిసారీ జరిగేవి. అలాగే కొన్ని చోట్ల అధికారులు ఎన్నికల్లో పక్షపాత ధోరణితో వ్యవహరించడం కూడా మామూలే. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, దాన్ని నిలబెట్టే ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం, నివారణ చర్యలు, ఆ తర్వాత విచారణలు జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం అధికార పార్టీకి, కూటమికి అనుకూలంగా ముందస్తు కుట్రలా, వ్యవస్థీకృత మాఫియా తరహాలో ఎన్నికలు జరగడం, అందులో పోలీసులు, అధికారులు భాగస్వాములు కావడం చూశాం. గత కొన్నిరోజులుగా జరుగుతున్న కుట్రలు ఇవాళ పరాకాష్టకు చేరాయి.  రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీని నామినేషన్లే వేయనివ్వకుండా పోలీసులు, టీడీపీ గూండాలు, కొన్ని చోట్ల ఇద్దరూ కలిసి అడ్డుకోవడం చూశాం. నామినేషన్లు వేయడానికి వెళ్లే వాళ్లతో పాటు ఇతరులు వెళ్లనివ్వకుండా అడ్డుకుని, చివరికి పోలీసులే టీడీపీ వాళ్లకు తీసుకెళ్లి అప్పచెప్పడం మనం చూశాం. దీంతో నామినేషన్లు వేయడానికి సైతం అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. అభ్యర్ధులు లేరా అంటే ఉన్నారు. వాళ్లెవరో చూపించాం. ఇది కాకుండా వీడియోలు పెట్టి మరీ చూపించాం. నామినేషన్లు వేయడానికి లోపలికి వెళ్తే పత్రాలు చించేశారు. ఫైనల్ లిస్ట్ పెడితే అందులో పేర్లు ఉండటం లేదు. పూర్తిగా అన్నీ బాగున్నాయని అనుకుంటే, స్క్రూటినీలో తిరస్కరణలు. ఇలా జరుగుతుందని మొదటిరోజే తెలిసినప్పటి నుంచి అలర్ట్ అయ్యాం. నామినేషన్ వేయాలంటే, వచ్చి వేసుకోండి అని చెప్పాల్సింది పోయి అడ్డగింపులు మొదలయ్యాయి. దీనికి పోలీసులు తోడైతే, వాళ్లూ ఓ చేయి వేసి అడ్డుకుంటే ఇంకేం చేయగలం. అంటే ఓ నిస్సహాయ పరిస్దితులోకి నెట్టేశారు. చట్టపరంగా లభించిన అధికారాన్ని వాడుకుని మా కార్యకర్తల్ని, నాయకుల్ని నిస్సహాయ స్దితికి తోసి, అయినా పట్టుదలగా నిలబడితే హత్యాయత్నం వంటి తప్పుడు కేసులు పెట్టి, బైండోవర్లు, హౌస్ అరెస్టులు చేసి అభ్యర్ధులు మాత్రమే నామినేషన్ కేంద్రాలకు వచ్చేలా చేసి, అక్కడ వారి పత్రాలు చించేయడం, ఒకవేళ నామినేషన్ దాఖలు చేస్తే బలవంతపు ఉపసంహరణలు, అక్రమ కేసులతో బెదిరింపులు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. 

కృత్రిమ విజయం కోసం చంద్రబాబు బరితెగింపు 

దాదాపు 1500 నుంచి 2 వేల మందికి సంబంధించిన ఆధారాలతో సుప్రీంకోర్టును మేం ఆశ్రయిస్తే.. సీసీ కెమెరాలు పెట్టాలని ఎస్ఈసీని ఆదేశించింది. అక్రమాలు జరిగితే ఎన్నికల పిటిషన్లు వేసుకోవాలని చెప్పింది. నామినేషన్ల గడువు పొడిగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్నీ ఎస్ఈసీ పాటించలేదు,  నామమాత్రంగా 4 మున్సిపాలిటీల్లో గడువు పొడిగించి వదిలేసింది. మళ్లీ మేం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అన్ని చోట్లా సీసీటీవీ కెమెరాలు పెట్టమని ఆదేశాలు ఇచ్చినా పెట్టలేదు. చివరికి ల్యాప్ టాప్ లో కెమెరాలు వాడినట్లు చెప్తున్నారు. అదెంత వరకూ జరిగిందో చూడాలి.  పిరికిపంద చంద్రబాబులా బాయ్ కాట్ చేస్తున్నాం అని చెప్పలేక పోరాడాల్సి వచ్చింది. ఎంత వరకూ వీలైతే అంతవరకూ పోటీలో ఉండాలి, అన్నీ తట్టుకుని ముందుకు వెళ్లాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు చేయాల్సింది చేశాం. కడపలో 66 నామినేషన్లలో 2 ఉంచి మిగిలినవి తీసేశారు. చిత్తూరులోనూ ఇదే పరిస్ధితి. పులివెందులలో వేసిన నామినేషన్లను తిరస్కరించారు. ఇవన్నీ తట్టుకుని నిలబడినా.. బెదిరింపులతో ఉపసంహరణలు చేయించారు. పోలింగ్ రోజు ఓటర్లను తీవ్రంగా భయపెట్టారు. ఇవాళ అభ్యర్ధుల తరఫున ఏజెంట్లను సైతం లోనికి రానివ్వకుండా రిగ్గింగ్ చేసుకున్నారు. 
ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ఎన్నికలే కాదు, రీపోలింగ్ జరిపించాల్సిన వాటిలో మాచర్ల, చిలకలూరిపేట, జమ్మలమడుగు, మదనపల్లె, డోన్, తాడిపత్రి, చీమకుర్తి, కుప్పం, పులివెందుల, కడప, చిత్తూరు వంటివి ఉన్నాయి. ఇవి కాక రిగ్గింగ్ చేస్తూ ఆధారాలతో దొరికిన మిగిలిన వాటిలో కడప, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, ఒంగోలు, వినుకొండ, మార్కాపూరం, ఎమ్మిగనూరు, నగరి ఇలా చాలానే ఉన్నాయి. వీటిలో రకరకాల పద్దతుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. తద్వారా చంద్రబాబు పెద్ద నాటకానికి తెరలేపారు. విజయం నాదే అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల నుంచి తీర్పు కోరే దమ్ము లేక, నేరుగా అడిగితే పెద్ద గుండు సున్నా వస్తుంది కాబట్టి, తానే కృత్రిమంగా ఓ విజయం తెచ్చుకునే కుట్రలో భాగంగా రకరకాల కుట్రలు చేశారు. వాటిలో ఎక్కడ అడ్డంకులు వస్తాయో అక్కడ పోలీసుల్ని వాడారు. మధ్యాహ్నం తర్వాత విశ్వరూపం చూపారు. కొన్ని వార్డుల్లో మధ్యాహ్నం ఏజెంట్లను వెనక్కి పంపడం, పోలీసుల సాయంతో దొంగఓట్లు వేసుకున్నారు. పోలీసు వ్యవస్థతో పాటు ప్రిసైడింగ్ అధికారులు, ఆర్వోలు అధికార పార్టీకి అనుకూలంగా చాలా నాటకాలు వేసి రక్తి కట్టించారు.  ఎస్ఈసీ ఇలాంటి చర్యలకు వంత పాడుతూ వ్యవహరించింది. పోలీసుల సమక్షంలో ప్రతిపక్షాలు ఇలాంటి పనులు చేయగలవా ? ఒక వేళ చేసినా పోలీసులు వదులుతారా ? ఇలాంటి పనులు జరిగితే ఎవరికి ప్రయోజనం? పోలీసులు మౌనంగా చోద్యం చూస్తూ ఉండిపోయింది. దీంతో టీడీపీ అధికార వ్యవస్థను తన పార్టీకి అనుబంధంగా మార్చుకుని ఇదంతా నడిపించింది. దీనికి ఎన్నికలని పేరు పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నాం.పోలింగ్ ఏజెంట్ గా ఓ పార్టీ తరఫున వెళ్లానుకోవడం తప్పా ? వైఎస్సార్సీపీ తరఫున పోలింగ్ ఏజెంట్ గా వచ్చానని చెప్తే, రెండు నిమిషాలు ఆగమని చెప్పి టీడీపీ వాళ్లను పిలవడం దారుణం. 

పులివెందులో మాజీ సీఎంకూ ఆటంకాలా?

మాజీ ముఖ్యమంత్రి ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో హెలికాఫ్టర్ లో దిగడానికి కూడా ఆటంకాలు  కల్పించారు.  పులివెందులలో బయటి ప్రాంతాల నుంచి మనుషుల్ని దింపి దాడులు చేయించారు. మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు నిగ్రహంతో, సంయమనంతో వ్యవహరించారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సాయంత్రమే వెళ్లాలని భావించినా, మళ్లీ కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని ఇవాళ ఉదయం బయలుదేరి వెళ్లారు. కడప పోలీసులు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొన్నారంటూ ఓ రాజకీయ పార్టీలా ట్వీట్ చేయడమేంటి ? పులివెందులలో పోలీసుల భద్రతలో వేరే ఊళ్ల నుంచి తీసుకొచ్చి, భద్రత కల్పించి ఓటు వేయించారు. నిజంగా పులివెందుల ఓటర్లను మాత్రం ఓటేయకుండా అడ్డుకున్నారు. మీడియా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక అక్కడి నుంచి జారుకున్నారు. కడప పోలీసు పేరుతో పెట్టిన ట్వీట్ లో బయటి నుంచి తెచ్చిన వాళ్లతో ఓట్లేయించినట్లు అర్దమవుతోంది. వీళ్ళను చూపించి ప్రజాస్వామ్యం నాలుగు పాదాలుగా నడుస్తోందని చెప్పుకున్నారు. ఇవాళ పోలింగ్ పేరుతో ఓ ప్రహసనం నడిచింది. ఎన్నికల్లో పోటీ చేయడమే నేరమైనట్లు పోటీ చేయకుండా అడ్డుకోవడం, ఆ గండం దాటితే మరిన్ని అడ్డంకులు కల్పించి చివరి నిమిషం వరకూ మా పార్టీ అభ్యర్ధుల్ని, నాయకుల్ని, ఓటర్లను అడ్డుకున్నారు. ఇదో చెడు సంప్రదాయం నెలకొల్పారు. తాను గెలిచానని చూపించేందుకు చంద్రబాబు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అంతా బావుందని తాను చెప్పుకోవడమే కాకుండా పోలీసులతో కూడా ట్వీట్లు పెట్టించారు. పులివెందులలో అక్రమాలు చూశాక జగన్మోహన్ రెడ్డి గారు.. ఓ సైగ చేస్తే ఏం జరిగేదో అందరికీ తెలుసు. కానీ అలా చేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యం మాత్రమే. ఆ ఎన్నికలు పద్దతి ప్రకారం జరగకపోతే ప్రజాస్వామ్యానికి అర్ధమే లేదు. ఎన్నికల్ని స్వేచ్ఛగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికార, ప్రతిపక్షాలపై ఉంటుంది. అందులో ఏదైనా లొసుగులు, తప్పులు జరిగితే మెరుగైన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సింది పోయి వెనక్కి వెళ్లి ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్లకే అడ్డుపడిన పోలీసులు, అధికారులు.. రీ-పోలింగ్ అడగ్గానే ఇస్తారా ? అయినా కోర్టుల ద్వారా అడగాల్సిందే. రాజ్యాంగ పద్దతుల్లోనే అడుగు వేయాలి, అవకాశం ఉన్న చోటల్లా ప్రజలకు ఛాన్స్ ఇవ్వడానికి మనవైపు నుంచి పూర్తిగా సహకరించాలి, ఈ ప్రక్రియలో మనం నష్టపోయినా భరిస్తూ ఎక్కడ వీలైతే అక్కడ పోటీ చేశాం. పోలింగ్ రోజు ప్రజలు శాంతియుతంగా ఓటేస్తే దాని ఫలితం ఎలా ఉన్నా తీసుకునేందుకు సిద్దపడ్డాం. గతంలో నిమ్మగడ్డ వంటి వ్యక్తి ఎస్ఈసీగా ఉన్నప్పుడు కూడా, అధికారంలో ఉంటూ ప్రతిపక్షంలా అన్నీ ఎదుర్కున్నాం. 

కూటమి అక్రమాల్ని మళ్లీ జాతీయ స్థాయికి తీసుకెళ్తాం 

మేం అడిగింది అందరూ నామినేషన్లు వేయడానికి అవకాశం, మా పోలింగ్ ఏజెంట్లు బూతుల్లో కూర్చుకోవడానికి అవకాశం. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు నిర్బయంగా వచ్చి ఓటేసుకోవడానికి అవకాశం. ఈ మూడు సక్రమంగా జరిగితే ఫలితం ఎలా ఉన్నా దాన్ని తీసుకోవడానికి మేం సిద్దంగా ఉన్నాం. ఫలితం ఎలా ఉంటుందనేది కూడా చంద్రబాబుకు తెలుసు కాబట్టే, ధైర్యం లేక ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. రేపు కౌంటింగ్ లోనూ ఇలాగే చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే ప్రతీ చోటా సాక్ష్యాల కోసం వీడియోలు తీయిస్తున్నాం. ఎన్నికల్లో నిలబడిన వాళ్లం మేము.. ఆధారాలు కూడా సేకరించుకోవాలా ? సాక్ష్యం లేకపోతే ఎన్నికల పిటిషన్ వేసుకోమని కోర్టులు చెప్తున్నాయి. కానీ ఎస్ఈసీ వెంటనే సీసీటీవీ ఫుటేజ్, వెబ్ క్యాస్టింగ్ ఇతర ఆధారాలతో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ అలా చేయడం లేదు. ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలు సైతం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని నివేదికలు ఇచ్చి ఉంటారు. రిగ్గింగ్ కోసమే 360 పోలింగ్ బూత్ లలో మా ఏజెంట్లను బయటకు తరిమేశారు. దొంగ దొంగనే అడిగి రిపోర్ట్ తెప్పించుకుంటే అంతా బాగుందనే చెప్తారు. చంద్రబాబు కుట్ర ఏంటంటే, ఎక్కడైతే గట్టిగా నిలబడతారో, వైఎస్సార్సీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో మేమే రౌడీయిజం చేసి గొడవలు చేశామంటారు, మిగిలిన చోట శాంతియుతంగా జరిగింది కదా అంటున్నారు. మిగిలిన చోట ప్రశాంతంగా జరిగితే మేం గెలవాలి కదా. కానీ అక్కడ కూడా ఇతరత్రా అక్రమాలకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల బూత్ లు ఎంపిక చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ఓటింగ్ తగ్గిన బూత్ లలో ఇప్పటికీ ఓట్లు గుద్దుకుంటున్నారని అనుకుంటున్నాం. మళ్లీ మేం జాతీయస్ధాయికి ఈ అక్రమాలను తీసుకెళ్లాం, వీళ్ల గుట్టు రట్టు చేస్తాం. వీళ్లు ఏం చేశారో ఇప్పటికే జాతీయ స్ధాయిలో అందరికీ తెలిసింది, ఇవాళ జరిగిన వాటితో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం అక్రమాలను సైతం అలాగే తీసుకెళ్లాం. అక్రమాలు చేసి తన విజయంగా చూపించుకోవాలని భావించినా, అది విజయం కాదు ఘోరమైన ఓటమి అని ప్రజలకు వివరిస్తాం. ఎంత వరకు అయితే అంతవరకూ పోరాటం చేస్తాం. మిగిలిన అంశాల్ని మీడియా ద్వారా బయటపెడతాం. అందరినీ మీడియా కూడా ఒకే గాటన కట్టొద్దు. ప్రతీ అభ్యర్ధికీ ఒకే నిబంధనలు వర్తింపచేయాలి. పొరబాటు జరిగిందని మేం ఫిర్యాదు చేస్తే కోర్టులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయమన్నారు. ఎన్నికల పిటిషన్లు వేసుకోమని చెప్పారు. కానీ చంద్రబాబుకు కావాల్సింది ఇవాళ బయటపడితే చాలు. రెండేళ్ల తర్వాత ఏం జరగబోతోందో ఇప్పటికే తేలిపోయింది. అందుకే తన ఫేక్ మీడియాలో ఊదరగొడతారు, నాలుగు రోజుల తర్వాత జరిగినవన్నీ పక్కకు పోతాయి. ఈ రెండేళ్లు లైఫ్ వస్తుంది. ఇలాంటి కుట్రల్ని గమనించాలని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Back to Top