పోలింగ్‌ వేళ జర్నలిస్టులపై టీడీపీ కార్యకర్తల దాడులు

గాయపడిన మీడియా ప్రతినిధులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌

పులివెందుల, నవంబర్‌ 1: పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన మీడియా ప్రతినిధులను వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ పరామర్శించారు.

ఎన్టీవీ రిపోర్టర్‌ సురేష్‌, ఇండియా టుడే టీవీ రిపోర్టర్‌ బషీర్‌, కెమెరామెన్‌ విజయ్‌లను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాక్షి టీవీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఇస్మాయిల్‌పై కూడా రాళ్లతో దాడి జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.

పోలింగ్‌ సమయంలో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడులను వైయ‌స్‌ జగన్‌ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛగా పనిచేసే హక్కు ఉందని, ఎన్నికల ప్రక్రియను ప్రజలకు తెలియజేసే జర్నలిస్టులపై దాడులు జరగడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో మీడియా ప్రతినిధులకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top