కేంద్ర బ‌ల‌గాలతో క‌డ‌ప‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాలి

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు మాజీ డిప్యూటీ సీఎం అంజ‌ద్ బాషా, జిల్లా పార్టీ అధ్య‌క్షుడు ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి డిమాండ్  

వైయ‌స్సార్ కడప జిల్లా పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ డిప్యూటీ సీఎం అంజ‌ద్ బాషా, జిల్లా పార్టీ అధ్య‌క్షుడు ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి 

వైయ‌స్సార్ కడప: ఎన్నికల అక్రమాల నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి కేంద్ర బలగాలు, సీఆర్‌పీఎఫ్ పర్యవేక్షణలో కొత్త నోటిఫికేషన్‌తో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల‌ని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ క‌డ‌ప పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో వారు మాట్లాడుతూ కడపతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, దాడులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు అధికార పార్టీ అండతో పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు ఏకపక్షంగా వ్యవహరించాయని నేతలు ఆరోపించారు. ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులు చేసినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికార పార్టీకి సహకరించిందని మండిపడ్డారు. 

వారు ఇంకా ఏం మాట్లాడారంటే...

దాడులు జ‌రుగుతుంటే పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర వ‌హించారు
- అంజద్‌బాషా, మాజీ డిప్యూటీ సీఎం

కడపలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకున్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలను చింపేయడం, మహిళా అభ్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడటం వంటి దారుణాలకు ఒడిగట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై 307 కేసులు పెట్టి, వంద మందికి పైగా పేర్లు చేర్చి, ప్రచారంలో కనిపిస్తే కేసుల్లో ఇరికిస్తామని పోలీసులతోనే బెదిరించారు. పోలింగ్ బూత్‌ల వద్ద మా ఏజెంట్లపై దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు, మహిళల ఓటర్ స్లిప్పులు లాక్కొని ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి గూండాలను తీసుకొచ్చి పోలింగ్ ప్రక్రియను ప్రభావితం చేశారు, కొంతమంది ఓటర్లకు వారి ఓటు ఇప్పటికే పడిపోయిందని చెప్పి వెనక్కి పంపించారు. ఇన్ని అరాచకాలు జరిగినా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్, ఎస్పీ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. కడపలో బండి దీప్తి గారికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది, తిరిగి కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహిస్తే 80 వేల మెజారిటీతో గెలుస్తారని సవాల్ చేస్తున్నాం.

అధికార పార్టీ కోస‌మే రీపోలింగ్ నిర్వ‌హిస్తున్నారు
- రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు 

స్టేట్ ఎలక్షన్ కమిషన్ కళ్లుమూసుకుని ప్రభుత్వానికి గుడ్డిగా మద్దతు ఇచ్చే కార్యక్రమం చేస్తోంది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం తన బాధ్యతను విస్మరించింది. కడపలో 15/2 బూత్‌లో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి వైఎస్సార్‌సీపీకి 997 ఓట్లు ఇచ్చారు, అయినా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారనే కారణంతో ఆ బూత్‌లో రీపోలింగ్‌కు ఆదేశించారు. మిగతా ప్రాంతాల్లో జరిగిన అక్రమాలను పట్టించుకోకుండా పులివెందులతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా అధికార పార్టీకి అనుకూలంగా మాత్రమే రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించుకుంటామని చెప్పడం కేవలం ఒక డ్రామా మాత్రమే, పోలీసు, రెవెన్యూ వ్యవస్థలతో కలిసి ఎస్‌ఈసీ కూడా ఈ వ్యవహారంలో భాగస్వామిగా మారింది. గతంలో ఫిర్యాదులు అందిన వెంటనే కలెక్టర్లు, ఎస్పీలపై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం ఇప్పుడు ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. ఎన్నికల సంఘం నియమించిన అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్ల నివేదికలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిశీలించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. టీఎన్ శేషన్ లాంటి నిబద్ధతతో ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతలను స్వతంత్రంగా నిర్వర్తించాలి, కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటేనే మిగతా అధికారుల్లో బాధ్యత, భయం ఏర్పడతాయి.

Back to Top