ఎన్నిక‌ల రోజున జ‌గ‌న్ కు ప్ర‌మాదం త‌ల‌పెట్టే కుట్ర 

 కారుమూరు వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్ర‌తినిధి కారుమూరు వెంక‌ట‌రెడ్డి 

 జ‌గ‌న్ గారిని రాజ‌కీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక దారుణానికి వ్యూహ ర‌చ‌న 

 కుట్రలకు సీఎం చంద్రబాబు, లోకేష్‌ సమాధానం చెప్పాలి

 వాళ్లే క‌లెక్ట‌ర్‌, జిల్లా ఎస్పీల‌తో అబ‌ద్ధాలు మాట్లాడించారు

 మాజీ ముఖ్య‌మంత్రిని వెన‌క్కి వెళ్లిపోవాల‌ని ఎలా చెబుతారు? 

 ఎప్పుడు ఓటెయ్యాలో చెప్ప‌డానికి వీళ్లెవ‌రు? 

  కారుమూరు వెంకటరెడ్డి ఫైర్ 

 జ‌గ‌న్ గారు వెళ్ల‌గానే ఫైర్ ఇంజిన్‌ను ఎందుకు పంపించేశారు?

 పైలెట్ల నుంచి స్టేట్‌మెంట్ తీసుకోవాల‌ని డీఎస్పీపై ఒత్తిడి తెచ్చిందెవ‌రు? 

 మాజీ సీఎం జెడ్ ప్ల‌స్ జ‌గ‌న్ గారి కాన్వాయ్‌లోకి ద‌స్త‌గిరి ఎలా వ‌చ్చాడు? 

 హ‌త్య కేసులో నిందితుడిని ఎన్నిక‌ల రోజున అదుపులోకి తీసుకోవాలి క‌దా

 జ‌గ‌న్‌తో మాట్లాడటానికే వ‌చ్చాడ‌ని డీఐజీ కోయ ప్ర‌వీణ్ చెప్ప‌డంలో ఆంత‌ర్యం ఏంటి? 

 ఈ అనుమానాల‌పై, లోకేష్, చంద్ర‌బాబు, డీఐజీ, క‌లెక్ట‌ర్‌, ఎస్పీ పాత్ర‌ల‌పై విచార‌ణ జ‌ర‌గాలి 

:  కారుమూరు వెంక‌ట‌రెడ్డి డిమాండ్ 

తాడేప‌ల్లి: మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్ర‌మాదం త‌ల‌పెట్టే కుట్ర‌ల‌కు చంద్రబాబు, లోకేష్‌ తెరతీశార‌ని.. అందులో భాగంగానే హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అడ్డంకులు సృష్టించార‌ని వైఎస్సార్‌సీపీ అధికార ప్ర‌తినిధి కారుమూరు వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు నుంచి బయలుదేరిన జగన్ గారి హెలికాప్టర్‌ను ఆపేయాలని, వెనక్కి పంపించేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో సీఎంఓ నుంచి కలెక్టర్‌కు ఫోన్లు వెళ్లాయని ఆరోపించారు. ముందే పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఇన్ఫర్మేషన్ లేదంటూ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీల చేత పచ్చి అబద్ధాలు మాట్లాడించారని విమర్శించారు. జ‌గ‌న్ గారు వ‌స్తే ఎన్నిక‌ల‌ అరాచకాలు జాతీయ స్థాయికి తీసుకెళ్తాడ‌నే భ‌యంతోనే ఆయ‌న పులివెందులకు రాకుండా ఈ డ్రామా ఆడార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ రోజున వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరిని జగన్ గారి జెడ్ ప్లస్ కేటగిరీ కాన్వాయ్‌లోకి ఎలా పంపించారని కారుమూరు వెంకటరెడ్డి నిలదీశారు. దస్తగిరి అడ్డుకోవడానికి రాలేదని, మాట్లాడడానికే వచ్చాడని డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడడం చూస్తే ఈ కుట్ర ఎంత పెద్దదో అర్థమవుతోందన్నారు. ఈ కుట్రల వెనుక ఉన్న అధికారులు అంద‌రిపైనా భవిష్యత్తులో కచ్చితంగా ఎంక్వయిరీ ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కారుమూరు వెంక‌ట‌రెడ్డి స్పష్టం చేశారు.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

హెలికాప్ట‌ర్ ల్యాండింగ్ కి అనుమ‌తుల‌పై క‌లెక్ట‌ర్‌, ఎస్పీ అబ‌ద్ధాలు: 

జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఆయనను భౌతికంగా లేకుండా చేయాలన్న కుట్రలకు చంద్రబాబు, లోకేష్‌ పాల్పడుతున్నారనే అనుమానాలు తాజా పరిణామాలతో బలపడుతున్నాయి. గత 17 ఏళ్లుగా జగన్ గారిపై రకరకాలుగా కుట్రలు జరుగుతున్నాయి. నవంబర్‌ 1న జగన్ గారు కడప పర్యటనకు వచ్చిన సమయంలో హెలికాప్టర్‌ ప్రయాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం కూడా అందులో భాగమే. అక్టోబర్‌ 25నే కడప కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతులిచ్చారు. అక్టోబర్‌ 31న ఉదయం 9.45 గంటలకు రాక, సాయంత్రం 4.10 గంటలకు తిరుగు ప్రయాణం ఉంటుందని సవరించిన షెడ్యూల్‌ కూడా అధికారులకు తెలియజేశారు. అయినా జగన్ గారు బెంగళూరు నుంచి బయలుదేరిన తర్వాత సీఎంఓ నుంచి కలెక్టర్‌పై ఒత్తిళ్లు తెచ్చి హెలికాప్టర్‌ను వెనక్కి పంపాలని ప్రయత్నించారు. ముందుగానే అనుమతులు ఇచ్చిన కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఎస్పీ తమకు ఆ రోజు ఉదయం వరకు సమాచారం లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. జగన్‌ హెలికాప్టర్‌ తిరిగి వెళ్లేందుకు తగినంత ఇంధనం లేని పరిస్థితిలో పైలట్లు అత్యవసర పరిస్థితి వస్తే మేడే ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటన విషయంలో ఇంతటి ప్రమాదకర పరిస్థితి ఎందుకు సృష్టించారు, దీని వెనుక చంద్రబాబు, లోకేష్‌ పాత్ర ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి.

ఫైరింజ‌న్‌ని ఎవ‌రు పంపించేశారు?  పైలెట్ల‌ను ఎందుకు బెదిరించారు? : 

జగన్ గారి హెలికాప్టర్‌ కడపలో దిగిన తర్వాత జరిగిన పరిణామాలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. హెలికాప్టర్‌ దిగిన 15–20 నిమిషాల్లోనే ఫైర్‌ ఇంజిన్‌ను అక్కడి నుంచి ఎందుకు తొలగించారు? జగన్ గారు సాయంత్రం తిరుగు ప్రయాణం  అయ్యేవ‌ర‌కు కూడా ఉండాల్సిన ఫైర్‌ ఇంజిన్‌ను పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? పైలట్లను డీఎస్పీ బెదిరించి, వారి నుంచి ప్రకటనలు తీసుకోవాలని ప్రయత్నించడం వెనుక ఎవరి ఆదేశాలున్నాయి? మరోవైపు, జగన్‌ హెలికాప్టర్‌ను సీజ్‌ చేస్తున్నారంటూ టీడీపీకి చెందిన సోషల్‌ మీడియా ప్రచారం చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిన పరిణామాలుగా మేం భావించడం లేదు. ఇదే సమయంలో పోలింగ్‌ రోజున హంతకుడు దస్తగిరి జగన్ గారి జెడ్‌ ప్లస్‌ కాన్వాయ్‌ మార్గంలోకి ఎలా వచ్చాడు? హ‌త్య‌కేసులో నిందితుడైన దస్తగిరిని పోలింగ్‌ సమయంలో పోలీస్‌స్టేషన్‌లో ఉంచాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? జగన్ గారి భద్రతకు సంబంధించి మార్గాన్ని ముందుగానే పరిశీలించి, అనుమానితులను దూరంగా ఉంచాలి క‌దా. దస్తగిరి 20 రోజుల క్రితం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబును కలిసిన విషయం ఉండగా, ఆ భేటీ వెనుక ఉన్న అంశాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.

జ‌గ‌న్ గారి కాన్వాయ్‌లోకి ద‌స్త‌గిరిని ఎలా రానిచ్చారు? :

దస్తగిరి మాట్లాడటానికే వచ్చాడని డీఐజీ కోయ ప్రవీణ్‌ చెప్పడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. దస్తగిరి ఉద్దేశం ఏమిటో డీఐజీకి ముందే ఎలా తెలిసింది, అతను మాట్లాడటానికే వచ్చాడని ఎవరు నిర్ధారించారు? జగన్ గారి కాన్వాయ్‌ దగ్గరకు దస్తగిరి చేరుకునే వరకు పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది? ఈ మొత్తం వ్యవహారంపై డీఐజీ కోయ ప్రవీణ్‌, జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలి. జగన్ గారి ప్రాణాలకు ముప్పు కలిగించేలా జరిగిన ప్రతి పరిణామంపై సమగ్ర విచారణ జరగాలి. చంద్రబాబు, లోకేష్‌, కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఎస్పీ, డీఐజీ కోయ ప్రవీణ్‌ పాత్రలను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలి. జగన్ గారిపై గతంలో జరిగిన కుట్రలు, ఆయన బెంగళూరు నివాసం వద్ద డ్రోన్‌లతో నిఘా పెట్టిన ఘటనలతో సహా అన్ని అంశాలను పరిశీలించాలి. వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనలన్నింటిపై సమగ్ర విచారణ జరిపిస్తాం. జగన్ గారికి హాని తలపెట్టాలని చూసిన రాజకీయ నాయకులైనా, అధికారులు, పోలీసులైనా బాధ్యులెవర్నీ వదిలిపెట్టం. ప్రజాస్వామ్యంలో రాజకీయంగా పోరాడాలి తప్ప, ప్రత్యర్థుల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రయత్నాలను ఎట్టి ప‌రిస్థితుల్లో సహించేది లేదని కారుమూరు వెంక‌ట‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Back to Top