రాష్ట్రంలో దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు

అందుకు రాప్తాడులో విద్యార్థినిపై దాడి ఉదాహరణ

వైయస్‌ జగన్‌ ఫైర్‌

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో ఉన్మాది చేతిలో తీవ్ర గాయాలపాలై బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపికను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో వివరాలు ఆరా తీసిన శ్రీ వైయస్‌ జగన్, గోపిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
గోపికను పరామర్శించిన అనంతరం, మణిపాల్‌ ఆస్పత్రి వద్ద  వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు.

స్కూల్‌తో సంబoధం లేని వ్యక్తి ఏకంగా ఆయుధంతో రావడమా?

ఎలక్ట్రిక్‌ రంపంతో క్లాస్‌రూమ్‌లో విద్యార్థిని గొంతు కోయడమా?

స్కూళ్లలో చదువుకునే పిల్లలకే రక్షణ లేకపోతే ఎలా?

సూటిగా ప్రశ్నించిన శ్రీ వైయస్‌ జగన్‌

విద్యార్థిని గోపికకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి

 వైయస్‌ జగన్‌ డిమాండ్‌

లేనిపక్షంలో మా ప్రభుత్వం వచ్చాక మేమే ఇస్తాం

ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో ఆ సాయం చేస్తాం

వైయస్‌ జగన్‌ ప్రకటన 

బెంగళూరు:     రాష్ట్రంలో దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలకు అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినిపై జరిగిన దాడి ఉదాహరణ అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. స్కూల్‌తో సంబంధం లేని వ్యక్తి ఎలక్ట్రిక్‌ రంపం తీసుకొచ్చి, ఏకంగా క్లాస్‌రూమ్‌లోనే, పిల్లలందరి ముందు పదవ తరగతి విద్యార్థిని గొంతు కోయడం అత్యంత హేయమని ఆయన ఆక్షేపించారు. చివరకు స్కూళ్లలో కూడా పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
    రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టెన్త్‌ విద్యార్ధిని గోపికను శ్రీ వైయస్‌ జగన్‌ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడిన ఆయన బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. పాప ఆరోగ్యం కాస్త మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పడం, కాస్త సంతోషించతగిన విషయమని, బాలిక పరామర్శ అనంతరం ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు.
ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

స్కూళ్లలో విద్యార్థుల భద్రత ఎక్కడ?:
    పాఠశాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఏకంగా విద్యుత్‌ రంపం తీసుకుని హైస్కూల్‌లోకి ప్రవేశించి, బాలికలపై దాడి చేసే పరిస్థితి నెలకొంటే, ఇక స్కూళ్లలో చదువుకునే పిల్లల భద్రత ఏమిటి? అసలు పాఠశాలలోకి ఒక వ్యక్తి విద్యుత్‌ రంపంతో వస్తుంటే అడ్డుకునేవారే లేకపోవడం అత్యంత దారుణం. రాష్ట్రంలో ఇలాంటి దారుణ పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ వైఫల్యమే. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో బెల్ట్‌ షాపులు విచ్చలవిడిగా విస్తరిస్తున్నాయి. గంజాయి, మద్యం అందుబాటులోకి రావడంతో యువత వ్యసనాలకు బానిసలవుతున్నారు. వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ పరిస్థితుల వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించలేకపోతున్నందుకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.

Image

బాలిక కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి:
    ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ఒక అమాయక బాలిక నేడు చావుబతుకుల మధ్య పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలోకి బయటి వ్యక్తి ప్రవేశించి, విద్యుత్‌ రంపంతో దాడి చేసినా అడ్డుకోలేని దుస్థితి నెలకొంది. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ దిశలో బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల పరిహారం అందించాలి. అంతే కాకుండా బాలికకు అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలను పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో అందించాలి. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవాలి.

లేని పక్షంలో మా ప్రభుత్వం రాగానే ఇస్తాము:
    ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాని పక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది. బాలిక వైద్యానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుంది. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ఇవ్వకపోతే, వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆ కుటుంబానికి రూ.50 లక్షలు అందిస్తాం. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.

Image

రాప్తాడు నియోజకవర్గంలోనే తొమ్మిది దారుణ ఘటనలు:
    రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేశారు. పోలీసుల దృష్టి శాంతిభద్రతల పరిరక్షణపై కాకుండా రాజకీయ వ్యవహారాలపై ఉండే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి.
    ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే గత 15–16 నెలల్లో తొమ్మిది దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో ఆరు ఘటనలు మహిళలు, బాలికలకు సంబంధించినవే కావడం ఆందోళనకరం.
    ఇప్పుడు గోపిక అనే చిన్నారిపై జరిగిన దాడితో పాటు, అనూష, సావిత్రిబాయి, సావిత్రమ్మలకు సంబంధించిన ఘటనలు. 14 ఏళ్ల ఎస్సీ మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం. కురువ లింగయ్య హత్య.  బోయ నాగేష్‌ హత్య. నారాయణరెడ్డి హత్య. స్పందన అనే యువతి ఆత్మహత్య వంటి ఘటనలు రాప్తాడులో చోటుచేసుకున్నాయి.
    ఒక్క నియోజకవర్గంలోనే ఇన్ని ఘటనలు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి గ్రామంలో గంజాయి, మద్యం విచ్చలవిడిగా విస్తరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోవైపు రెడ్‌బుక్‌ పాలన పేరుతో పోలీసు వ్యవస్థను రాజకీయ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఫలితంగా పోలీసులు శాంతిభద్రతలపై దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజల ప్రాణాలకు, ముఖ్యంగా మహిళలు, బాలికల భద్రతకు రక్షణ లేకుండా పోతోంది.

11 గంటల శస్త్రచికిత్సను తట్టుకున్న చిన్నారి:
    ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దేవుడి దయవల్ల చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు చెబుతున్నారు.
దాదాపు 11 గంటల పాటు సాగిన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను చిన్నారి తట్టుకుంది. మరో 48 గంటల పాటు పరిస్థితి విషమంగానే ఉంటుందని వైద్యులు చెబుతున్నప్పటికీ, చికిత్సకు బాగా స్పందిస్తూ కోలుకుంటోందని వివరించారు.
    ఒకవైపు చిన్నారికి జరిగిన దారుణాన్ని తలచుకుంటే తీవ్ర ఆవేదన కలుగుతోంది. మరోవైపు ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందన్న సమాచారం కొంత సంతోషాన్ని కలిగిస్తోందన్న శ్రీ వైయస్‌ జగన్, ఆ పాప పూర్తిగా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

Image

Back to Top