స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌లో ప్రతి ఓటునూ కాపాడుకునేలా పార్టీ నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. రేపు (నవంబర్ 3) జరిగే కౌంటింగ్‌తో పాటు ఈ నెల 5న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా నిరుత్సాహపడకుండా, ప్రతి ఓటును, ప్రతి స్థానాన్ని కీలకంగా భావించి పోరాడాలని స్పష్టం చేశారు. సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీ వ్యవహరిస్తున్న తీరుతో పాటు కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ల దశ నుంచే అధికార టీడీపీ ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు. గతంలో అక్కడక్కడా కనిపించిన అధికార దుర్వినియోగం ఈసారి వ్యవస్థీకృతంగా జరుగుతోందన్నారు. పోలీసు యంత్రాంగం, ఎన్నికల అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని, కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారన్నారు. నామినేషన్ల తిరస్కరణ, బలవంతపు ఉపసంహరణల నుంచి పోలింగ్ రోజు దొంగ ఓట్ల ప్రయత్నాల వరకు అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో గరిష్ట స్థాయిలో పోటీ జరిగేలా చూడాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో అనేక చోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు లేకుండా ఎంపీటీసీ ఎన్నికలు, మరికొన్ని చోట్ల జెడ్పీటీసీ అభ్యర్థులు లేకుండా జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని శ్రీ సజ్జల అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ధరల పెరుగుదల, అప్పుల భారం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఆరోగ్య సేవల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనతో పోలిస్తే రాష్ట్రాన్ని ఐదేళ్లు, పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. ప్రజల్లో ఉన్న ఈ వ్యతిరేకత స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా బయటపడుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా, 2019–24 మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన సంఖ్యలను చూపించాలన్న ఉద్దేశంతోనే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు జరిగిన పరిణామాలను ఆధారాలతో జాతీయ స్థాయిలో వెలుగులోకి తీసుకువచ్చామని, సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ తీరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైందన్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా పనిచేయడం అభినందనీయమన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీతో పోలిస్తే ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ శ్రేణులు మరింత పట్టుదలతో, క్రమశిక్షణతో ఎన్నికల్లో పోరాడుతున్నాయని అన్నారు. పార్టీ నాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు బాధ్యత తీసుకుని పనిచేస్తున్న తీరు ప్రజల్లో సానుకూల సంకేతాలను పంపిందన్నారు. వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం ప్రజల్లో బలపడుతోందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కేవలం గెలుపోటముల కోణంలోనే చూడకూడదని, రాబోయే సాధారణ ఎన్నికలకు ముందు పార్టీ బలాబలాలను అంచనా వేసుకునే అవకాశంగా భావించాలని శ్రీ సజ్జల సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ పనితీరు, నియోజకవర్గ సమన్వయకర్తల పట్టు, ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత, వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయన్నారు. ఈ సమయంలో క్యాడర్‌ను కాపాడుకోవడం, వారిలో విశ్వాసం పెంపొందించడం ముఖ్యమన్నది పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ఆలోచన అని వివరించారు. ఇప్పుడు కార్యకర్తలకు అండగా నిలిస్తే రాబోయే సాధారణ ఎన్నికల్లో వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పారు. కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక దిశానిర్దేశం రేపటి కౌంటింగ్‌లో ముఖ్యంగా మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీ సజ్జల సూచించారు. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో ఈ స్థానాలకు పోలైన ఓట్లు ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసేందుకు కీలక సూచికలుగా నిలుస్తాయన్నారు. వార్డులు, డివిజన్ల కౌంటింగ్‌ను పర్యవేక్షిస్తూనే మేయర్, చైర్‌పర్సన్ ఓట్ల లెక్కింపును ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా, అన్ని టేబుళ్ల వద్ద ఓట్ల లెక్కింపు స్పష్టంగా రికార్డవుతోందా అనే అంశాలను ఏజెంట్లు ముందుగానే పరిశీలించాలని సూచించారు. కెమెరాలు పనిచేయకపోతే వెంటనే అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసి, లోపాలను సరిచేసిన తర్వాతే కౌంటింగ్ కొనసాగించాలని డిమాండ్ చేయాలన్నారు. పోలింగ్, కౌంటింగ్, స్ట్రాంగ్‌రూమ్‌లకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని భద్రపరచడం అత్యంత అవసరమని, ఎన్నికల పిటిషన్లలో ఈ ఆధారాలు కీలకమవుతాయని చెప్పారు. అలాగే బ్యాలెట్ బాక్సుల సీళ్లు చెక్కుచెదరకుండా ఉన్నాయా, పోలింగ్ ఏజెంట్ల సంతకాలు సక్రమంగా ఉన్నాయా అనేది తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఏవైనా అనుమానాలు, లోపాలు కనిపిస్తే వెంటనే లిఖితపూర్వక అభ్యంతరం తెలియజేసి, సంబంధిత బాక్సులను పక్కన పెట్టాలని కోరాలన్నారు. బ్యాలెట్ పత్రాల లెక్కింపు, ఓట్ల కట్టలు కట్టే సమయంలో ఒక అభ్యర్థికి వచ్చిన ఓట్లు మరో అభ్యర్థి ఖాతాలోకి వెళ్లకుండా ప్రతి దశలో జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. పేపర్ బ్యాలెట్ కౌంటింగ్‌పై అనుభవం లేని యువకులు, కొత్త ఏజెంట్లకు ముందుగానే శిక్షణ ఇవ్వాలని, అనుభవజ్ఞులైన నాయకుల సూచనలు తీసుకోవాలని చెప్పారు. కౌంటింగ్‌కు సంబంధించిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేకంగా మార్గదర్శకాలను పంపిస్తామని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం నుంచి తుది ఫలితాలు ప్రకటించి, లెక్కలను పరిశీలించి, అవసరమైన పత్రాలపై సంతకాలు చేసే వరకు కేంద్రాలను విడిచిపెట్టకూడదని స్పష్టం చేశారు. ప్రతి అభ్యంతరాన్ని లిఖితపూర్వకంగా నమోదు చేయడంతో పాటు ఫిర్యాదు ప్రతులను భద్రపరచుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో అనుభవం, ధైర్యం, పట్టుదల ఉన్న ఏజెంట్లను నియమించాలని, అధికారుల నుంచి ఏదైనా అనుచిత చర్య ఎదురైతే వెంటనే బయట ఉన్న పార్టీ నాయకులకు సమాచారం అందించాలని చెప్పారు. అవసరమైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపాలని సూచించారు. ముఖ్యంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న, పోటీ హోరాహోరీగా సాగే ప్రాంతాల్లో మరింత సమర్థులైన ఏజెంట్లను నియమించాలని కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి ఈ నెల 5న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మరింత పట్టుదలతో ఎదుర్కోవాలని శ్రీ సజ్జల పిలుపునిచ్చారు. నవంబర్ 3న వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం తదుపరి ఎన్నికలపై పడకుండా నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నింపాలని సూచించారు. ఈ నెల 7న జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ వరకు ఇదే అప్రమత్తత కొనసాగాలన్నారు. మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లపై స్థానిక నాయకులు, కార్యకర్తలకు మరింత అవగాహన ఉంటుందని, అందువల్ల అక్రమాలను అడ్డుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పారు. అధికార పార్టీ ప్రలోభాలు, పోలీసుల ఒత్తిళ్లు, తప్పుడు కేసులు, ఘర్షణలు సృష్టించే ప్రయత్నాలు ఎదురైనా సంయమనంతో వ్యవహరించాలని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ హింసకు తావివ్వకుండా, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయనే కారణంతో పోటీ నుంచి వెనక్కి తగ్గడం, ప్రచారాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని స్పష్టం చేశారు. ప్రతి ఓటు, ప్రతి స్థానం మనకు అదనపు బలమే అధికార పార్టీకి అనుకూలమైన పరిస్థితులు, అధికార దుర్వినియోగం, ఆర్థిక ప్రలోభాల మధ్య వైఎస్సార్‌సీపీ సాధించే ప్రతి ఓటు, ప్రతి వార్డు, ప్రతి డివిజన్, ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానం ఎంతో విలువైనవని శ్రీ సజ్జల అన్నారు. గెలిచిన స్థానాలతో పాటు ఓడిపోయిన చోట్ల వచ్చిన ఓట్లు, ఓటమి తేడా, ఓట్ల శాతం కూడా భవిష్యత్తు ఎన్నికలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తాయన్నారు. గెలుపు ఒక్కటే విజయానికి కొలమానం కాదని, అధికార పార్టీకి గట్టిపోటీ ఇవ్వడం, ఓటమి తేడాను తగ్గించడం కూడా పార్టీ బలాన్ని చాటుతాయని పేర్కొన్నారు. ఫలితాలపై నిరాశ చెందకుండా, జరిగిన పోరాటాన్ని సానుకూల దృక్పథంతో విశ్లేషించుకోవాలని సూచించారు. ప్రతి నాయకుడు తన పరిధిలోని కార్యకర్తలను ప్రోత్సహించి, కౌంటింగ్, తదుపరి పోలింగ్ ప్రక్రియల్లో పూర్తి స్థాయిలో భాగస్వాములను చేయాలన్నారు. ఒక్క ఓటు కూడా అన్యాయంగా చేజారకుండా కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ నేతలు మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ అంశంపై ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషన్ నుంచి స్పందన వచ్చిందన్నారు. ఎక్కడైనా సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ సదుపాయాలు లేకపోతే వెంటనే వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని, వాటిని తిరిగి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కౌంటింగ్‌లో ప్రతి ఓటును అత్యంత కీలకంగా భావించి, ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.