వెన్నుపోటు పార్టీ  కూటమితో అంటకాగుతున్న వారిని వదిలిపెట్టం

ప్రతీ దాడిని, ఘటనను ఆధారాలతో నమోదు చేస్తున్నాం

వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ హెచ్చరిక

అనంతపూర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్

వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని రాజకీయంగా అణిచివేయలేరు

రాజ్యాంగబద్దంగా వ్యవహరించకుంటే రేపు చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సి  ఉంటుంది

:మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టీకరణ

నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలపై పోలీసు, ఎస్ ఈసీ ఉత్తుత్తి ప్రకటనలు మానుకోవాలి

క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నియమావళిని అమలు చేయాలి

:సాకే శైలజానాథ్ హితవు

అనంతపురం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వెన్నుపోటు పార్టీ కూటమితో అంటకాగుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అధికారులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ హెచ్చరించారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న ప్రతి దాడిని  ఆధారాలతో నమోదు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో సమయం వచ్చినపుడు అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. అనంతపూర్ లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థను, ఎలక్షన్ కమిషన్ ను  గుప్పిట్లో పెట్టుకుని  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టి రాజకీయంగా అణచివేయాలని చూస్తే సహించేది లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రతి ఒక్కరూ రేపు చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందనే అంశాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.  ఈ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నవారు శాశ్వతంగా అధికారంలో ఉండబోరనే విషయాన్ని గ్రహించి చట్టబద్దంగా వ్యవహరించాలని శైలజానాథ్ సూచించారు.  స్టేట్ ఎలక్షన్ కమిషన్  ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఉత్తుత్తి  ప్రకటనలు చేయడం మానుకోని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చట్టాన్ని అమలు చేసి చూపాలని సవాల్ విసిరారు.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పటికైనా అనంతపూర్ లో  జరుగుతున్న దౌర్జన్యాలపై దృష్టి సారించిస్వేచ్ఛాయుత, ప్రశాతం  వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  బయట ప్రాంతాల నుంచి వస్తున్న కూటమి పార్టీల గూండాల, రౌడీల, అరాచక శక్తుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టి, పోలీసు శాఖపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేసి  రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని విజ్జప్తి చేశారు. ఈ ప్రెస్ మీట్ లో శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడరంటే..

పల్లెల్లో అశాంతిని రాజేయొద్దు

స్థానిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అనంతపురం జిల్లాలోని గ్రామగ్రామాన హింసాత్మక ఘటనలు జరుగుతుండటం చంద్రబాబు ఓటమి భయానికి నిదర్శనం. రామ్‌నగర్‌లో మహిళలు, యువకులు అనే తేడా లేకుండా దాడులకు పాల్పడటం హేయమైన చర్య.  అన్సర్ బాషా అనే యువకుడిని పోలీసుల సమక్షంలోనే కొట్టడం రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు అద్దం పడుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు, వాహనాల ధ్వంసం, కార్లకు నిప్పంటించే ప్రయత్నాలు జరుగుతున్నా పోలీసు శాఖ ఏం చేస్తోంది?  ఎల్లనూరు, పుట్లూరు, సింగనమల, రాప్తాడు, నార్పల, గార్లదిన్నె ప్రాంతాల్లో దౌర్జన్యకాండను నిలిపివేసి ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలి. గ్రామాల్లోకి బయటి వ్యక్తులను తీసుకొచ్చి గొడవలు సృష్టించడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వెంటనే ఆపాలి.  గతంలో కరువు, ఫ్యాక్షన్‌తో నష్టపోయిన అనంతపురం జిల్లాను మళ్లీ కక్షలు, కార్పణ్యాల వైపు తీసుకెళ్లవద్దు.  ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రాజకీయ చిచ్చు పెట్టొద్దు. పిల్లల భవిష్యత్తును, గ్రామాల అభివృద్ధిని దెబ్బతీయొద్దు అని వైఎస్సార్ సీపీ నేత  సాకే శైలజానాథ్  హితవు పలికారు.

Back to Top