మున్సిపల్‌ ఎన్నికల్లో దొంగ ఓట్లతో కూటమి బరితెగింపు!

స్థానిక ఎన్నికల్లో బలం నిరూపించుకోవడానికి ఇంత దిగజారాలా?

ఎస్వీ మోహన్‌రెడ్డి ఆగ్రహం

కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి.

క‌ర్నూలు:  మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కూటమి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా దొంగ ఓట్లకు పాల్పడిందని వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నామినేషన్ల దశ నుంచి పోలింగ్‌ వరకు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు, గృహ నిర్బంధాలు, దాడులతో భయానక వాతావరణం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కూటమి నేతలకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించారని, ఒక్కో పోలింగ్‌ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో వ్యక్తులను మోహరించి దొంగ ఓట్లు వేయించారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవలేక ఇంతటి దౌర్జన్యాలకు దిగజారడం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌, పోలీసు వ్యవస్థల తీరుతో ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని స్పష్టం చేశారు. కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, మున్సిపల్‌ ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాలు, పోలీసుల ఏకపక్ష వైఖరి, ఎన్నికల నిర్వహణలో లోపాలను వివరించారు.
మీడియా స‌మావేశంలో ఎస్వీ మోహ‌న్‌రెడ్డి ఏమ‌న్నారంటే..

- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దొంగ ఓట్లు వేశారు

మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల దశ నుంచే మాపై దౌర్జన్యాలు మొదలుపెట్టారు. నామినేషన్‌ పత్రాలు చించేశారు, మహిళా అభ్యర్థులపై దాడులు చేశారు. బీఫారాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. పోలింగ్‌ రోజు మా ఏజెంట్ల ఫారాలు చించి, వారిని బూతుల నుంచి బయటకు గెంటేశారు. మహిళా అభ్యర్థులపైనా అసభ్యంగా ప్రవర్తించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రం వద్ద సుమారు 150 మందిని మోహరించి దొంగ ఓట్లు వేశారు. అభ్యంతరం చెప్పిన మా ఏజెంట్లను పోలీసులు బెదిరించారు. మా నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి, గృహ నిర్బంధం చేసి, అర్ధరాత్రి ఇళ్ల నుంచి తీసుకెళ్లి పోలింగ్‌ రోజు ఉదయం వదిలిపెట్టారు. కర్నూలులో మేయర్‌ అభ్యర్థితో కలిసి స్కూటర్‌పై తిరగడానికి కూడా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. మాకు మాత్రమే ఆంక్షలు.. మంత్రి, కూటమి నేతలకు మాత్రం పూర్తి స్వేచ్ఛ కల్పించారు.

- ఎన్నికల వ్యవస్థలపై నమ్మకం ఎలా కలుగుతుంది?

ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా, అనేక చోట్ల కెమెరాలు లేవు. కొన్ని చోట్ల బూతుల బయట మాత్రమే పెట్టారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కూడా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోంది. డీజీపీ, పోలీసు ఉన్నతాధికారుల వ్యవహారశైలి అధికార పార్టీకి అనుకూలంగా ఉంది. స్ట్రాంగ్‌ రూములను పరిశీలించడానికి కూడా మమ్మల్ని అనుమతించడం లేదు. అలాంటప్పుడు బ్యాలెట్‌ బాక్సుల భద్రతపై, కౌంటింగ్‌ పారదర్శకతపై ఎలా నమ్మకం కలుగుతుంది? కౌంటింగ్‌ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ అధికారులు, వారి పర్యవేక్షణలో నిర్వహించాలి. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలైనా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలి. ప్రజాస్వామ్యంపై, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం నిలవాలంటే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి.  

Back to Top