రాష్ట్రంలో ప‌ట్ట‌ప‌గ‌లు ప్ర‌జాస్వామ్యం ఖూనీ 

కూట‌మి పార్టీల‌కు తొత్తులుగా మారిన పోలీసులు

వైఎస్సార్‌సీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివ‌శంక‌ర్ ధ్వ‌జం 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివ‌శంక‌ర్ 

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు కూటమి మూడు పార్టీల‌కు తొత్తులుగా మారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నార‌ని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తీవ్రంగా విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పులివెందులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూటమి నాయకులు పోలీసుల సహాయంతో ప్రజాస్వామ్యాన్ని చీకటిలో హతమార్చారని ఆరోపించారు. సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ గురించి అడిగితే పులివెందుల మినహా మిగతా ప్రాంతాల విజువల్స్ చూపించి మీడియాను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం సమస్యాత్మక బూతులలో లైవ్ వెబ్‌కాస్టింగ్ ఎందుకు ప్రసారం చేయట్లేదని ప్రశ్నించారు. జగన్‌ను చూస్తే భ‌య‌ప‌డిపోయే టీడీపీ నేతలు.. ఈరోజు ప్రజలను, ఓటర్లను చూస్తే కూడా అదే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. డీఎస్పీ మురళీ నాయక్ లాంటి అధికారులు ఓటర్లను, మహిళలను, వృద్ధులను పోలింగ్ స్టేషన్లకు రాకుండా అడ్డుకుంటున్నాడ‌ని, వీరంతా చంద్రబాబు జేబులో నుంచి జీతాలు తీసుకుంటున్నారా అని నిలదీశారు. పోలీసు వ్యవస్థ, ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకునేలా నలుగురైదుగురు అధికారులు రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు సృష్టించారని ధ్వజమెత్తారు.

జగ‌న్ హెలికాప్ట‌ర్ ల్యాండింగ్ కాకుండా కుట్ర‌లు: 

మాజీ సీఎం వైయస్ జగన్ గారి హెలికాప్టర్‌కు ల్యాండింగ్ కి కూడా ప‌ర్మిష‌న్‌ ఇవ్వకుండా, శాటిలైట్ ల ద్వారా పైలట్లను బెదిరించి ఆయన ప్రాణాలు ముప్పు తెచ్చే ప్ర‌య‌త్నం చేశార‌ని పుత్తా శివశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ వస్తే ప్రజలు ఓట్లు వేస్తారనే భయంతోనే ఆయన ప్రయాణాన్ని, పర్యటనలను కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బూతులలో వందలాది మంది టీడీపీ గుండాలు కత్తులు, రాడ్లతో తిరుగుతుంటే ఒక్క పోలీసు కూడా అడ్డుకోలేదని ఆరోపించారు. విశాఖ ఏయూలో మేయర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అనుచరులపై, విజయవాడ, చీమకుర్తిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేశారని, ఒంగోలులో అభ్యర్థులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి మరీ లోపల కూర్చోబెట్టి వేధించడం దుర్మార్గమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం పోలీస్, అధికార యంత్రాంగం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా, దేహి అనే స్థితికి దిగజారిపోయిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని ప‌ట్ట‌ప‌గ‌లు ఖూనీ చేసి రాష్ట్రాన్ని సౌత్ బీహార్ లా మార్చేసి పౌరులను తలదించుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. టెక్నికల్ అంశాలను అడ్డుపెట్టుకుని ఫుటేజ్ డిలీట్ చేయాలని చూస్తే ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టమని, సుప్రీంకోర్టు ముందర నిలబెడతామని పుత్తా శివ‌శంక‌ర్ హెచ్చరించారు.

Back to Top