తాడేపల్లి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నారని, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లను నిర్బంధిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ ప్రాంతాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించారు. ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి: అనంత వెంకటరామిరెడ్డి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైంది. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయం లేకుండా తమ ఓటును వినియోగించుకోవాలి. ఓటే ప్రజాస్వామ్యానికి ఆయుధం. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో దౌర్జన్యాలు, రౌడీయిజానికి, డబుల్ రిజిస్ట్రేషన్లకు ఓటుతోనే సమాధానం చెప్పాలి. పది రోజులుగా హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గం: కేతిరెడ్డి పెద్దారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనకుండా నన్ను గత పది రోజులుగా హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గం. ప్రజల ఓటు హక్కును హరించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాలు పెరిగిపోయాయి. తాడిపత్రిలో జేసీ అస్మిత్‌రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు అరాచకాలకు పాల్పడుతున్నారు. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేవారు. వైయస్ఆర్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను నిర్బంధించి, రిగ్గింగ్, సైక్లింగ్‌కు పాల్పడుతున్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కదనరంగంలో వీరమరణం పొందుతాం తప్ప వెనక్కి తగ్గం: గుడివాడ అమర్నాథ్ విశాఖలోని మింది హైస్కూల్ పోలింగ్ బూత్‌లో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఓటు అనేది ప్రతి పౌరుడి చేతిలో ఉన్న ఆయుధం. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరు బాధ కలిగిస్తోంది. ఓటు వేసేందుకు వచ్చే వారిని అడ్డుకోవడం, భయపెట్టడం దారుణం. కదనరంగంలో వీరమరణం పొందుతాం తప్ప వెనకడుగు వేసేది లేదు. వైయస్ఆర్‌సీపీ వీరోచిత పోరాటం చేస్తోంది. పులివెందులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారి తరఫున పోరాటం కొనసాగిస్తాం. 12 మంది అభ్యర్థులు, నేతలను నిర్బంధించారు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మున్సిపాలిటీలో వైయస్ఆర్‌సీపీకి చెందిన మొత్తం 12 మంది అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. నాలుగు గంటలుగా వారిని స్టేషన్‌లోనే ఉంచారు. మా పార్టీ పోలింగ్ ఏజెంట్లు లేకుండా చేసి, అభ్యర్థులను బూత్‌ల వద్దకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ కోసమే ఈ చర్యలు చేపడుతున్నారు. పోలింగ్ ప్రారంభమైనా అభ్యర్థులను బూత్‌ల పరిశీలనకు కూడా అనుమతించడం లేదు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలి.