మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పులివెందుల వచ్చిన శ్రీ వైయస్ జగన్, అక్కడ టీడీపీ అరాచకాలు, విపక్ష వైయస్సార్‌సీపీపై దాడులు, ఏకంగా 70 పోలింగ్ బూత్‌ల నుంచి పార్టీ ఏజెంట్ల గెంటివేత, యథేచ్ఛగా టీడీపీ పోలింగ్ బూత్‌లు స్వాధీనం చేసుకోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓటు వేసేది లేదన్న ఆయన, అన్నింటిపై ఫిర్యాదు చేస్తూ, ఆర్‌ఓ కార్యాలయం వద్ద బైఠాయించారు. పులివెందులలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేసిన శ్రీ వైయస్ జగన్, అప్పుడే తాను ఓటు వేస్తానని ప్రకటించారు. పులివెందుల: పులివెందులలో ఇప్పుడు ఓటు వేయొద్దన్న నిర్ణయం తర్వాత మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్ జగన్, ఇంకా ఏమన్నారంటే..: అప్పుడు కచ్చితంగా ఓటు వేస్తాను: ఇప్పుడు నేను ఓటు వేస్తే, ఎన్నికల ప్రక్రియ అంతా బాగున్నట్లు ఒప్పుకున్నటే. అందుకే నా ఓటు వేయకుండా, ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మేము అడిగినట్లుగా ఇక్కడ రీపోలింగ్ పెడితే.. న్యాయం, ధర్మం అనేది ఒకటి బ్రతికి ఉండి.. మనస్సాక్షి అనేది ఒకటి బ్రతికి ఉండి.. వాటికి అనుగుణంగా రీపోలింగ్‌కు ఆదేశిస్తే, అప్పుడు వచ్చి కచ్చితంగా ఓటు వేస్తాను. ఎన్నికల ప్రక్రియ, వ్యవస్థ మొత్తం దిగజారిపోయినప్పుడు, అంతా బాగుందని ఒప్పుకోవడం ఏ మాత్రం సరికాదు. న్యాయపోరాటం కూడా చేస్తాము. ఎందుకంటే..: ఈ ఎన్నికల్లో జరుగుతున్న దారుణాలన్నింటిపై తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాము. న్యాయపోరాటం కూడా చేస్తాము. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఈ పరిస్థితి కచ్చితంగా మారాల్సి ఉంది. ఇక్కడ ఏం జరుగుతోంది అనేది ఒక్కసారి చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. ఈరోజు ఇక్కడ నామినేషన్ హక్కు, ఓటు హక్కు పోతోంది. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే.. రేపు పొద్దున కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ ఇలాగే ఉంటే.. ఆస్తి హక్కులు కూడా ప్రజలకు లేకుండా పోతాయి. అంతా చంద్రబాబు తోలుబొమ్మలు: రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) మొదలు, ఆర్‌ఓలు, కలెక్టర్లు, ఎస్పీలు అంతా దురదృష్టవశాత్తూ చంద్రబాబునాయుడుగారి చేతిలో తోలుబొమ్మలుగా మారారు. ఇది వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద లోపం. ఎప్పుడైతే ఎస్‌ఈసీ ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా, ఏ ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా పని చేయడం మొదలు పెడుతుందో, అప్పుడు ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ ఎస్‌ఈసీగా ఉన్నాడు. ఆయన్ను అంతకు ముందు చంద్రబాబునాయుడుగారు నియమించారు. ఆయన ఆధ్వర్యంలో మేము ఎన్నికలకు పోయాం కాబట్టే, అప్పుడు కూడా చంద్రబాబునాయుడుగారు కోరుకున్నట్లుగా ఎన్నికలు జరిగాయి. మాకు నచ్చినా, నచ్చకపోయినా.. అధికారులందరినీ ఇష్టారాజ్యంగా ఎన్నికల విధుల నుంచి తప్పించారు. అది మంచో, చెడో అన్నది పక్కన పెడితే అప్పుడు చంద్రబాబునాయుడు మాత్రం బాగా తృప్తి చెందారు. అప్పుడే వ్యవస్థల పతనం మొదలు: నాడు చంద్రబాబునాయుడుగారు తన స్వార్థం, ప్రయోజనాల కోసం తన వీరాభిమాని అయిన వ్యక్తిని ఎస్‌ఈసీగా నియమించారు. అక్కడి నుంచే వ్యవస్థ దిగజారిపోయింది. ఇప్పుడు మిగతా వాళ్లంతా కూడా చంద్రబాబునాయుడుగారి చేతిలో తోలుబొమ్మలు కాబట్టి, ఈ వ్యవస్థ అంతకంతకూ దిగజారి కుప్పకూలుతోందని శ్రీ వైయస్ జగన్ అన్నారు.