తిరుపతి: రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేక అక్రమాలు.. విపక్ష వైయస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఏకంగా వారిపై దాడి చేసి నామినేషన్లు పత్రాలు తీసుకుని చింపేయడం, చివరకు ఆర్వోల చేతి నుంచి నామినేషన్లు పత్రాలు బలవంతంగా తీసుకుని చింపేయడం, ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా వారు ఏ మాత్రం పట్టించుకోకపోవడం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా నిస్తేజం కావడం.. అన్నింటిపై స్వతంత్ర విచారణ జరిపించాలని వైయస్సార్‌సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి, రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్ధుల్‌నజీర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక లేఖ రాసిన ఆయన, తాను ప్రస్తావించిన అంశాలన్నింటికి సంబంధించిన ఆధారాలు కూడా పొందుపర్చారు. విచారణలో ఎన్నికల కమిషనర్ దుష్ప్రవర్తన లేదా విధుల నిర్వహణలో అసమర్థత రుజువైతే రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్‌కు రాసిన లేఖలో ఎంపీ ఎం.గురుమూర్తి ఏయే అంశాలు ప్రస్తావించారంటే..: అక్టోబరు 16న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అన్నమయ్య, వైయస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం తదితర జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పుంగనూరు, పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాజంపేట, కమలాపురం, రాయచోటి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లో విపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బెదిరించడం, దాడులకు పాల్పడడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పుంగనూరులో రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డితో పాటు, పార్టీ మున్సిపల్ అభ్యర్థులపై అధికార టీడీపీకి చెందిన వారు దాడులు చేశారు. కర్రలు, రాళ్లతో దాడులు చేయడం, ఎంపీ వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఆయన ప్రాణాలకే ముప్పు కలిగించే ప్రయత్నం జరిగింది. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆయన అనుచరులకు చెందిన వాహనాలతో పాటు, పార్టీ ఆఫీస్‌కు కూడా నిప్పు పెట్టారు. మరోవైపు ఎక్కడికక్కడ వైయస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులను అన్యాయంగా గృహ నిర్భంధం చేస్తున్నారు. శాంతి భద్రతల పేరుతో ఆ పని చేసిన పోలీసులు, దాన్ని అన్ని పార్టీలకు సమానంగా అమలు చేశారా? లేక విపక్ష అభ్యర్థులను మాత్రమే అడ్డుకున్నారా అనేది ముఖ్యంగా చూడాల్సి ఉందని అన్నారు. పులివెందులలో పోలీసులు సూచించిన సమయానికి నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన విపక్ష అభ్యర్థులను పోలీసులు స్వయంగా అడ్డుకోవడం, టియర్‌గ్యాస్ ప్రయోగం, గాలిలోకి కాల్పులు జరపడం దారుణం. ఆ ఘటనలపైనా విచారణ జరిపించాలి. స్థానిక ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్లో అధికార పార్టీకి చెందిన వారితో పాటు, రాష్ట్రేతరులు కూడా పాల్గొన్నారు. అలాంటి వ్యక్తులను పోలీసులు సులభంగా గుర్తించినా, వారిని ఎక్కడా నియంత్రించలేదు. వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. వీటన్నింటిపై ఎప్పటికప్పుడు పూర్తి ఆధారాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)కు నివేదిస్తున్నా, ఏ మాత్రం స్పందించడం లేదు. అందుకే అన్నింటిపై స్వతంత్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా చూడాలని ఎంపీ ఎం.గురుమూర్తి, తన లేఖలో గరవ్నర్ శ్రీ అబ్ధుల్ నజీర్‌కు విజ్ఞప్తి చేశారు.