ప్రజలకు మొహం చూపించలేకే దాడులతో ఏకగ్రీవాలు

భవిష్యత్తులో ఇంతకింత మూల్యం చెల్లించుకోక తప్పదు

పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ నేతల హెచ్చరిక

నరసరావుపేట, లింగంగుంట్లలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యేలు పిన్నెలి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, సత్తెనపల్లి ఇన్ ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి.. 

ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో వణికిపోతున్నారు

పోలీసులు, అధికారులతో కుమ్మక్కై టీడీపీ చెత్త రాజకీయం

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

దాడులు, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలా ?

దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

సీమ, పల్నాడు ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు

చేసింది చెప్పుకోలేక ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు

కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ఎప్పుడో బీహార్ లో ఇలా ఎన్నికలు జరిగేవని విన్నాం

ఇప్పుడు ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నాం

గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, సత్తెనపల్లి ఇన్ ఛార్జ్

నరసరావుపేట:     రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాడులు, దౌర్జన్యాలతో నిర్వహిస్తూ బీహార్ లా మార్చేస్తున్నారని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెలి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, సత్తెనపల్లి ఇన్ ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. పోలీసులు, అధికారులు, టీడీపీ నాయకులు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని అభ్యర్ధుల నుంచి కోట్ల రూపాయుల వసూలు చేసి, వైఎస్సార్సీపీ అభ్యర్ధుల్ని నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవచ్చని, కానీ ఎల్లకాలం ఇది సాగదన్నారు. రేపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే సిట్ ఏర్పాటు చేసి వెన్నపోటు పార్టీ నాయకులతో పాటు పోలీసులకూ తగిన గుణపాఠం చెప్తామని పల్నాడు జిల్లా నేతలు హెచ్చరించారు. 
ప్రెస్ మీట్లో పల్నాడు జిల్లా నేతలు ఏమన్నారంటే.. 

దమ్మూ ధైర్యం ఉంటే నిజాయితీగా ఎన్నికలు నిర్వహించాలి
:పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, నామినేషన్లు పడిన చోట కూడా బీ-ఫారాలు చించేయడం, అవి దాటుకుని కొన్ని చోట్ల కిడ్నాప్ లు, బెదిరింపులతో విత్ డ్రా చేయించడం, తప్పుడు కేసులు పెడతామని బెదిరించి కండువాలు కప్పడం చేస్తున్నారు.  టీడీపీ గూండాలు, నాయకులు, అధికారులు, పోలీసులు కుమ్మక్కై ఇలాంటి చేతకాని వెధవ రాజకీయాలు చేస్తున్నారు. అదేదో గొప్ప అన్నట్లుగా ఏకగ్రీవాలు చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. నామినేషన్లు పడితే ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో మీరు వణికిపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఏమీ చేసిందీ లేదు, ఏ సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందించిందీ లేదు, రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపిస్తూ, కమిషన్ల పేరుతో వేల కోట్లు దోచేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకు మొహం చూపించలేక ఇలాంటి దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. పల్నాడు జిల్లాలో యథేచ్ఛగా కర్రలు, రాడ్లు తీసుకుని నామినేషన్ కేంద్రాల దగ్గర వందల మంది టీడీపీ గూండాలు పోలీసుల సాయంతో దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారు. చిలకలూరిపేటలో మైనార్టీ అభ్యర్ధిని బలవంతంగా తీసుకెళ్లి రాత్రి కండువా కప్పారు. మా పార్టీ కౌన్సిలర్లుగా నామినేషన్లు వేసిన వారిని ప్రలోభపెట్టి, బెదిరించి వాళ్ల పార్టీ కండువాలు కప్పుతున్నారు. వీళ్లు చేస్తున్న అక్రమాలు, దాడుల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు చేస్తున్న పనులు దుర్మార్గంగా ఉన్నాయి. దమ్మూ ధైర్యం ఉంటే, నిజాయితీగా ఎన్నికలు జరిపించాలంటే ప్రతిపక్షాల నామినేషన్లకు ఎందుకు భయపడుతున్నారు?
    నామినేషన్లను రిగ్గింగ్ చేసిన పరిస్ధితి దేశంలో ఎక్కడా లేదు. టీడీపీ నేతలు, అధికారులు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఒక్కొక్క జడ్పీటీసీ నామినేషన్ కు డబ్బులు తీసుకుని యథేచ్ఛగా దౌర్జన్యాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ, కలెక్టర్, జిల్లా అధికారులు ఉండగానే నామినేషన్ కేంద్రాల్లోకి వెళ్లి వందల మంది టీడీపీ గూండాలు మా అభ్యర్ధులను రక్తం వచ్చేలా కొట్టిన పరిస్ధితి కనిపిస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, కూటమి ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పోలీసుల్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇంకా ఈ కూటి ప్రభుత్వం దిగజారే పరిస్ధితి కనిపిస్తోంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని కనీసం మహిళలపై దౌర్జన్యాలు చేయడం ఆపాలని కోరుతున్నాం. ఈ దాడులు ప్రోత్సహించిన టీడీపీ గూండాలు, పోలీసులు, అధికారుల్ని వదిలిపెట్టేది లేదు. తగిన శిక్ష అనుభవిస్తారని హెచ్చరిస్తున్నాం. 

ఇదీ ఓ గెలుపేనా అని జనం నవ్వుకుంటున్నారు
:గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ చూసి జాతీయ మీడియా సైతం ఏం జరుగుతోందని మాట్లాడుకుంటోంది. అయినా చంద్రబాబుకు బుద్ధి రావడం లేదు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు కుమ్మక్కై అభ్యర్ధుల నుంచి లక్షలు, కోట్లు దోచుకుని, ఇద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ప్రత్యర్థుల నామినేషన్లు వేయనీయకుండా పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఒక్క ఎంపీటీసీ నామినేషన్ పడనివ్వకుండా చేశారు. ఆర్డీవో ఆఫీసులో జడ్పీటీసీ నామినేషన్ జరుగుతుంటే అక్కడ టీడీపీ గూండాలు, పచ్చ చీరలతో మహిళల్ని పంపి మా మహిళా అభ్యర్ధుల నామినేషన్లను, చీరలను చించేసే పరిస్ధితి ఉంది. ఈ పదవుల కోసం చంద్రబాబు ఇంత దిగజారిపోవాలా ? రాష్ట్రంలో మేలు చేశానని, సూపర్ సిక్స్ ఇచ్చేశామని చెప్పుకుంటున్న చంద్రబాబు, 11 సీట్లు మాత్రమే గెలిచిన మా పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారు? దీన్ని బట్టి మీ పరిస్ధితి ఏంటో ప్రజలకు అర్దమవుతోంది. నామినేషన్లు వేయనివ్వకుండా మీరు అడ్డుకుంటున్న తీరు చూసి ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నామినేషన్లను సైతం టీడీపీ అభ్యర్ధులు కండువాలు కప్పుకుని వేస్తున్నారు. మీ పార్టీ నాయకులకు వైఎస్సార్సీపీ కండువాలు వేసి నామినేషన్లు వేయిస్తున్నారంటే మీకు సిగ్గుండాలి. నాయకుల్ని బతకనివ్వరు, అభ్యర్ధుల్ని బతకనివ్వరు, వాళ్లను ఎత్తుకెళ్లి గంజాయి కేసులు పెడుతున్నారు. మేం నామినేషన్లు వేయకపోతే మీరు గెలిచినట్లు ఎలా అవుతోందో అర్దం కావట్లేదు. దీనికి మళ్లీ బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటుంటే, ఇలాంటి గెలుపు కూడా గెలుపేనా అనిపిస్తోంది. దీనికి ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు.

ప్రతిపక్షాల గొంతునొక్కి సంబరాలా?
:కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

స్దానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేశామని సంబరపడుతున్నారు.  కానీ మీకు 161 సీట్లు ఇచ్చారని అనుకుంటున్న ప్రజల గొంతు నొక్కారు. ఇంటికి పోయే ఓటు అడిగితే ప్రజలు సమస్యలు చెప్తారు. తద్వారా నాయకులకు సమస్యలు తెలుస్తాయి. గెలిచిన పార్టీ ఎవరైనా ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికే ఎన్నికలు. మీరు ఎన్నికలే పెట్టకపోతే,  పోలీసులతో నామినేషన్లు అడ్డుకుని ఏకపక్షంగా వేసుకుంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడిది? ఇవాళ రాష్ట్రంలో మీ పరిస్ధితి బాగోలేదని భయపడి ఉండొచ్చు. కానీ రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఏం చేస్తారు ? ఎన్నికలు జరిగి ఉంటే అనేక మాటల ద్వారా ఒక్కో ఇంటికి రూ.1500 నుంచి రూ.3000 వచ్చేవి. దాన్ని ప్రజలు నష్టపోయారు. కచ్చితంగా రాబోయే కాలంలో మీకు సమాధానం దొరుకుతుంది. ఇస్తానన్న పథకాలు ఎగ్గొట్టి, వచ్చే 1500, 3000 ఎగ్గొట్టి, కచ్చితంగా మీకు శిక్ష పడబోతోంది. పల్నాడులో 83లో టీడీపీ వచ్చాక బాంబుదాడులు, రిగ్గింగ్ లు, దొంగఓట్లు చూశాం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయ్యాక పల్నాడులో బాంబుదాడులు ఉన్నాయా, నక్సలిజం ఉందా చెప్పండి. అప్పట్లో నరసరావుపేట నుంచి మొదలుపెడితే ఆంధ్రరాష్ట్రంలో 92 లక్షల దొంగ ఓట్లు తీసేసాం. 2004 తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ గెలిచాయి. మరి ఇవాళ ఎందుకీ కొత్త ఒరవడి తెస్తున్నారు. చేసింది చెప్పుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారు. పోలీసుల్ని ఎవరైనా వాడతారు, దొంగ కేసులతో ఎవరైనా బెదిరిస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సిట్ వేస్తారు. మీరు మా ఇళ్లకు పంపిన కానిస్టేబుళ్లు అప్రూవర్లుగా మారి ఈ ఐపీఎస్ లకు, సీఐలకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇస్తారు. పంచాయతీ ఎన్నికలైనా ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించండి, లేకపోతే ప్రజల్లోకే వెళ్లి తేల్చుకుంటాం. గతంలో పెద్ద పెద్ద నియంతలే ఓడిపోయారు, చంద్రబాబు ఎంత ? రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉండవు అన్నది మీకు అర్దమవుతుంది. 

కూటమి దాష్టికాలకు రేపు మూల్యం చెల్లించుకోవాల్సిందే
:గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, సత్తెనపల్లి ఇన్ ఛార్జ్

ఎప్పుడో చిన్నప్పుడు బీహార్ లో ఎన్నికలు ఇలా జరుగుతుంటాయని వినేవాళ్లం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ అలాంటి పరిస్ధితులు తీసుకొచ్చారు. మూడు రోజులుగా నేను స్వయంగా ఎస్పీ ఆఫీసుకు తిరిగాం. వన్ టౌన్ స్టేషన్లో ఉంటే డీఎస్పీ బంగ్లాకు వస్తే ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్తామన్నారు. పది నిమిషాల్లో వస్తేనే తీసుకెళ్తామని షరతు పెట్టారు. నామినేషన్ కు తీసుకెళ్లి వేయించే ఉద్దేశం లేకపోవడం వల్లే ఇలా చేశారు. రాజుపాలెం మండలంలో పొద్దున 11 గంటల నుంచి మేం ఫోన్ చేస్తూనే ఉన్నాం. నా నంబర్ నుంచి డీఎస్పీని అడిగితే ఎస్సైకి చెప్పాం అంటారు. సీఐకి ఫోన్ చేస్తే  సీఐకి చెప్పాం వాహనం పంపిస్తాం అన్నారు. నామినేషన్ కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో రోడ్డు మీద ఉన్నాం. అక్కడి నుంచి టీడీపీ గూండాలు రాడ్లు, పెద్ద పెద్ద కర్ర బొంగులతో దాడికి సిద్దంగా ఉన్నారు. పోలీసులకు ఫోన్ చేస్తే మేం రాలేం, మీరే ఇక్కడికి వచ్చేయండి అన్నారు. ఇది కేవలం పోలీసులు, అధికారులు, టీడీపీ గూండాలు కుమ్మక్కై చేసిందే. సత్తెనపల్లిలో గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితులు లేవు. కూటమి ప్రభుత్వం కొత్త సంప్రదాయాలకు తెరలేపింది. ఇది ఇక్కడితో ఆగదు.  రేపు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు.

Back to Top