విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించబడుతున్నాయని పేర్కొంటూ వైయస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యోహన్ రాజు తదితరులు ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల హక్కులకు భంగం కలుగుతున్న తీరును ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ అండతో ఎన్నికల అక్రమాలు, నామినేషన్ల తిరస్కరణలు, అభ్యర్థులపై బెదిరింపులు, పోలీసుల దౌర్జన్యాలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతోనే కాకుండా, నిర్వీర్యమవుతున్న వ్యవస్థలు, బాధ్యతలను విస్మరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తోనూ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. ఎస్ఈసీ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించకపోయినా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయస్ఆర్సీపీ పోరాటం ఆగదని, అభ్యర్థుల హక్కులు, ప్రజల ఓటు హక్కు, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు రాజకీయంగానూ, న్యాయపరంగానూ పోరాటాన్ని కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ఫిర్యాదు అనంతరం ఎస్ఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఎన్నికల అక్రమాలపై తమ వైఖరిని వెల్లడించారు. వైయస్ఆర్సీపీ నేతలు మీడియాతో ఏమన్నారంటే.. - నామినేషన్ల తిరస్కరణలతో ప్రజాస్వామ్య హక్కుల హరణం: లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు నామినేషన్ల దశ నుంచే అక్రమాలు జరుగుతున్నాయి. చంద్రగిరిలో మా పార్టీకి చెందిన 142 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కందుకూరుతో పాటు అనేక ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఎస్ఈసీ నిబంధనల ప్రకారం అవసరం లేని ధ్రువపత్రాలను సాకుగా చూపి నామినేషన్లు తిరస్కరిస్తున్నారు. అప్పీళ్లలోనూ అభ్యర్థుల వాదనలు వినడం లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. - పోలీసులు, రెవెన్యూ అధికారుల దౌర్జన్యాలపై పోరాటం పోలీసు, రెవెన్యూ అధికారుల్లో కొందరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ అభ్యర్థులను బెదిరించడం, అక్రమంగా అరెస్టులు చేయడం, నామినేషన్ పత్రాలను చించేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. నకిరేకల్‌లో జెడ్పీటీసీ అభ్యర్థి కందుల హనుమాయమ్మ భర్త లక్ష్మారెడ్డిని పోలీసులు తీసుకెళ్లి ఎక్కడ ఉంచారో కూడా చెప్పని పరిస్థితి. తాడిపత్రిలో దాడులు, వాహనాల ధ్వంసం జరుగుతున్నాయి. బి-ఫారాలు సమర్పించినా రసీదులు ఇవ్వడం లేదు. అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఎస్ఈసీని కోరుతున్నా సరైన స్పందన లేదు. ఎన్నికల కమిషన్ నిబంధనలను క్షేత్రస్థాయిలో అధికారులు అమలు చేయడం లేదు ’’ అని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. - ఇది రాజకీయ పోరాటం కాదు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సమరం మా పోరాటం అధికార పార్టీతో మాత్రమే కాదు.. నిర్వీర్యమవుతున్న వ్యవస్థలు, బాధ్యతలు నిర్వర్తించని ఎస్ఈసీతో కూడా. వైయస్ఆర్సీపీ పేరుతో సంబంధం లేని వ్యక్తులు నామినేషన్లు వేయడం, రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా బ్యాలెట్ పత్రాలు రూపొందించాలనే సర్క్యులర్ వంటి అంశాలపై సమాధానం చెప్పాల్సి ఉంది. ఎస్ఈసీకి పదేపదే ఫిర్యాదులు చేసినా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. తప్పు చేసిన అధికారులు ఎవరైనా చట్టపరంగా బాధ్యత వహించాల్సిందే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను, ప్రజల ఓటు హక్కును కాపాడే వరకు వైయస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుంది. - రాష్ట్ర పరువు తీస్తున్న చంద్రబాబు పాలన : టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ‘‘ఈ నెల 13వ తేదీ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి వైయస్ఆర్సీపీ తరఫున వినతిపత్రాలు సమర్పిస్తూ, ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై మా అభ్యంతరాలను తెలియజేస్తున్నాం. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్, వార్డు మెంబర్ ఎన్నికలను కూడా రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువును దెబ్బతీస్తోంది. ఒక వ్యక్తి, ఒక కుటుంబం ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలను పక్కదారి పట్టించడం ఎంతవరకు సమంజసం? ఆ చిన్న రాజకీయ సమూహం జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏమవుతుందో కూడా ఆలోచించుకోవాలి. - పదవులు శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యం శాశ్వతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు సహా ప్రభుత్వంలో ఉన్నవారందరూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే—పదవులు శాశ్వతం కాదు, ప్రభుత్వం మారుతుంది, కానీ ప్రజలు, ప్రజాస్వామ్యం శాశ్వతం. పదవీ విరమణ చేసిన తర్వాత తమను ఎవరూ ఏమీ చేయలేరని అధికారులు భావించవద్దు. చట్టాన్ని ఉల్లంఘించినవారు, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినవారు, ఈ అక్రమాలకు సహకరించినవారు ఎవరైనా సరే చట్టం ముందు నిలబడాల్సిందే. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు వైయస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుంది ’’ అని సుధాకర్‌బాబు తేల్చి చెప్పారు..