విజయవాడ పశ్చిమలో వైయ‌స్ఆర్‌సీపీ భారీ విజయం ఖాయం

 మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 

 విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్ చిట్టినగర్‌ సొరంగం రోడ్‌, గౌతమ్‌ పబ్లిక్‌ స్కూల్‌ రోడ్‌, ఈద్గా మహల్‌ వీధి, వాగు సెంటర్‌, సొరంగం కొండ ప్రాంతాల్లో మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వెలంపల్లి శ్రీనివాసరావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నగర మేయర్‌ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిని పిళ్ల కళ్యాణితో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

విజయవాడ పశ్చిమలోని 28 డివిజన్లలో అత్యధిక స్థానాలను వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుందని, మేయర్‌ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి పశ్చిమ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయి మెజారిటీ లభిస్తుందని వెలంపల్లి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి లభిస్తున్న స్పందన, కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత పార్టీ విజయానికి బలమైన పునాదులని పేర్కొన్నారు. 45వ డివిజన్‌ అభ్యర్థిని పిళ్ల కళ్యాణి బీటెక్‌ చదివిన విద్యావంతురాలని, ఆమెకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. గత ఐదేళ్లలో మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి నగర అభివృద్ధికి కృషి చేశారని వివరించారు.

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెలంపల్లి పేర్కొన్నారు. పప్పు, ఉప్పు, వంటనూనె వంటి నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రచార ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు.

మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి, యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వెలంపల్లి నిలదీశారు. గతంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. ప్రజలు ఈ పాలనను గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కూటమికి తగిన బుద్ధి చెప్పి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తారని వెలంపల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. 

Back to Top