వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కత్తితో దాడి 

కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఘటన   

మాజీ కార్పొరేటర్‌ సహా ఇద్దరికి తీవ్ర గాయాలు

వైయ‌స్ఆర్ జిల్లా : కడపలో కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం 41వ డివిజన్‌లోని నకాష్‌ సమీపంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తుండగా.. టీడీపీకి చెందిన సయ్యద్‌బాషా అనే వ్యక్తి వైఎస్సార్‌సీపీకి చెందిన ఖాలిద్‌ హుసేన్‌ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. కత్తి పొట్టలో దిగబడటంతో ఖాలిద్‌ హుసేన్‌కు తీవ్రగాయా­లయ్యాయి. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో 41వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ మాజీ కార్పొరేటర్‌ షంషీర్‌ చేతికి తీవ్రగాయాల­య్యాయి. గాయపడిన ఇద్దరినీ క్రిస్టియన్‌ లేన్‌లో ఉన్న హోలిస్టిక్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. స్థానికులు దాడికి పాల్పడిన సయ్యద్‌బాషాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు 
మాజీ కార్పోరేటర్‌ షంషీర్, అతని అనుచరుడు ఖాలీద్‌హుసేన్‌లపై కత్తితో దాడి చేసిన సయ్యద్‌బాషాపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులతో ఎన్నికల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఐ శ్రీహరి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Back to Top