తాడేపల్లి: నిరుద్యోగ యువత ఏళ్ల తరబడి కష్టపడి చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. కూటమి ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నియామకాలను అంగడి సరుకులా మార్చేస్తోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన సాధికారత విభాగం కన్వీనర్ సలాం బాబు ధ్వజమెత్తారు. డీఎస్సీ నుంచి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వరకు పరీక్షలు లేకుండా నియామకాలు చేపట్టే విధానం వెనుక పారదర్శకత ఎక్కడుందని ప్రశ్నించారు. అర్హత, మెరిట్‌కు తిలోదకాలిచ్చి నిబంధనలను తమకు అనుకూలంగా మార్చడం ద్వారా లక్షలాది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సలాం బాబు.. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ప్రెస్‌మీట్‌లో సలాం బాబు ఏమన్నారంటే.. - ఉద్యోగాలను అంగడి సరుకులా మార్చేశారు “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దోపిడీ ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ చూస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఉద్యోగాలను కూడా అమ్ముకునే స్థాయికి పరిస్థితిని తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ వేలాది ఉద్యోగాల భర్తీపై అనుమానాలకు తావిస్తున్నారు. డీఎస్సీపై వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారు, పార్టీ నేతలు ఆధారాలతో ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమ భవిష్యత్తుపై ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.” - పరీక్ష లేకుండా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు ఎలా? “డీఎస్సీ వ్యవహారం మరవకముందే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒడిశా, పంజాబ్, తెలంగాణ, మిజోరం వంటి రాష్ట్రాల్లో రాత పరీక్ష ద్వారా నియామకాలు జరుగుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఎందుకు? 2016లోనే పరీక్ష అవసరం లేదని జీవో ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు అదే జీవోను అడ్డుపెట్టుకుని నియామకాలు చేపట్టడం పట్ల ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. అర్హత, మెరిట్‌ను నిర్ధారించేందుకు ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష నిర్వహించాలి.” - ఈ ద్వంద్వ విధానం ఎందుకు? “డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష అవసరం లేదని చెబుతున్న ప్రభుత్వం.. పోలీస్ నియామకాల్లో మాత్రం రాత పరీక్ష తప్పనిసరి అంటోంది. ఒకచోట పరీక్ష వద్దు.. మరోచోట పరీక్ష తప్పనిసరి అనే ఈ ద్వంద్వ విధానం ఎందుకు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. పరీక్ష లేకుండా నియామకాలు చేపడితే తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టే అవకాశం ఉందనే అనుమానాలు మరింత బలపడతాయి. అందుకే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలి.” - సీబీఐ విచారణకు సిద్ధమా చంద్రబాబూ? “మూడు నెలలుగా నిరుద్యోగులు, విద్యార్థులు డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తున్నారు. కాకినాడలో తమ భవిష్యత్తు కోసం రోడ్డెక్కిన నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, కోచింగ్ సంస్థల నిర్వాహకులపై కేసులు పెట్టి భయపెడుతున్నారు. నిరుద్యోగులు ప్రశ్నిస్తే వారిని అణచివేయడం, కోచింగ్ సెంటర్లను బెదిరించడం ఇదేనా పాలన? వైయస్ఆర్‌సీపీ హయాంలో జరిగిన పరీక్షలైనా, మీ హయాంలో జరిగిన పరీక్షలైనా సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకడుగు? వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలకు వెంటనే రాత పరీక్ష నిర్వహించి, డీఎస్సీతో పాటు అన్ని నియామకాలపై నిష్పక్షపాత విచారణకు ప్రభుత్వం సిద్ధం కావాలి.”