నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లా చివరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి జిల్లా ఉన్నతాధికారులు, జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో హాజరుకాకపోవడంపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కీలక సమావేశానికి అధికారులు గైర్హాజరు కావడం ప్రజాస్వామ్యంలో ఎన్నడూ చూడని పరిణామమని, ఇది ఒక చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి.. జిల్లా ఉన్నతాధికారులు ఎవరూ సభకు రాకపోవడంతో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఉన్న మహిళను అవమానించే విధంగా అధికారులు వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం అని తెలిసినప్పటికీ అధికారులు హాజరుకాకపోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. జిల్లా చరిత్రలో ఇలాంటి పరిణామాలను ఎన్నడూ చూడలేదని పేర్కొంటూ అధికారుల తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నుంచి బయటకు వచ్చిన చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి జడ్పీటీసీలతో కలిసి జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో బైఠాయించి అధికారుల తీరును నిరసించారు.