గ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి

జాబ్‌ క్యాలెండర్‌లో వన్‌టైమ్‌ సడలింపు ఇవ్వాలంటూ వైయ‌స్‌ జగన్‌కు నిరుద్యోగుల వినతి

తాడేపల్లి: గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ నిరుద్యోగ అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ. రవిచంద్ర ఆధ్వర్యంలో అభ్యర్థులు వైయ‌స్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు.

వయోపరిమితి సడలింపు సరిపోవడం లేదు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఫేజ్‌–2 జాబ్‌ క్యాలెండర్‌లో వయోపరిమితిని కేవలం రెండేళ్లు మాత్రమే సడలించడం వల్ల అనేక మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ పరీక్షలు రాసే అవకాశం లేకుండా పోతుందని వారు వివరించారు. రాష్ట్రంలో క్రమం తప్పకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని తెలిపారు.

2018–2026 మధ్య పరిమిత నోటిఫికేషన్ల కారణంగా నష్టం

2018 నుంచి 2026 మధ్య గ్రూప్‌–1, గ్రూప్‌–2, డీఎస్సీ నోటిఫికేషన్లు పరిమితంగా రావడంతో తాము తీవ్రంగా నష్టపోయామని అభ్యర్థులు వైయ‌స్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా సిద్ధమవుతున్నప్పటికీ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల కాకపోవడంతో వయోపరిమితి సమస్యగా మారిందని వివరించారు.

వన్‌టైమ్‌ సడలింపుగా 47 ఏళ్లకు పెంచాలి

ప్రస్తుతం వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు మాత్రమే పెంచారని, ఈ జాబ్‌ క్యాలెండర్‌కు వన్‌టైమ్‌ సడలింపుగా దానిని 47 ఏళ్లకు పెంచాలని అభ్యర్థులు కోరారు. తెలంగాణలో గతంలో వయోపరిమితి సడలింపులు ఇచ్చిన విషయాన్ని కూడా వైయ‌స్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

గతంలో టీడీపీ నేతల డిమాండ్లను గుర్తుచేసిన అభ్యర్థులు

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచిన సమయంలో నిరుద్యోగ అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని గతంలో టీడీపీ నేతలు, టీడీపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు కోరిన విషయాన్ని కూడా అభ్యర్థులు ప్రస్తావించారు. ప్రస్తుతం సెప్టెంబర్‌ 15న గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో వయోపరిమితిపై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.

లక్షలాది మంది నిరుద్యోగులకు అవకాశం

లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగాలకు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు. వారి వినతిపై వైయ‌స్‌ జగన్‌ స్పందిస్తూ సమస్యను పరిశీలించి, అవసరమైన విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ. రవిచంద్రతో పాటు నిరుద్యోగ అభ్యర్థులు ఆర్‌. శ్రీనివాసరావు, కె. కిరణ్‌కుమారి, కె. రాజ్‌కోటి తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top