వైయస్ఆర్ జిల్లా : మధ్యాహ్న భోజనంలో బల్లి పడిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను షేర్ చేశారనే కారణంతో వైయస్ఆర్‌సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నేట్లపల్లి శివరాంపై పోలీసులు కేసు నమోదు చేయడంపై పార్టీ నేతలు మండిపడ్డారు. సోషల్ మీడియా పోస్టుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం పోలీసుల తీరుపై పలు ప్రశ్నలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జిల్లా ఎస్పీని కలిసి శివరాంపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరారు. అదే వీడియోను పలు సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేసినప్పటికీ శివరాంపైనే కక్షపూరితంగా కేసు నమోదు చేశారని వారు పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి బైండోవర్ చేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, శివరాంపై నమోదు చేసిన కేసులను వెంటనే సమీక్షించాలని కోరారు.