అనపర్తి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రామవరం గ్రామంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైయస్ఆర్‌సీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించాలని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆకాంక్షించారు. రామవరం గ్రామ పార్టీ కన్వీనర్ నల్లమిల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ సత్తి వీర్రెడ్డి నివాసం వద్ద నిర్వహించిన గ్రామ పార్టీ కమిటీ సమావేశానికి డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామవరం ప్రజలు వైయస్ఆర్‌సీపీకి అండగా నిలుస్తారు: సత్తి సూర్యనారాయణరెడ్డి తాను అసెంబ్లీకి పోటీ చేసిన మూడు ఎన్నికల్లోనూ రామవరం గ్రామ ప్రజలు తనకు మెజార్టీ ఇచ్చారని డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రామవరం అభివృద్ధికి తన వంతు సహకారం అందించామని, వివిధ నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో స్థానిక వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల కృషి అభినందనీయమన్నారు. 2024 ఎన్నికల అనంతరం గ్రామంలో వైయస్ఆర్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడులు, వ్యక్తులపై భౌతిక దాడులు, ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మనోధైర్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరు కావడం చూస్తుంటే రామవరం ప్రజల మద్దతు వైయస్ఆర్‌సీపీ వైపే ఉంటుందన్న నమ్మకం కలుగుతోందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఊహాగానాలకు తావు లేదు: పార్టీ నాయకులు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సత్తి సుబ్బిరెడ్డి, అనపర్తి మండల పార్టీ కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ రామవరం గ్రామంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తామని, ఊహాగానాలు, అసత్య ప్రచారాలకు తావులేదన్నారు. ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తల మనోబలమే తమకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. పదవీకాలం పూర్తి చేసిన పాలకమండలి సభ్యులకు సన్మానం 2021 ఎన్నికల్లో రామవరం గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులుగా ఎన్నికై, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పదవీకాలాన్ని పూర్తి చేసి వైయస్ఆర్‌సీపీలోనే కొనసాగిన నల్లమిల్లి సంధ్య వెంకటరెడ్డి, సత్తి గంగాయమ్మ అమ్మిరెడ్డి, చింతా బుల్లెమ్మాయి, తాడేలు వెంకన్న, నల్లమిల్లి పద్మావతి వెంకటరెడ్డి, సబ్బెళ్ల కృష్ణారెడ్డిలను డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు ఘనంగా సత్కరించారు. పదవీకాలం పూర్తి చేసుకుని ఇటీవల మృతి చెందిన కర్రి రామచంద్రారెడ్డి తరఫున ఆయన కుమారుడు కర్రి భీమారెడ్డిని కూడా సన్మానించారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ వివిధ కమిటీల్లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డులను డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆదాడి చిన సత్యనారాయణ, పార్టీ సీనియర్ నాయకులు నల్లమిల్లి చినసత్తిరెడ్డి, సత్తి సూరారెడ్డి, మాజీ ఎంపీటీసీ కొండేటి భీమేశ్వరస్వామి, కోనాల రామకృష్ణారెడ్డి, గుడిమెట్ల వెంకటరెడ్డి, టేకి వీరరాఘవ, మురమళ్ల వెంకటరామ అప్పారావు, లంక పెద్ద సత్యనారాయణ, లంక నాగేంద్ర, గుత్తుల సూర్యచంద్రావతి తదితరులు పాల్గొన్నారు.