తాడేపల్లి: సృష్టి నిర్మాణంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర వెలకట్టలేనిదని, వారి కళానైపుణ్యాన్ని గుర్తించి సమాజంలో సముచిత గౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక భరోసా కల్పించిన ఘనత దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిలదేనని వైయస్ఆర్‌సీపీ విశ్వబ్రాహ్మణ నాయకులు పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం విశ్వబ్రాహ్మణుల సంక్షేమం, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను నాయకులు గుర్తుచేశారు. కళాకారులకు అండగా నిలవాలి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. శ్రీ విరాట్ విశ్వకర్మ మహారాజు ఆశీస్సులు సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో వృత్తి కళాకారులకు పెద్దపీట వేశామని, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వృత్తి కళాకారులు, శ్రామికులు సంతోషంగా జీవించేలా అనేక కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. “ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రాధాన్యతనిస్తూ సాంప్రదాయ వృత్తి కళాకారులు, నైపుణ్యం కలిగిన వ్యక్తులను విస్మరిస్తోంది. విశ్వబ్రాహ్మణుల అత్యంత విశిష్టమైన కళా నైపుణ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఆ నైపుణ్యాలు మరింతగా రాణించేందుకు ప్రభుత్వాలు ఆర్థిక, వాణిజ్య సహకారం అందించాలి” అని సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్.ఎం. పవిత్ర మాట్లాడుతూ.. విశ్వకర్మ జయంతి కేవలం వేడుక కాదని, తమ మూలాలను, ఘనమైన చరిత్రను స్మరించుకుని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునే రోజని తెలిపారు. “విశ్వకర్మ భగవానుని నుంచి ఉద్భవించిన పంచ ఋషుల పరంపరతో కొనసాగుతున్న పంచవృత్తులు లేకపోతే ఇల్లు, నాగలి, ఆభరణాలు, రవాణా, దేవాలయాలు వంటి నిర్మాణాలు సాధ్యం కావు. సాధారణ వస్తువుకు కూడా అందం, నాణ్యత, విలువను తీసుకురావడం విశ్వబ్రాహ్మణుల కళానైపుణ్యం” అని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విశ్వబ్రాహ్మణ పేద కుటుంబాల పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లుగా ఎదిగే అవకాశం లభించిందని తెలిపారు. “వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సమాజానికి రాజకీయ గుర్తింపు కల్పించారు. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో అందించిన రూ.2.57 లక్షల కోట్ల డీబీటీ సంక్షేమ పథకాల్లో దాదాపు రూ.140 కోట్లు విశ్వబ్రాహ్మణులకు నేరుగా అందాయి. విశ్వబ్రాహ్మణుల హక్కుల సాధనకు, భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాలి” అని ఎస్.ఎం. పవిత్ర తెలిపారు. జీవో నెం.24తో అధికారిక రాష్ట్ర పండుగ వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.డి. మురళీకృష్ణ మాట్లాడుతూ.. వైయస్ఆర్, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవం, గుర్తింపు పెరిగాయని తెలిపారు. “మొట్టమొదటిసారిగా విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆత్మగౌరవాన్ని పెంచింది దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలకమండలిలో స్థానం కల్పించింది వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఎనిమిది మంది విశ్వబ్రాహ్మణులను డైరెక్టర్లుగా నియమించారు. దేవాలయ పాలక మండళ్లు, స్థానిక సంస్థల్లోనూ సముచిత గుర్తింపు కల్పించారు” అని తెలిపారు. “2023లో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.24తో విశ్వకర్మ జయంతికి రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తింపు లభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా, మండల స్థాయిల్లో అధికారికంగా వేడుకలు నిర్వహించే అవకాశం ఏర్పడింది” అని ఎస్.డి. మురళీకృష్ణ పేర్కొన్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి సంబంధించిన పలు చర్యలను కూడా ఆయన ప్రస్తావించారు. విజయవాడలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునరుద్ధరణతో పాటు దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం వర్తింపజేయడం, భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపించడం వంటి చర్యలు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్.ఎం. పవిత్ర, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.డి. మురళీకృష్ణ, గ్రీవెన్స్ సెల్ ఇన్‌ఛార్జి ఎ. నారాయణమూర్తి, ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు, తోలేటి శ్రీకాంత్, గురు ఆచారి, ఉదయ్‌కుమార్, ధనుంజయ ఆచారి తదితరులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన విశ్వబ్రాహ్మణ ప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణుల కళా వారసత్వాన్ని కాపాడుతూ, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వాల నుంచి నిరంతర సహకారం అవసరమని నాయకులు పేర్కొన్నారు.