వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షులు, పార్టీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

రాష్ట్రంలో నెల‌కొన్న తీవ్ర క‌రువు ప‌రిస్థితులు, సాగునీరు లేక పంట‌లు ఎండిపోతున్న దుస్థితిపై ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని ఎండ‌గడుతూ వీడియోలో కాన్ఫ‌రెన్సులో నాయ‌కులు ఏం మాట్లాడారంటే....

*ఉషాశ్రీ చరణ్‌, సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు*
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువల లైనింగ్ పనులను నిలిపివేయాలి

సత్యసాయి జిల్లాలో వర్షాభావంతో వేరుశనగ, కంది సహా పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంటల బీమా ప్రీమియం రైతులతో కట్టించుకుని, పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. పశువులకు మేత దొరకని పరిస్థితి నెలకొంది. ట్రాక్టర్ లోడ్ ఎండుగడ్డి రూ.10 వేల నుంచి రూ.30 వేలకు, వేరుశనగ మేత రూ.15 వేల నుంచి రూ.35 వేలకు పెరిగింది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువలకు లైనింగ్, బెడ్ కాంక్రీట్‌తో భూగర్భ జలాల రీచార్జ్‌కు ఆటంకం ఏర్పడి, బోర్లు ఎండిపోయి తాగునీటికీ సత్యసాయి జిల్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, నష్టపోయిన పంటలన్నింటినీ నమోదు చేసి ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి. పశువులను అమ్ముకునే పరిస్థితి రాకుండా పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల పశుసంపదను కాపాడాలి. రైతులకు ఏడు గంటల విద్యుత్ కూడా నిర్దిష్ట సమయానికి అందడం లేదు. యూరియా, డీఏపీ పరిమిత సరఫరా, పురుగుమందుల ధరల పెరుగుదలతో రైతులపై మరింత భారం పడుతోంది. సత్యసాయి జిల్లాలో రైతుల ప్రయోజనాల కోసం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లైనింగ్ పనులను వెంటనే నిలిపివేసి, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

*అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు*
కరువు మండలాలుగా ప్రకటించి ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది సాగు చేసిన 5.90 లక్షల ఎకరాల్లో 5.80 లక్షల ఎకరాల పంటలు పూర్తిగా ఎండిపోయే దశకు చేరాయి. పంటల బీమా కోసం 9.60 లక్షల ఎకరాలకు పైగా నమోదు చేసినా, రైతులే రూ.52 కోట్ల ప్రీమియం చెల్లించారు. గతంలో ప్రభుత్వం భరించిన బీమా ప్రీమియం భారం ఇప్పుడు రైతులపై పడింది. సాధారణ స్థాయి కంటే భూగర్భ జలాలు 5 నుంచి 10 మీటర్ల వరకు పడిపోయాయి. బోర్లు ఎండిపోవడంతో ఇప్పటికే అనంతపురం జిల్లాలో వలసలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి అనంతపురంలో సుమారు 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. చీనీ 90 వేల నుంచి లక్ష ఎకరాలు, అరటి 40 వేల ఎకరాలకు పైగా, మామిడి సుమారు 40 వేల ఎకరాలు, టమాటా దాదాపు 50 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. బోర్లు ఎండిపోవడంతో చీనీ తోటలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. పలువురు రైతులు చీనీ చెట్లను తొలగించే పరిస్థితికి చేరుకున్నారు. మరో 15 రోజులు నుంచి నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం తప్పదు. శ్రీశైలం నుంచి సాధారణంగా 30 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ఈ ఏడాది 16 టీఎంసీలకే పరిమితమైంది. హంద్రీ-నీవాకు గత ఏడాది 53 టీఎంసీలకు పైగా నీరు వచ్చినా, ఈ ఏడాది నీటి విడుదలలో సరైన ప్రణాళిక కనిపించడం లేదు. కాలువల ఆధునీకరణ, లైనింగ్ కోసం రూ.3,850 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నా, వాస్తవంగా కాలువల ద్వారా అందుతున్న నీటిపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. నీటి విడుదలలో సమగ్ర ప్రణాళిక అవసరం. 2024 నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 200 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయని స్థానికంగా ప్రస్తావన వచ్చింది. ప్రకటించిన పరిహారం కూడా ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు అందలేదని రైతుల వాదన. పశువులకు మేత కొరత తీవ్రంగా మారింది. గతంలో రూ.130–180కు లభించిన యంత్రాలతో కట్టే గడ్డి కట్ట ఇప్పుడు రూ.300 వరకు చేరింది. మేత ఖర్చులు పెరగడంతో పాల ఉత్పత్తి కూడా ఒక్క నెలలో సుమారు 30 శాతం తగ్గింది. సింగనమల, తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో భూగర్భ జలాలు తీవ్రంగా తగ్గిపోయి తాగునీటి సమస్య కూడా ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయ విత్తనాలు ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు రైతులకు అందలేదు. సెప్టెంబర్ వర్షాలను ఉపయోగించుకునే సమయంలో విత్తనాలు అందకపోతే వాటి ప్రయోజనం రైతులకు దక్కదు. అనంతపురం జిల్లాలో సాధారణ సగటు వర్షపాతం సుమారు 230 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సుమారు 123 మిల్లీమీటర్లకే పరిమితమైంది. కరువు పరిస్థితులను గుర్తించి అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి పంటల నమోదు, ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారం అందించాల్సిన అవసరం ఉంది.

*బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు*
ప్రకాశం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

ప్రకాశం జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గత ఏడాదితో పోలిస్తే వర్షపాతం సుమారు 75 నుంచి 85 శాతం వరకు తగ్గిపోయింది. సాగునీరు, తాగునీరు తీవ్రంగా తగ్గిపోవడంతో ఈ ఏడాది రైతులు పంటల సాగును భారీగా తగ్గించారు. గత ఏడాది సుమారు 18 వేల హెక్టార్లలో సాగైన పంట ఈ ఏడాది కేవలం 3 వేల హెక్టార్లకు పరిమితమైంది. మరో పంట గత ఏడాది సుమారు 25 వేల హెక్టార్లలో సాగైతే ఈ ఏడాది కేవలం 2,500 హెక్టార్లకే పడిపోయింది. సాగర్ నీరు అందకపోవడం, వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. తాగునీటికి కూడా పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గతంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతో రైతులు ఉద్యాన పంటల సాగును పెంచుకున్నారు. 2020 నుంచి ప్రకాశం జిల్లాలో ఎంపికైన సుమారు 70 మంది రైతులకు దాదాపు రూ.13 కోట్ల మేర ప్రోత్సాహకాలు అందాయి. పంటల బీమా విషయంలోనూ రైతులకు న్యాయం జరగడం లేదు. గతంలో 45 రోజుల్లోనే బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉండగా, ఇప్పుడు బీమా కంపెనీ నుంచి ప్రభుత్వం వద్దకు నిధులు వచ్చినా రైతులకు పరిహారం అందడం లేదు. వర్షాభావం, సాగునీటి కొరత, భూగర్భ జలాల తగ్గుదలతో ప్రకాశం జిల్లా రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. పంటల సాగు విస్తీర్ణం భారీగా పడిపోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ప్రకాశం జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి, పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారం అందించాలి. ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి.

*కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు*
రైతన్నలకు బీమాతో సంబంధం లేకుండా పరిహారం ఇవ్వాలి

నంద్యాల జిల్లాలోని 29 మండలాల్లో వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయి. మొక్కజొన్న, ఉల్లి, చెరకు సహా పలు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గోర‌క‌ల్లు రిజర్వాయర్‌లో నీరు ఉన్నా రైతుల పంటలకు విడుదల చేయని పరిస్థితి కొనసాగుతోంది. నీటి కోసం ఆందోళనలకు దిగినా రిజర్వాయర్‌ వద్దకు వెళ్లేందుకు కూడా అనుమతించని పరిస్థితి నెలకొంది. పంట కోసం రూ.11 లక్షలు ఖర్చు చేసిన రైతుకు కనీసం రూ.11 వేల ఆదాయం కూడా రాని దుస్థితి వచ్చింది. పెట్టుబడులు మొత్తం నీటిపాలై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రైతులు బీమా ప్రీమియం చెల్లించకుండానే పంట నష్టపరిహారం పొందిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు పంటలు ఎండిపోతున్నా రైతులకు పరిహారం అందడం లేదు. రైతులకు జరిగిన పంట నష్టాన్ని వెంటనే నమోదు చేసి, బీమాతో సంబంధం లేకుండా పంట నష్టపరిహారం అందించాలి. రైతులకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ రైతుల తరఫున పోరాటం కొనసాగించాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లింది. మోటార్లు ఏర్పాటు చేసి నీటిని అందించే దిశగా పనులు జరిగినా, ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమకు నీటి భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. గోర్కల్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో పాటు గ్రామాల్లో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి. పలు గ్రామాల్లో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సొంతంగా ట్యాంకర్లు, ట్రాక్టర్ల ద్వారా నీటిని అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలులో ఏసీ కెనాల్‌కు నీరు అందక గణేశ్‌ నిమజ్జనానికి కూడా నీటి కొరత ఏర్పడింది. చివరకు డ్రైనేజీ నీటిలో నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి రావడం నీటి నిర్వహణ వైఫల్యానికి నిదర్శనం. రైతులకు గిట్టుబాటు ధర, పంట నష్టపరిహారం, సాగునీరు, తాగునీరు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. నంద్యాల జిల్లాలో కరువు పరిస్థితులను గుర్తించి రైతాంగాన్ని ఆదుకోవాలి.

*కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు*
సాగునీటి నిర్వహణ లోపంతో వరి రైతులకు రూ.1,500 కోట్ల నష్టం

నెల్లూరు జిల్లాలో ఆలస్య ఖరీఫ్‌ సాగు అక్టోబర్‌–నవంబర్‌లో ప్రారంభమవుతుందని తెలిసినా, 146 టీఎంసీల సామర్థ్యం ఉన్న కండలేరు జలాశయం నుంచి ఏప్రిల్‌లోనే ఎడగారుకు నీటిని విడుదల చేశారు. రైతులతో సంప్రదింపులు లేకుండా, జిల్లా అధికారులతో సమీక్ష లేకుండా నీటి విడుదల చేపట్టడంతో మొదటి పంటకు సాగునీటి భద్రత దెబ్బతింది. 5.20 లక్షల ఎకరాల మొదటి పంటతో పోలిస్తే ఎడగారు సాగు కేవలం 1.80 లక్షల ఎకరాలకే పరిమితం. ఎడగారుకు సుమారు 64 టీఎంసీల నీటిని వినియోగించినా, కండలేరు ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ చివరి ప్రాంతాల్లో 10–12 వేల ఎకరాలు ఎండిపోయాయి. నెల్లూరు జిల్లాలో ప్రధాన పంట వరి. నీటి కొరతతో ఈ సీజన్‌లో రైతులకు సుమారు రూ.1,500 కోట్ల మేర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. జలాశయాల్లో నిల్వలు వేగంగా తగ్గిపోవడంతో తాగునీటికి కూడా ముప్పు ఏర్పడుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా ప్రారంభమైంది. జిల్లాలో సుమారు 44 వేల హెక్టార్లు అంటే 1.10 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. నిమ్మ, మామిడి, కూరగాయలు, పండ్ల తోటలు ప్రధానంగా ఉన్నాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్ల కింద ఉన్న ఉద్యాన పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి. నిమ్మకు మార్కెట్‌లో మంచి ధర ఉన్నా, వర్షాభావంతో పూత రాలిపోవడంతో రైతులకు పంట చేతికందడం లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉద్యాన పంటలు ఎండిపోతున్నాయి. శ్రీశైలం నుంచి నెల్లూరు వైపు నీటి విడుదల లేకపోవడంతో రైతుల సాగునీటి సమస్య మరింత తీవ్రమైంది. నెల్లూరు బ్యారేజీ వద్ద రైతులతో కలిసి నీటి కోసం ఆందోళన చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై పోలీసు కేసులు పెట్టిన పరిస్థితి నెలకొంది. సాగునీరు అందని కాలువలకు నిర్వహణ పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా, రైతులకు నీరు అందడం లేదు. పనులు లేకుండానే బిల్లులు చెల్లించే విధానానికి అడ్డుకట్ట వేయాలి. వర్షపాతం సాధారణ స్థాయిలో ఉండాల్సిన దానికంటే దాదాపు 40 శాతం లోపే నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కంటింజెన్సీ ప్రణాళిక అమలు చేయాలి. పరిస్థితి మరింత దిగజారే వరకు వేచి చూసే ధోరణి విడనాడాలి. పశుగ్రాసం కొరతతో రైతులు పశువులను అమ్ముకుని వలస వెళ్లే పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణమే పశుగ్రాసం, తాగునీరు, సాగునీటి ఏర్పాట్లు చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే నీటి కొరత సమయంలో నెల్లూరు సహా రాయలసీమ ప్రాంత రైతులకు నీటి భద్రతకు అదనపు అవకాశం ఉంటుంది. ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రైతులకు పంట పండితే గిట్టుబాటు ధర, పంట దెబ్బతింటే ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట నష్టపోతే పరిహారం అందేలా సమగ్ర రైతు రక్షణ చర్యలు చేపట్టాలి. నెల్లూరు జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ కార్యాచరణ ప్రకటించాలి.

*భూమన కరుణాకర్‌రెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు*
పశువులకు మేత అందక గ్రామీణ జీవనం భారంగా మారింది

తిరుపతి జిల్లాలో వర్షాభావంతో వ్యవసాయ, వాణిజ్య, ఉద్యాన పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. రైతుల చేతుల్లో పంటలు లేక జీవనాధారం దెబ్బతింటోంది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో బోర్లు ఎండిపోతున్నాయి. సాగునీటితో పాటు గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా తీవ్రమవుతోంది. విద్యుత్‌ కొరతతో బోర్లపై ఆధారపడే రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు ఉన్న చోట కూడా పంటలకు అందించే పరిస్థితి లేకుండా పోతోంది. పశువులకు మేత, నీరు అందడం లేదు. ఫలితంగా రైతులు తమ పశువులను అమ్ముకునే దుస్థితికి చేరుకున్నారు. తిరుపతి వంటి ప్రధాన నగరానికి తాగునీరు అందించే పాపవినాశనం జలాశయంలోనూ నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. తాగునీటి భద్రతపై ఆందోళన పెరుగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో సాగునీటి పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. పంటలు పండకపోవడం, పశుగ్రాసం కొరత, తాగునీటి సమస్యలతో గ్రామీణ కుటుంబాల జీవనం భారంగా మారుతోంది. కరువు ప్రభావం వ్యవసాయంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా పడుతోంది. ఇదే పరిస్థితి మరో నెల, నెలన్నర కొనసాగితే పంటలు, పశుసంపద, తాగునీటి సమస్యలు మరింత తీవ్రం కానున్నాయి. ప్రజలకు తక్షణ ఉపశమన చర్యలు అవసరం.

*పేర్ని నాని, కృష్ణా జిల్లా అధ్యక్షుడు*
కృష్ణా డెల్టాలో సాగునీరు అందక లక్షలాది ఎకరాల్లో నాట్లు పడని దుస్థితి

కృష్ణా డెల్టాలో సుమారు 6 లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం దాదాపు 50–55 వేల ఎకరాల్లో ఇప్పటికీ సాగు ప్రారంభం కాలేదని పేర్ని నాని పేర్కొన్నారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, తోట్లవల్లూరు, మచిలీపట్నం నార్త్‌ ప్రాంతాల్లో సుమారు 90 శాతం వరకు సాగు జరగలేదని తెలిపారు. మచిలీపట్నం సౌత్‌లోనూ దాదాపు 40 శాతం భూములు సాగుకు దూరంగా ఉన్నాయని చెప్పారు. గూడూరు, పెడన, బంటుమిల్లి, కృతివెన్ను ప్రాంతాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో సాగు ప్రారంభం కాలేదని, గుడివాడ రూరల్‌, గుడ్లవల్లేరు ప్రాంతాల్లోనూ వందల ఎకరాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మొక్కలు నాటాల్సిన సమయంలో నీరు అందకపోవడంతో రైతులు పంట సాగు చేయలేకపోతున్నారు. సాగు ఆలస్యం కావడం వల్ల రైతుల పెట్టుబడులు, పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పులిచింతలలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కృష్ణా డెల్టాకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి లభ్యతపై స్పష్టత లేకపోవడం రైతులకు మరింత ఇబ్బందిగా మారింది. ఇప్పటికే సాగు చేసిన ప్రాంతాల్లోనూ పంటకు అవసరమైన సమయంలో నీరు అందుతుందా లేదా అనే అనిశ్చితి రైతులను వెంటాడుతోంది. మధ్యలో నీరు నిలిచిపోతే ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఉంది. కృష్ణా డెల్టాలోని అనేక ప్రాంతాల్లో పొలాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. నీటి కోసం రైతులు ఎదురుచూస్తుండటంతో సాగు పనులు ముందుకు సాగడం లేదు. నీటి సమస్య కారణంగా రైతులే కాకుండా వ్యవసాయ కూలీలు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలపై ఆధారపడే గ్రామీణ కుటుంబాల ఉపాధిపైనా ప్రభావం పడుతోంది. కృష్ణా డెల్టాలో ఎక్కడెక్కడ సాగు జరగలేదో క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.

*అంబటి రాంబాబు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు*
వేసిన కొద్దిపాటి పంటలకు కూడా ఎరువులు బ్లాక్ లో కొనాల్సి వస్తోంది

గుంటూరు జిల్లాలో కృష్ణా కెనాల్, కొమ్మూరు కాలువ, నాగార్జునసాగర్ రైట్ కెనాల్ ద్వారా సుమారు 25 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, సాగునీరు సరిగా అందకపోవడం వల్ల కేవలం 20 శాతం మాత్రమే నాట్లు, పంటలు వేసిన పరిస్థితి ఉంది. కొమ్మూరు కాలువ, నాగార్జునసాగర్ నుంచి సకాలంలో నీరు రాకపోవడంతో రైతులు పంటలు వేసుకోలేకపోతున్నారు. ఇప్పటికే వేసిన 20 శాతం పంటకు కూడా ప్రభుత్వం సరిపడా ఎరువులు అందించలేకపోతోంది. ఎరువులను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. గతంలో రూ.1,350గా ఉన్న ఎరువుల బస్తాను ప్రస్తుతం సుమారు రూ.2,200 వరకు పెట్టి రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఇంత తీవ్రమైన వర్షాభావ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని రైతులు భావిస్తున్నారు. రాయలసీమలో కరువు ఉన్నప్పటికీ గతంలో కృష్ణా డెల్టాకు కొంతమేర సాగునీరు అందేది. ప్రస్తుతం సాగునీరు అందించడంలో, పంటలకు ఎరువులు సరఫరా చేయడంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శ. వేసిన పంటకే ఎరువులు అందించలేని పరిస్థితి ఉంటే, మొత్తం విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

*రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు*
కడపలో 52.9% లోటు వర్షపాతం

కడప జిల్లాలో మొత్తం 40 మండలాలకు గాను కేవలం 26 మండలాల్లో మాత్రమే స్వల్ప వర్షాలు పడగా, ప్రస్తుతం జిల్లాలో 52.9% లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్‌లో సాధారణంగా ఉండాల్సిన సాగు విస్తీర్ణంలో కనీసం 50 శాతం కూడా ఇప్పటివరకు నమోదు కాని దుస్థితి నెలకొంది. జిల్లాలో సగభాగం ఆయకట్టు ఉన్న కేసీ కెనాల్‌కు ఇప్పటివరకు నీటిని విడుదల చేయకపోవడంతో సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గోర్ల కింద కంది 2,155 హెక్టార్లు, కాటన్ 9,279 హెక్టార్లు, మరియు వేరుశెనగ 3,613 హెక్టార్లు మాత్రమే సాగయ్యాయి. వేంపల్లి మండలంలోని అమ్మగారిపల్లె, వీరకొండపల్లె, కర్తూరు తదితర ప్రాంతాల్లో సాగు చేసిన వేరుశెనగ తదితర పంటలు నీరులేక పూర్తిగా ఎండిపోయే దశకు చేరాయి. జిల్లాలో ఇంతటి దారుణ పరిస్థితులు ఉన్నప్పటికీ, కలెక్టర్ గానీ సంబంధిత మంత్రులు గానీ ఇప్పటివరకు కనీస సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించలేదు. రాష్ట్రంలోనే అత్యధిక లోటు వర్షపాతం ఉన్న ఈ జిల్లాలోని 40 మండలాలను తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కమిటీని పంపేలా చూడటంతో పాటు, రైతులకు తక్షణమే పంట ఇన్సూరెన్స్ అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. అక్టోబర్ వరకు వేచి చూడకుండా, దీనిని ఎమర్జెన్సీ పరిస్థితిగా పరిగణించి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి.

*చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు*
క్షామం అంటే చంద్రబాబు పాలన, క్షేమం అంటే రాజశేఖరరెడ్డి కుటుంబ పాలన

తూర్పు గోదావరి జిల్లాలో వర్షాభావం వల్ల నర్సరీ రైతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నర్సరీలకు సంబంధించిన షేర్లు తగ్గిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులపై అన్ని జిల్లాల్లో ఉన్న స్థితిగతులను ఈ మొద్దునిద్రలో ఉన్న ప్రభుత్వానికి వివరించాలనే ఉద్దేశంతో మీరు తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు గొప్ప ఊరటనిచ్చే అంశం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడే కరువు ఎందుకు వస్తుంది అనేది ప్రజలు గమనించాల్సిన విషయం. ఆయన పాలనలో వర్షపాతం లోటు పెరుగుతూ వస్తోంది. ఆయన పరిపాలనలో ప్రకృతికి కూడా అనుకూల పరిస్థితులు లేవనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాజశేఖర్‌రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదైంది. ఆయన రైతుల కోసం కృషి చేసిన సమయంలో ప్రకృతి కూడా అనుకూలంగా ఉండేదనే భావన ప్రజల్లో ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి గారి పాలనలో కూడా అధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన విషయం క్షామం, క్షేమం మధ్య ఉన్న తేడా. క్షేమం అంటే రాజశేఖర్‌రెడ్డి గారి కుటుంబం, జగన్‌మోహన్‌రెడ్డి గారి పాలన; క్షామం అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన అని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రకృతిని మోసం చేయడం సాధ్యం కాదు. ప్రజలను మోసం చేయవచ్చు కానీ భగవంతుడిని, ప్రకృతిని మోసం చేయలేరు. ఈ కరువు పరిస్థితులు అందుకు ఒక ఉదాహరణగా ప్రజలు భావిస్తున్నారు. రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలవాలి. రైతులకు భరోసా కల్పించేలా పార్టీ తరఫున కార్యాచరణ ఉండాలి. కరువు సమయంలో కూడా ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకుండా, సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని లాభాలు పొందే విధంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ప్రజల్లో ఉన్నాయి. ఈ అంశాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. రైతులపై కేసులు పెట్టడం కాకుండా, వారి సమస్యలను పరిష్కరించే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి.

*ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు*
గణేష్ నిమజ్జనానికి కూడా నీరు లేక డ్రైనీజు నీటిని వాడే దుస్థితి

కర్నూలు జిల్లాలో రైతులకు ఈరోజు వ్యవసాయ పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామాలు ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుంది. రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఉచితంగా పంటల బీమా సౌకర్యం కల్పించాం. ఇప్పుడు బ్యాంకుల్లో, ముఖ్యంగా కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే బీమా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆ బీమా సొమ్మును కూడా విడుదల చేయడం లేదు. కర్నూలు జిల్లాలో కరువు పరిస్థితి తీవ్రంగా ఉంది. పశువులకు మేత లేక రైతులు వాటిని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పశువులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి రావడంతో రైతులు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మన జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నా, ఈ కరువు పరిస్థితిపై గానీ, సాగునీటి సమస్యపై గానీ ఒక్కరోజు కూడా సమీక్ష సమావేశం నిర్వహించలేదు. జిల్లా మంత్రికి కూడా కరువు, సాగునీరు, వ్యవసాయ సమస్యలపై సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కర్నూలులో గణేష్ నిమజ్జనం కూడా నీటి కొరత వల్ల సమస్యగా మారింది. రాష్ట్రంలోనే భారీగా గణేష్ నిమజ్జనం జరిగే జిల్లాల్లో కర్నూలు ఒకటి. అలాంటి కర్నూలులో నిమజ్జనానికి కూడా నీరు అందుబాటులో లేకపోవడం చాలా దురదృష్టకరం. కర్నూలు జిల్లాలో కరువు, సాగునీరు, వ్యవసాయం, తాగునీటి సమస్యలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి.

*పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు*
రెండున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్ట్ పనైనా ముందుకు తీసుకెళ్లలేదు

ఈ సంవత్సరం వర్షాలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 70 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. ప్రకాశం రైట్ కెనాల్ ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రతి సంవత్సరం జూలై 15 నుంచి ఆగస్టు వరకు నీళ్లు వదిలేవారు. కానీ ఈ సంవత్సరం పంట కాలంలో ఒక్క చుక్క నీరు కూడా వదలకుండా ప్రభుత్వం రైతులను మోసం చేసింది. విత్తనం కొనుగోలు చేసే దగ్గర నుంచి పంట పండించే వరకు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, వర్షాల వల్ల పంట నష్టపోతే రైతులను ఆదుకోవడం వరకు గతంలో అన్ని విషయాలను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం. ఇప్పుడు రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా కనీసం ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు రైతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ప్రాజెక్టుల విషయంలో కూడా ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో ప్రాజెక్టు పనులను ఒక్క ఇంచ్ కూడా ముందుకు తీసుకెళ్లలేదు. రైతులు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఒక కుటుంబ పెద్దలా ప్రతి రైతు ఏ పంట వేస్తున్నాడు, అతనికి గిట్టుబాటు ధర ఎలా కల్పించాలి, ఎరువులు, విత్తనాలు ఎలా అందించాలి అనే విషయాలను ప్రభుత్వం పట్టించుకునేది. ఇప్పుడు అధికారులు కూడా రైతుల సమస్యలపై స్పందించే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ కార్యకర్తలపై కేసులు పెట్టడం, పోలీసులతో ఇబ్బందులు పెట్టడం మీదే ప్రభుత్వం దృష్టి పెట్టింది. రైతులు ఏం చేయాలి, వాళ్ల పంటలు ఎలా కాపాడాలి, నీళ్లు ఎలా అందించాలి అనే దానిపై మాత్రం ప్రభుత్వం ఆలోచించడం లేదు. గత సంవత్సరం దాదాపు లక్ష హెక్టార్లలో పంటలు సాగు చేస్తే, ఈ సంవత్సరం 40 నుంచి 50 శాతం కూడా సాగు జరగని పరిస్థితి ఉంది. ఇప్పుడే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముందుముందు ఇంకా భయంకరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. రైతులను ముందుగానే ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఏ కార్యక్రమం ఇచ్చినా, మీ ఆదేశాల మేరకు మేము ప్రజల్లోకి, రైతుల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకు భరోసా, ధైర్యం కల్పించాలి. రైతులకు న్యాయం జరిగే వరకు జిల్లా నుంచి మనమందరం కలిసి మీరు ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.

*దూలం నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు*
సాగునీరు అందక వేలాది ఎకరాల్లో నాట్లు వేయలేదు

దెందులూరు, చింతలపూడి, పోలవరం ప్రాంతాల్లో వర్షాభావం, చెరువులు నిండకపోవడం, కాలువలకు నీరు రాకపోవడం వల్ల వ్యవసాయం దెబ్బతింది. చాలా పొలాలు ఖాళీగా ఉన్నాయి. రైతులు నాట్లు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కైకలూరు ప్రాంతంలో సీడ్ ఫార్మ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సీడ్ ఫార్మ్స్ నుంచి విత్తనాలను ఇతర రాష్ట్రాలకు కూడా పంపిస్తాం. కానీ కాలువలకు నీరు అందకపోవడంతో సీడ్ ఫార్మ్స్ కూడా దెబ్బతిన్నాయి. దాదాపు 30 వేల ఎకరాల సాగులో 5 నుంచి 6 వేల ఎకరాల వరకు నష్టం జరిగింది. రైతులు ముందుగా విత్తనాలు వేసి, నాట్లు ప్రారంభించిన తర్వాత నీళ్లు ఇస్తామని చెప్పి చివరికి నీరు అందించకపోవడంతో రైతులు నష్టపోయారు. దెందులూరు, పోలవరం, చింతలపూడి ప్రాంతాల్లో దాదాపు 40 వేల ఎకరాల వరకు రైతులు అసలు నాట్లు వేయలేదు. నీళ్లు లేక, వర్షాలు లేక రైతులు వ్యవసాయం చేయలేకపోతున్నారు. ఇది ఏలూరు జిల్లాలోని రైతుల పరిస్థితి. ఉంగుటూరు ప్రాంతంలో గోదావరి వరదల వల్ల కొంత ప్రాంతానికి నీరు అందింది. అక్కడ ఆక్వా సాగు, కొంత వ్యవసాయం ఉండటంతో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. కానీ మిగతా ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ మనమే చెల్లించి, రైతులకు బీమా ప్రయోజనం అందించాం. పంట నష్టపోయినప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందించాం. ఇప్పుడు ఇబ్బంది పడుతున్న రైతులకు ఆ సహాయం అందడం లేదు. రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి అధికారుల దగ్గరకు వెళ్తే సరైన సమాధానం కూడా చెప్పడం లేదు. పంటలు నష్టపోతున్న రైతులను ప్రభుత్వం వెంటనే గుర్తించి, వారికి క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు అవసరమైన సహాయం అందించాలి. ఏలూరు జిల్లాలో రైతుల పరిస్థితిని ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలి.

*ముదునూరి ప్రసాదరాజు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు*
ఆక్వా, పొగాకు రైతులను ప్రభుత్వం రోడ్డున పడేసింది

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా, పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఒకవైపు తమకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఉద్దేశంతో రైతులు కోర్టును ఆశ్రయించారు. రైతుల తరఫున మన పార్టీ కూడా కోర్టులో కేసు వేసింది. రైతులకు తాత్కాలికంగా కొంత ఉపశమనం కల్పించినప్పటికీ, సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ఆక్వా రైతులకు సంబంధించిన ప్రధాన సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల గోదావరి వరదలు రావడం వల్ల ప్రస్తుతం పశ్చిమ, తూర్పు గోదావరి ప్రాంతాల్లో కొంతవరకు నీటి ఇబ్బంది తగ్గింది. ప్రస్తుతానికి పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, ఇది తాత్కాలిక ఉపశమనమే. ఎరువుల కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా యూరియా, అమోనియం వంటి ఎరువులు మార్కెట్‌లో ఎక్కడా సరిగా దొరకడం లేదు. గ్రామాల్లో రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరువు పరిస్థితులను కారణంగా చూపిస్తూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. కానీ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అంశాన్ని కూడా మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. సామాన్య ప్రజలపై పడుతున్న భారాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. ఆక్వా, పొగాకు రైతులతో పాటు సాధారణ రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు, ఎరువులు, పంటలకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి. రైతుల సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఆక్వా, పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు మన పార్టీ తరఫున పోరాటం కొనసాగించాలి. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది.

*చిర్ల జగ్గిరెడ్డి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు*
యూరియా కొరత తీవ్రంగా ఉంది

మా నియోజకవర్గానికి మంత్రి గారు వచ్చి వెళ్లిపోతున్నారు కానీ అభివృద్ధి పనులు సక్రమంగా జరగడం లేదు. కాలువలు మూసివేసిన సమయంలో చేయాల్సిన పనులను ఇప్పుడు కాలువల్లో నీళ్లు ఉన్న సమయంలో చేస్తున్నారు. దీంతో రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మా ప్రాంతంలో యూరియా ఎరువుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. చిన్న రైతులు 20, 40, 50 సెంట్లలో వ్యవసాయం చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది కౌలు రైతులే. యూరియా కోసం అడిగినా అవసరమైనంత ఎరువు దొరకడం లేదు. చిన్న రైతులకు కూడా తగినంత యూరియా అందేలా చూడాలి. మా ప్రాంతంలో కొబ్బరి తోటల్లో కంద, కోకో వంటి అంతర పంటలు కూడా సాగు చేస్తారు. కానీ ఒక యాప్‌లో నమోదైన ఒక పంటకు మాత్రమే యూరియా ఇస్తామని, మిగిలిన పంటలకు ఇవ్వమని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చిన్న రైతులు, అంతర పంటలు సాగు చేసే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పాడి రైతులకు కూడా యూరియా అవసరం ఉంటుంది. పశువులకు అవసరమైన పచ్చిమేతను పెంచడానికి రైతులు ఎరువులు ఉపయోగించాలి. కానీ యూరియా కొరత వల్ల మా ప్రాంతంలో పచ్చిమేత ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. డీఏపీ కూడా అవసరమైనంత ఇవ్వకుండా పరిమితంగా ఇస్తున్నారు. గతంలో రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ మన ప్రభుత్వమే చేయించేది. ఇప్పుడు ప్రభుత్వం రైతులే క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని చెబుతున్నప్పటికీ, చాలా తక్కువ మంది మాత్రమే బీమా చేయించుకునే పరిస్థితి ఉంది. పంట నష్టపోయినప్పుడు రైతులకు రక్షణ ఉండేలా క్రాప్ ఇన్సూరెన్స్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి. అప్పుల బాధతో మా ప్రాంతంలో కొంతమంది రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబాలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. ప్రభుత్వం రైతుల అప్పులు, పంట నష్టాలు, ఆర్థిక సమస్యలపై స్పందించి వారికి అవసరమైన సహాయం అందించాలి. కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేయాలి. కరువు మండలాలుగా ప్రకటిస్తే రైతుల రుణాల రీషెడ్యూల్‌కు అవకాశం ఉంటుంది. మా ప్రాంతంలో విద్యుత్ సరఫరా సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఆక్వా రైతులు ఫీడ్ ఖర్చులు, సాగు ఖర్చులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

*దాడిశెట్టి రాజా, కాకినాడ జిల్లా అధ్యక్షుడు*
తాండవ రిజర్వాయర్ కింద పంటలు వేయించి, నీరు ఇవ్వలేదు

ప్రస్తుతం కాకినాడ జిల్లాలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాండవ రిజర్వాయర్‌లో ప్రభుత్వం రైతులను ప్రోత్సహించి పంటలు వేయించింది. కానీ పంట వేసిన తర్వాత అవసరమైన నీటిని ఇవ్వకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రైతులను ముందుగా పంటలు వేయమని ప్రోత్సహించి, ఆ తర్వాత నీరు ఇవ్వకపోవడం వల్ల రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దాండవ రిజర్వాయర్ ప్రాంతంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గోదావరిలో నీళ్లు ఉన్న సమయంలోనే రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. నీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించకపోవడం వల్ల రైతులకు సమస్యలు వస్తున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు గోదావరిలో నీరు లేకపోయినా ప్రత్యామ్నాయ నీటి వనరుల ద్వారా నీటిని అందించాం. అవసరమైతే విద్యుత్ ఉత్పత్తి కోసం నిల్వ చేసిన నీటిని కూడా ఉపయోగించి జిల్లాలో పంటలను కాపాడిన పరిస్థితి మన ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు నీటి నిర్వహణలో సరైన ప్రణాళిక కనిపించడం లేదు. నీరు ఉన్నప్పుడే రైతులకు అవసరమైన సాగునీటిని అందించి పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం ఆ విషయంలో విఫలమవుతోంది. జిల్లాలో ఉన్న ప్రధాన నీటి వనరులన్నింటి విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రిజర్వాయర్లలో, కాలువల్లో నీటి లభ్యతను రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకుని సాగునీరు అందించాలి. రైతులు పంటలు వేసిన తర్వాత నీటి కోసం ఎదురుచూసే పరిస్థితి రాకుండా ప్రభుత్వం ముందుగానే నీటి విడుదలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలి. నీరు ఉన్నా పంటలు ఎండిపోయే పరిస్థితి రాకుండా రైతుల పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

*దేవినేని అవినాశ్‌, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు*
వేసిన పంటలను కాపాడుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు

ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో ప్రధానంగా మిర్చి, పత్తి, వరి పంటలు సాగు చేస్తారు. సాగునీరు లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు చాలా ప్రాంతాల్లో రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాష్ట్రంలోని రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నా, వారికి అవసరమైన సాగునీరు, ఇతర సహాయం అందడం లేదు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ధైర్యంగా వ్యవసాయం చేసేవారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు, ఇతర కార్యక్రమాలు తీసుకొచ్చి వారికి అండగా నిలిచారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రైతులను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో రైతులు సాగునీరు లేక పంటలు వేయలేక, వేసిన పంటలను కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు కరువు మండలాలను కూడా ప్రకటించలేని పరిస్థితి ఉంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. రైతులను పలకరించి వారి సమస్యలను తెలుసుకునే పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. రైతులకు ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందాలి. రైతుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని సమన్వయకర్తలు, పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో రైతులను కలుస్తున్నారు. రైతుల సమస్యలను తెలుసుకుని వాటిని నాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. రైతుల పక్షాన మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ కార్యాచరణ అప్పగించినా దాన్ని విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో ప్రతి ప్రాంతానికి వెళ్లి రైతులతో కలిసి వారి సమస్యలపై పోరాటం చేస్తాం.

*ధర్మాన కృష్ణదాసు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు*
ఒడిశా నుంచి బ్లాక్‌లో యూరియా కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి

వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల పంటల సాగు ఆలస్యమైంది. ఇప్పటికే వేసిన పంటలకు కూడా సరైన ఎరువులు అందడం లేదు. ఎకరాకు అర బస్తా చొప్పున మాత్రమే ఎరువులు ఇస్తున్న పరిస్థితి ఉంది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు అందించేవాళ్లం. పంట ఇన్సూరెన్స్ కూడా మనమే కట్టేవాళ్లం. అందువల్ల రైతు ఎంతో సుఖంగా, ధైర్యంగా వ్యవసాయం చేసేవాడు. ఇప్పుడు రైతులకు గతంలో ఇచ్చిన గౌరవం, రైతు కోసం ఎంత చేసినా తక్కువే అనే భావన కనిపించడం లేదు. దీనికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని రైతులు పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉంది. ఎరువుల కొరత కూడా తీవ్రంగా ఉంది. చివరకు పక్క రాష్ట్రం ఒడిశా నుంచి ఎరువులు కొనుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో 50 కేజీల ఎరువుల బస్తాపై సుమారు రూ.800 అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. పెద్ద నాయకులే ఎరువులను దాచిపెట్టే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రైతుల సమస్యలపై మనం గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. రైతులకు ఎరువులు, సాగునీరు, పంటల రక్షణ విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో, ప్రజలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ మీరు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారా, తమ ఇబ్బందులు ఎప్పుడు తొలగుతాయా అని శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

*బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం జిల్లా అధ్యక్షుడు*
వర్షాభావం వల్ల వరి సాగు గణనీయంగా తగ్గిపోయింది

విజయనగరం జిల్లాలో వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల సుమారు లక్షకు పైగా ఎకరాల్లో వరి సాగు జరగాల్సి ఉండగా, దాదాపు 80 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. బోర్లు ఉన్న ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల నీళ్లు లేక పంట పండే పరిస్థితి కూడా లేదు. మా జిల్లాలో జొన్న ప్రధానమైన వాణిజ్య పంట. గతంలో మన ప్రభుత్వం జొన్న రైతులకు మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం జొన్న ధరలు తగ్గడం వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. పరపతిపల్లి కాలువ, వడ్డవల స్టాండ్, తోటపల్లి కాలువ వంటి నీటి వనరుల నుంచి ప్రస్తుతం సరిగ్గా నీరు రావడం లేదు. దీంతో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు రైతులకు అందించేవాళ్లం. ఇప్పుడు ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. ఒడిశా రాష్ట్రం నుంచి బ్లాక్‌లో యూరియా తదితర ఎరువులు కొనుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒడిశాలో ఎరువులు దొరుకుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు దొరకడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎకరాకు పరిమితంగా మాత్రమే ఎరువులు ఇస్తున్నారు. కొంతమంది తెలుగుదేశం నాయకులు ఎరువులను బ్లాక్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా రైతుల నుంచి వస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. బియ్యం, పంచదార తదితర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రేషన్ కార్డుల ద్వారా కందిపప్పు వంటి నిత్యావసర సరుకులు అందించేవాళ్లం, ఇప్పుడు అవి కూడా సరిగ్గా అందడం లేదు. రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఎరువుల కొరత, సాగునీటి సమస్యలు, నిత్యావసర ధరల పెరుగుదలపై పార్టీ తరఫున కార్యక్రమాలు చేపట్టాలి. మీరు ఏ కార్యక్రమం సూచించినా, దాన్ని విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.

*కె.కె. రాజు, విశాఖ జిల్లా అధ్యక్షుడు*
విశాఖ నగరంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైవాడ, తాడిపూడి, గంభీరం, మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ల నీటి నిర్వహణపై సరైన శ్రద్ధ పెట్టడం లేదు. గతంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో వర్షాల పరిస్థితిని సమీక్షించి పూడికతీత పనులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవాళ్లం. ఇప్పుడు అవి పట్టించుకోకపోవడంతో విశాఖలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. విశాఖ నగరానికి రోజుకు సుమారు 480 ఎంఎల్డీ నీరు అవసరం కాగా, ప్రస్తుతం 380 నుంచి 390 ఎంఎల్డీ మాత్రమే సరఫరా అవుతోంది. కొన్ని కాలనీల్లో వందలాది కుటుంబాలకు ఒకే ట్యాప్ ద్వారా పరిమిత సమయం మాత్రమే నీరు అందుతున్న పరిస్థితి ఉంది. నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి కోసం ప్రజలు గొడవలు పడుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి కూడా ఏర్పడింది. విశాఖ లాంటి ప్రధాన నగరంలో ప్రజలకు తాగునీరు అందకపోవడం చాలా ఆందోళనకరమైన విషయం. పోలవరం నుంచి విశాఖకు నీరు తీసుకొస్తామని సెప్టెంబర్ 4న పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ప్రచారం చేసిన స్థాయిలో ఇప్పటివరకు విశాఖకు ఒక్క నీటి బొట్టు కూడా అందిన పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై ప్రజలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. విశాఖపట్నంలో ఇంతకుముందెన్నడూ లేనంతగా నీటి సంక్షోభం ఏర్పడింది. మేము ఇప్పటికే ప్రతి వార్డులో ప్రజలను కలిసి సమస్యను తెలుసుకుంటున్నాం. అధికారులను కూడా కలిసి తక్షణ పరిష్కారం కోసం కోరాం. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రజల తరఫున ఉద్యమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. కమిషనరేట్ ముట్టడి వంటి కార్యక్రమాలపై కూడా పార్టీ నాయకులు, సమన్వయకర్తలతో చర్చించాం. విశాఖను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామని, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ నగర ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందని పరిస్థితి ఉంటే అభివృద్ధిపై ప్రజల్లో ప్రశ్నలు వస్తాయి. మీరు ఏ కార్యాచరణ ఇచ్చినా, ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.

*ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా అధ్యక్షుడు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు*
అల్లూరి జిల్లాలో నీరు లేక నార్లు ఎండిపోతున్నాయి

అల్లూరి జిల్లాలో అరకు, పాడేరు నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రధానంగా వరి, ఆదివాసీ పంటలు సాగు చేస్తారు. చాలామంది రైతులు వరి నార్లు వేసుకున్నప్పటికీ, వర్షాలు లేకపోవడంతో వరి నాట్లు వేయలేకపోయారు. వర్షాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నాట్లు వేసే సమయానికి అవసరమైన నీరు అందకపోవడంతో ఇప్పటికే సిద్ధం చేసుకున్న నార్లు కూడా ఉపయోగం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. అల్లూరి జిల్లాలో రాజ్మా ప్రధానమైన పంట. అయితే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు నాణ్యత లేని, పాడైపోయిన రాజ్మా విత్తనాలను పంపిణీ చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తారనే భయంతో అధికారులు సంబంధిత సమావేశాలు నిర్వహించడం లేదనే పరిస్థితి ఉంది. రాజ్మా విత్తనాల విషయంలో ఎమ్మెల్యే, ఎంపీ తదితర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రైతుల తరఫున సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పూయూరు ప్రాంతంలో ప్రధానంగా సాగు చేసే పొగాకు పంట కూడా వర్షాలు లేక తీవ్రంగా దెబ్బతింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పొగాకు రైతులు కూడా నష్టపోతున్నారు. రాజ్మా విత్తనాలకు సంబంధించి సుమారు 4,913 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. అయితే వర్షాలు లేకపోవడంతో రైతులు పెద్దఎత్తున రాజ్మా పంటను సాగు చేయలేకపోయారు. ఎకరాలకు అవసరమైన స్థాయిలో సాగు జరగలేదు. అల్లూరి జిల్లాలో వర్షాభావం వల్ల వరి, రాజ్మా, పొగాకు వంటి పంటలు దెబ్బతింటున్నాయి. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యమైన విత్తనాలు, సాగునీరు, పంట నష్టానికి తగిన పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

*బొడ్డేడ ప్రసాద్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు*
అనకాపల్లి జిల్లాలో మైనస్ 44 శాతం వర్షపాతం

అనకాపల్లి జిల్లాలో వర్షపాతం మైనస్ 44 శాతంగా ఉంది. జిల్లాలో మొత్తం 3,72,000 ఎకరాల సాగుభూమి ఉండగా, లక్షా 40 వేల ఎకరాల్లో వరి, 40 వేల ఎకరాల్లో చెరుకు, సుమారు 2 లక్షల ఎకరాల్లో వాణిజ్య పంటలు సాగు చేస్తారు. వరి, చెరుకు సాగుకు ప్రధానంగా రైవాడ, కోనాం, పెగ్గర్ రిజర్వాయర్లపై ఆధారపడి ఉన్నాం. కోనాం, పెగ్గర్ రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోయాయి. రైవాడ కింద బోర్ల ద్వారా సాగవుతున్న సుమారు 20 వేల ఎకరాల వరి, 8 వేల ఎకరాల చెరుకు కూడా బోర్లు ఎండిపోవడంతో ఇబ్బందుల్లో ఉన్నాయి. జిల్లాలో ఇంత తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. చోడవరంలో జరిగిన జిల్లా పార్టీ సమావేశంలో అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని పార్టీ తరఫున తీర్మానం చేశాం. రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి రీషెడ్యూల్ చేయాలని, పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం లేదా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశాం. రూ.272 ధర ఉన్న యూరియాను బ్లాక్ మార్కెట్‌లో రూ.400 నుంచి రూ.450 వరకు విక్రయిస్తున్నారు. రైతులకు అధికారుల స్లిప్ అవసరమని చెబుతున్నప్పటికీ, ఆ స్లిప్ తీసుకున్నా బ్లాక్ మార్కెట్‌లోనే అధిక ధరకు ఎరువులు కొనాల్సిన పరిస్థితి ఉంది. అనకాపల్లి ప్రాంతంలో పాడి రైతులు, పశుపోషణపై ఆధారపడే రైతులు ఎక్కువగా ఉన్నారు. పశుగ్రాసం కోసం కూడా యూరియా అవసరమవుతున్నా, పశుగ్రాసానికి యూరియా ఇవ్వడం లేదని రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కరువు పరిస్థితులకు తోడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. బియ్యం కిలో రూ.65, కందిపప్పు రూ.124, మినప్పప్పు రూ.124, వాము రూ.230, పంచదార రూ.80 వరకు ధరలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోగా, సామాన్యులు నిత్యావసరాల ధరలతో ఇబ్బంది పడుతున్నారు. రైతులు, సామాన్య ప్రజల సమస్యలపై పార్టీ తరఫున బలమైన కార్యక్రమం రూపొందించాలి. కరువు వల్ల నష్టపోయిన రైతాంగానికి, నిత్యావసర ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు అండగా నిలిచేలా మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా, సమన్వయకర్తల సహకారంతో జిల్లాలో దాన్ని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.

*పరీక్షిత్ రాజు, మన్యం జిల్లా అధ్యక్షుడు*
పంట బీమా ప్రీమియం రైతులు చెల్లించలేకపోతున్నారు

భవిష్యత్‌లో కూడా వర్షాలు కురిసే పరిస్థితి కనిపించడం లేదు. మన్యం జిల్లాలో 15 మండలాలకు గాను 11 మండలాల్లో వర్షపాతం లోటు ఉంది. సీతానగరం, భామిని మండలాల్లో తీవ్ర వర్షపాతం లోటు ఉంది. 11,490 హెక్టార్లకు గాను 18,839 మంది రైతులు మాత్రమే పంట బీమా చెల్లించారు. పంట బీమా ప్రీమియం రైతులే చెల్లించాల్సి రావడంతో వెనుకబడిన జిల్లాలో చాలామంది రైతులు బీమా చేయించుకోలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో కరువు వస్తే పంట బీమా చేయించుకోని రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. తోటపల్లి బ్యారేజ్ ద్వారా నీరు అందే ప్రాంతాల్లో కొంత ఉపశమనం ఉన్నప్పటికీ, మిగతా ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించారు. ప్రస్తుతం విత్తనాలు, ఎరువులు సకాలంలో అందడం లేదు. ఎరువుల కొరతతో పాటు ధరలు కూడా భారీగా పెరిగాయి. అరటి పంటకు నష్టం జరిగినప్పటికీ కనీసం నష్టం నమోదు చేయడానికి కూడా అధికారులు రాలేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పటికీ జిల్లాలో రైతుల సమస్యలపై సరైన సమీక్ష జరగడం లేదు. రైతులు తమ సమస్యలను పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్*
అన్ని జిల్లాల సమస్యలపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలి

అన్ని జిల్లాల అధ్యక్షులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, కరువు పరిస్థితులను వివిధ అంశాలుగా మీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా చంద్రబాబు లీక్ చేసిన ప్రాజెక్టుల పనులు, నీటి వనరులకు సంబంధించిన సమస్యలు జిల్లాల్లో తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని జిల్లా అధ్యక్షులు వివరించారు. నంద్యాల జిల్లాలోని పంపుడు స్టోరేజ్‌కు సంబంధించిన అంశాన్ని కూడా జిల్లా అధ్యక్షులు మీ దృష్టికి తీసుకొచ్చారు. నీటి వనరులు, సాగునీటి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాయలసీమలోని వివిధ జిల్లాల్లో రైతులు నీరు లేక, కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న విషయాలను అన్ని జిల్లాల అధ్యక్షులు వివరించారు. రైతుల పంటలు, సాగునీరు, ఎరువులు, కరువు తదితర సమస్యలపై అన్ని జిల్లాల నుంచి వచ్చిన అంశాలను సమగ్రంగా తీసుకొని ఒక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. రైతుల సమస్యలపై మీరు ఏ కార్యక్రమం రూపొందించినా, రాయలసీమలోని అన్ని జిల్లాల్లో దాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా అధ్యక్షులు, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. అన్ని జిల్లాల అధ్యక్షులు తమ ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను మీ దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీరు ఒక కార్యక్రమం రూపొందిస్తే, రాయలసీమ వ్యాప్తంగా దాన్ని విజయవంతంగా అమలు చేస్తామని మనవి చేస్తున్నాను.

*వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్*
ఇది వర్షాభావం కాదు..  'ఎల్లో ఎఫెక్ట్'

కృష్ణా జిల్లాలో నాట్లు వేయలేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లాలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో సాగర్ నీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరువు పరిస్థితులపై ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం రూపొందించాలి. ఇది వర్షాభావం కాదు, ఎల్లో ఎఫెక్ట్ అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాజశేఖర్‌రెడ్డి గారి హయాంలో చేసిన కరువు యాత్ర తరహాలో, కరువు తీవ్రంగా ఉన్న జిల్లాల్లో యాత్ర చేపట్టాలి. కరువు సమస్యపై రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలి. కరువు ప్రాంతాలను, కరువు మండలాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని హైలైట్ చేయాలి. రైతుల కష్టాల్లో పార్టీ అండగా నిలుస్తుందనే బలమైన సందేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాలి. పొగాకు, మామిడి, మిర్చి రైతుల సమస్యలపై గతంలో పోరాడినట్టే, ఇప్పుడు కరువు సమస్యపైనా పోరాటం చేయాలి. రాబోయే రోజుల్లో కరువు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. సాగునీటితో పాటు తాగునీటి సమస్యలు కూడా తీవ్రమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఒక సమగ్ర కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించాలి.

*బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్*
ఎరువుల బ్లాక్ మార్కెట్ పై ప్రభుత్వ నిర్లక్ష్యం

వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కనీసం చేయాల్సిన సాధారణ పనులను కూడా ఆలోచించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. పక్క రాష్ట్రాల్లో ఎరువులు అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో మాత్రం బ్లాక్ మార్కెట్ ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎరువుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలి. ప్రధానమంత్రికి కూడా రాష్ట్రంలో ఉన్న ఈ దౌర్భాగ్య పరిస్థితులను వివరించాలి. జిల్లా అధ్యక్షులు చెప్పిన దానికంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉన్నాయి. మీరు ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి, ముందుగా రెండు మూడు జిల్లాల్లో పర్యటిస్తే బాగుంటుంది. కరువు, నిత్యావసర ధరలు, ఎరువుల సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కలిపి కార్యాచరణ రూపొందించాలి. ఈ అంశాలపై కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు, సామాన్య ప్రజల పట్ల మన బాధ్యతగా చేయాలి. ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ బాధ్యతగా ముందుకు వెళ్లాలి.

*గుడివాడ అమర్నాథ్, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్*
నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల తీవ్రంగా ఉంది

గత 20 రోజులుగా విశ్వవిద్యాలయ, నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా కరువు, నీటి లభ్యత సమస్యలపై మాట్లాడుతున్నాం. మీరు ఒకటి లేదా రెండు జిల్లాల్లో పర్యటించి కార్యక్రమం నిర్వహిస్తే మంచి సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. కరువు, నిత్యవసర వస్తువుల ధరలు అనే రెండు ప్రధాన అంశాలపై కార్యక్రమం చేపట్టాలి. విశాఖపట్నం వంటి ప్రధాన నగరంలో మూడు, నాలుగు రోజులకైనా తాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని చెప్పడం మాత్రమే కాకుండా, ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ చర్యలు ప్రభుత్వం చేపట్టాలి. రాష్ట్రంలో నీరు అందుబాటులో లేని పరిస్థితులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

*ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్*
ప్రాంతాల వారీగా సమగ్ర యాక్షన్ ప్లాన్ కావాలి

అన్ని జిల్లాల నుంచి వచ్చిన సమస్యల్లో ప్రధాన అంశాలను గుర్తించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. ఉత్తరాంధ్రలో ఒకసారి, కృష్ణా నుంచి తూర్పు గోదావరి ప్రాంతంలో ఒకసారి, రాయలసీమలో ఒకసారి పర్యటించేలా కార్యక్రమం రూపొందించాలి. మీ పర్యటనలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలి. ఆ కార్యాచరణ ప్రకారం జిల్లాల నాయకులందరం కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం.

Back to Top