తాడేపల్లి: రాష్ట్రంలో ఉన్నది ‘ఎల్‌నినో’ ఎఫెక్ట్ కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్’ అని, ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరవు మాత్రమే కాదని, సీఎం చంద్రబాబు నిర్వాకం వల్లే మరింత తీవ్రత పెరిగిందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎల్‌నినో ప్రభావంపై ఫిబ్రవరి 4నే వెల్లడించిన సీఎం చంద్రబాబు, వచ్చే పరిస్థితిని ఎదుర్కోవడంలో ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని ఆయన ఆక్షేపించారు. వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా డ్రామాలు ఆడారని, స్విచ్‌లు నొక్కడం, లాకులు ఎత్తడం, ఫొటోలకు పోజులివ్వడం చేశారని తెలిపారు. ప్రభుత్వ మాటలు నమ్మి సాగులోకి దిగిన రైతులు ఇప్పుడు తీవ్ర కరవు పరిస్థితుల్లో నిండా మునిగారని, ప్రతి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోయారని చెప్పారు. చంద్రబాబు పుణ్యాన రైతులకు అన్నీ కష్టాలే అన్న శ్రీ వైయస్ జగన్, ఉచిత పంటల బీమా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు సకాలంలో నీళ్లు లేవని, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వదిలేశారని.. పులిచింతల ఎగువ, దిగువన తెలంగాణలో లిఫ్ట్‌లు అయినా చంద్రబాబు నోరు మెదపడం లేదని గుర్తు చేశారు. జూన్, జూలై, ఆగస్టులో వరుసగా మూడు నెలలు వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం స్పందించ లేదని శ్రీ వైయస్ జగన్ తప్పుబట్టారు. కరవు మండలాలు ఇంకా ఎందుకు ప్రకటించలేదన్న ఆయన, కర్ణాటక చాలా ముందుగానే ఆ పని చేసిందని ప్రస్తావించారు. కరవు ముంచుకొస్తున్నా ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధం చేయలేదని, పశుగ్రాసాన్ని జిల్లాలకు పంపలేదని, కనీసం ఉపాధి హామీ అదనపు పనిదినాలు కూడా కోరలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు, ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేని పరిస్థితిపై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని, అక్కడి పరిస్థితిని వివరించారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితి, ప్రభుత్వ నిర్లక్ష్యంపై అన్నీ విన్న శ్రీ వైయస్ జగన్ ఆ తర్వాత మాట్లాడుతూ ఏమన్నారంటే..: అన్ని జిల్లాలు. 628 మండలాల్లో కరవు: రాష్ట్రంలో ఇప్పుడు తీవ్రమైన కరువు పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒకసారి చూస్తే.. ఖరీఫ్ ప్రారంభం నుంచి ఇవాళ్టి (సెప్టెంబర్ 16) వరకు దాదాపుగా 51% పైచిలుకు లోటు వర్షపాతం కనిపిస్తోంది. 28 జిల్లాలకు గాను 28 జిల్లాలు ఈరోజు వర్షపాతం లోటులోనే ఉన్నాయి. 688 మండలాలకు గాను దాదాపు 628 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉంటే, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు సుమారు 332 మండలాల్లో కనిపిస్తున్నాయి. అంటే దాని అర్థం 51% పైచిలుకు వర్షపాతం లోటు ఉన్న పరిస్థితి. మైనస్ వర్షపాతం నమోదు: అన్నమయ్య జిల్లా –75%, సత్యసాయి జిల్లా –66%, ప్రకాశం జిల్లా –65%, చిత్తూరు జిల్లా –58.5%, వైయస్సార్ కడప జిల్లా –57%, తూర్పు గోదావరి జిల్లా –57%, మార్కాపురం జిల్లా –56%, నంద్యాల జిల్లా –56%, విశాఖపట్నం జిల్లా కూడా –54%. అనంతపురం జిల్లా –51%, కర్నూల్ జిల్లాలో కూడా 50% పైచిలుకు. ఇంత తీవ్రమైన వర్షపాతం రాష్ట్రం అంతటా కనిపిస్తోంది. ముందుగానే తెలిసినా కార్యాచరణ సున్నా అందుకే ఇది ‘మ్యాన్ మేడ్ కరవు’: ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగా తెలియనిది కాదు. నిజానికి రాష్ట్రంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపనుందని, ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తారీఖుననే సీఎం చం్రఆబాబునాయుడుగారు స్వయంగా చెప్పారు. ఆ విషయం చెప్పిన ఈ పెద్దమనిషి ఆ తర్వాత ఏం చేశాడు అన్నది మాత్రం గమనిస్తే, మనకు కనిపించేది ఏమిటి అని అంటే పెద్ద సున్నా. ఎందుకంటే ఈ మనిషి కార్యచరణకి వచ్చేసరికి చేసింది ఏమీ లేదు. అంతా సున్నా. సున్నా. అందుకనే ఇది ‘మ్యాన్ మేడ్ కరవు’. ముఖ్యమంత్రి అనే వ్యక్తి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన నష్టం ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. డ్రామాలు. ఆర్భాట ప్రచారాలు. ఫలితం?: మామూలుగా వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ 15, 16 దాకా ఉంటుంది. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని సీఎం చంద్రబాబుగారు ఫిబ్రవరి 4వ తేదీననే ప్రకటించారు. ఇక జూన్‌లో –25% వర్షపాతం స్పష్టంగా కనిపించినా, ఈ పెద్దమనిషి జూలై 11న ఏం చేశారు? ఆయన, ఆయన మంత్రి ఏం చేశారు? స్విచ్ నొక్కుతారు. పూజ చేస్తారు. ఫోటోలకు ఫోజులిచ్చి గేట్లు ఎత్తుతారు. నీళ్లు ఇస్తున్నాం. సాగు చేసుకొండి అని చెబుతారు. వీళ్ళ మాటలు నమ్మిన రైతులు అడుగు ముందుకేశారు. దీంతో ప్రతి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఈరోజు రైతులు నష్టపోతున్నారు. చంద్రబాబు పుణ్యాన రాష్ట్రంలో సాగు కూడా తగ్గింది. మామూలుగా ఖరీఫ్‌లో దాదాపు 76 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. కానీ, ఇప్పుడు మన రాష్ట్రంలో 56.4 లక్షల ఎకరాల్లో మాత్రమే ఆ సాగు జరిగింది. అంటే దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదు. అంత దుర్భర స్థితిలో వ్యవసాయం ఉంది. మామూలుగా ప్రివెంటివ్ సోయింగ్ అని చెప్పి, వీరికి ఉచిత పంటల బీమా కనుక అందుబాటులో ఉంటే, ఎకరాకు కనీసం రూ.15 వేలు చేతికి వచ్చేవి. అదే ఉచిత పంటల బీమా ఉండి ఉంటే?: పోనీ సాగు జరిగిన ఆ 56.4 లక్షల ఎకరాల పరిస్థితి ఏమిటి అని చూస్తే, అక్కడ కూడా పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. పంట వేసి సాగు చేసిన ప్రతి రైతుకు, పంటను బట్టి ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టపోయిన పరిస్థితి. అదే ఉచిత పంటల బీమా కనుక ఉండి ఉంటే, ఈ రైతులకు అందరికీ కూడా, ఎకరా సాగు చేయని ప్రతి రైతుకు ఎకరాకు కనీసం రూ.15 వేలు ప్రివెంటివ్ సోయింగ్ కింద ఇన్సూరెన్స్ వచ్చేది. అదే రకంగా సాగు చేసిన ప్రతి ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బీమా పరిహారం (ఇన్సూరెన్స్ క్లెయిమ్) అందేది. ఇది ‘ఎల్లో నినో ఎఫెక్ట్’: చంద్రబాబునాయుడుగారి పుణ్యాన్న ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కంది, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, వరి.. ఈ పంటలు మాత్రమే కాకుండా పండ్ల తోటలు కూడా అన్ని చోట్ల పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకనే ఈ రాష్ట్రంలో ఎల్‌నినో ఎఫెక్ట్ కాదు, ఇది ఎల్లో నీనో ఎఫెక్ట్. చంద్రబాబునాయుడుగారి పార్టీ ఎల్లో నీనో ఎఫెక్ట్ అని చెప్పాలి. ఈరోజు చూస్తే శ్రీశైలంలో నీళ్లు 862 అడుగులకు పడిపోయిన పరిస్థితి. ఆరోజు నేను మీడియాతో మాట్లాడినప్పుడు అదే శ్రీశైలంలో దాదాపు 880 అడుగుల మేర, 185 టీఎంసీల నీరు ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యంతో 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడం, శ్రీశైలంలో 880 అడుగుల నీరున్నప్పుడే సాధ్యం. అప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇవ్వగలిగితేనే తెలుగు గంగ కానీ, ఎస్సార్బీసీ కానీ, కేసీ కెనాల్ కానీ, ఆ ఆయకట్టులో ఉన్న రిజర్వాయర్లు కానీ నింపగలుగుతాం. అదే శ్రీశైలం ప్రాజెక్టులో నీరు 854 అడుగులకు చేరితే, పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 6 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంతకన్నా తగ్గితే నీరు తీసుకోవాలనుకున్నా సాధ్యం కాదు. కాగా, ఇప్పుడు శ్రీశైలంలో 862 అడుగుల నీరుంది. అటు చూస్తే రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లు కూడా డెడ్ స్టోరేజీకి కొంచెం అటు ఇటుగా ఉన్న పరిస్థితుల్లోకి వచ్చేశాయి. అయినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఎడా పెడా విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు వాడేస్తోంది. అలా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగిన సమయంలో నీశైలంలో 862 అడుగులకు నీళ్లు పడిపోయిన పరిస్థితి. అంటే ఆ తర్వాత నీళ్లు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి ఈరోజు ప్రాజెక్టులు అన్ని వెళ్ళిపోయాయి. తెలంగాణలో లిఫ్ట్‌ల నిర్మాణం. కళ్లు మూసుకున్న కూటమి ప్రభుత్వం: ఎగువన పులిచింతల ప్రాజెక్టు ఉంది. దాని సామర్థ్యం 45 టీఎంసీలు. అక్కడ రెండు చోట్ల ఎగువ, దిగువన తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్‌లు కడుతోంది. అలా దాదాను 11 టీఎంసీల నీరు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిపై గత ప్రెస్‌మీట్‌లో ఫోటోలు కూడా చూపాను. కళ్ల ముందే ఇంత దారుణం కనిపిస్తున్నా, ఇక్కడ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కళ్లు మూసుకుంది. కనీసం నోరు కూడా మెదపడం లేదు. అంటే ఎక్కడా కూడా మనసు పెట్టి చంద్రబాబునాయుడుగారు రైతుల కోసం ఉన్నాడు అన్న భావన ఇవ్వడం లేదు. పోలవరం ఎత్తు తగ్గింపు. రాష్ట్రానికి తీరని నష్టం: అంతకన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే చంద్రబాబుగారి పుణ్యమా అని పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో కడితే, అందులో 194 టీఎంసీల నీరు నిల్వ చేయగలం. కానీ ఇప్పుడు దాన్ని 41.15 మీటర్లకు కుదించారు. దీనిపై చంద్రబాబు రాజీ పడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి చంద్రబాబునాయుడుగారు ఆమోదం తెలపడం వల్ల అందులో నీటి నిల్వ సామర్థ్యం ఏకంగా 120 టీఎంసీలకు పడిపోయింది. అంటే దాదాపుగా 75 టీఎంసీల నీరు మనం కోల్పోతున్నాం. అంత నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా, దాన్ని వదిలేశారు. అలా కేంద్ర ప్రభుత్వం భరించాల్సిన రూ.60 వేల కోట్లలో దాదాపు రూ.30 వేల కోట్లు వదిలేసుకుంటున్నారు. ఇంకా గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీళ్లు ఇవ్వగలిగిన పరిస్థితిని కూడా కావాలని వదిలేసుకుంటున్నావు. పోలవరం నీటితో డ్రామా: పోలవరంలోకి నీళ్ల రాకముందే పుష్కర లిఫ్ట్, పురుషోత్త్తపట్నం లిఫ్ట్ రెండూ ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటితో ఇటీవల చంద్రబాబుగారు ఒక డ్రామా చేశారు. వాటి ద్వారా నీరు లిఫ్ట్ చేసి తరలించి, విశాఖ జిల్లాకు గోదావరి జలాలు తరలించామంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. అవేవో కొత్త లిఫ్ట్‌లు అయినట్లు బిల్డప్ ఇచ్చారు. పోలవరంలో 75 టీఎంసీల నీటి నిల్వను వదులుకుని, కేంద్రం నుంచి వచ్చే రూ.30 వేల కోట్లు కూడా వదులుకుని, ఈ డ్రామా ఆడడం దారుణం. నిజానికి ఈరోజు విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ లేని పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే, అది చంద్రబాబుగారిదే. కరవు మండలాలు ఎందుకు ప్రకటించలేదు? దానికి కారణాలు ఏమిటి?: జూన్‌లో –25%, జూలైలో –66%, ఆగస్టులో –55 శాతం వర్షపాత లోటు అని తెలుసు. మరి ఇన్ని వరుసగా డెఫిసిట్లు కనిపిస్తా ఉన్నప్పుడు నువ్వు కరవు మండలాల కింద ఎందుకు డిక్లేర్ చేయలేకపోతున్నావు? నిజానికి కరవు మండలాల ప్రకటనకు సంబంధించిన మాన్యువల్ చాలా స్పష్టంగా ఉంది. అందులో ఒక పారాగ్రాఫ్ కూడా క్లియర్‌గా ఉంది. అదే పక్కన కర్ణాటక ఆగస్టు 28వ తారీఖునే కరవు ప్రాంతాలు ప్రకటించింది. డ్రౌట్ మండలాల కింద డిక్లేర్ చేయడం వల్ల జరిగే ప్రధాన ప్రయోజనం ఏమిటో అందరికీ తెలిసిన విషయం. మొట్టమొదటగా రుణాలన్నీ రీషెడ్యూల్ అవుతాయి క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వస్తాయి. కాకపోతే మన దగ్గర చంద్రబాబుగారి పుణ్యమా అని, ఆ అవకాశం లేకుండా పోయింది. ఉచిత పంటల బీమా తీసేయడం వల్ల నష్టమే జరిగింది. ఇంకా ఎక్కడ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో చంద్రబాబుగారు కరవు మండలాలు ప్రకటించడం లేదు. ఈ విషయంలో పక్కన కర్ణాటక చూపించిన చొరవ ఆయన చూపించలేకపోతున్నారు. 56 లక్షల ఎకరాలకు లెక్క వేస్తే, ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఇచ్చే మొత్తం రూ.6 వేల కోట్లు అవుతుంది. ఆ మొత్తం ఇవ్వాల్సి వస్తుందనే భయమో లేక అది కూడా ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనలో భాగంగా, కరవు మండలాలు ప్రకటించడం లేదు. ముందస్తు చర్యలు అస్సలు లేవు: కరవు ముంచుకొస్తుందని ముందే తెలిసినా, ఎక్కడా కంటింజెన్సీ ప్లాన్ లేదు. ముందస్తు చర్యలు అంత కంటే లేవు. ప్రత్యామ్నాయ విత్తనాలు సరఫరా చేయలేదు. నిజానికి ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అన్ని జిల్లాలకు చేరి ఉండాలి. అదే విధంగా పశుగ్రాసం కూడా ఈ పాటికే అన్ని జిల్లాలకు అంది ఉండాలి. దాని పంపిణీకి తగిన మెకానిజం కూడా కంప్లీట్ చేసే ఉండాలి. అవన్నీ చేయడమే కాకుండా, ఉపాధి హామీ పనులు కూడా వచ్చే ఏడాది మార్చి వరకు, అంటే మరో ఆరు నెలలు లేదా కనీసం మరో 150 రోజులు అదనంగా కల్పించాల్సి ఉంది. ఆ దిశలో కూడా ప్రభుత్వం ఏ మాత్రం డిమాండ్ చేయడం లేదు. ఎలాగో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రొటీన్‌గా 100 రోజులు ఉపాధి హామీ పనులు వస్తాయి. కానీ, ఈ ఆరు నెలలు కూడా అవి వచ్చి ఉంటే చాలా మేలు జరిగేది. రైతులకు మేలు చేయాలని లేదు. ఎక్కడా ఒక్క ప్రణాళిక లేదు: ఈ ప్రభుత్వానికి ఎక్కడా ప్రణాళిక లేదు. ప్రతి రైతుకు కూడా మేలు చేయాలన్న ఆలోచన లేదు. రైతు భరోసా కింద పీఎం కిసాన్ కాక ఇస్తానని చెప్పిన రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వలేదు. ఈ మూడేళ్లలో ఆ పథకంలో మొత్తం రూ.60 వేలు ఇవ్వాల్సి ఉంటే, ఇచ్చింది కేవలం రూ.19 వేలు మాత్రమే. అంటే ఒక్కో రైతుకు రూ.41 వేలు బాకీ. కనీసం రైతులకు ఈ టైంలో అయినా ఆ మొత్తం ఇవ్వగలిగితే వారికి మేలు జరుగుతుంది. అంటే రైతులకు ఒక పెద్ద భరోసా అది కూడా ఇవ్వడానికి కూడా నీకు మనసు రావడం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలన్న ఆలోచన లేదు. మొంథా తుపాన్‌కు సంబంధించి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. సున్నా వడ్డీ పథకం రైతులకు ఒక ఊరటగా ఉండే పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. అదే మన ప్రభుత్వ హయాంలో దాదాపుగా రూ.2,050 కోట్లు సున్నా వడ్డీ కింద ఇస్తే ఇవాళ ఆ పథకం కనపడకుండా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపున ఇన్సూరెన్స్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి గమనిస్తే 2022, 2023 ఆ సమయానికి సంబంధించిన డేటాను పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం సమాధానం ఇచ్చింది. 2022–23లో ఖరీఫ్ సీజన్‌లో ఉచిత పంటల బీమా ఆంధ్రప్రదేశ్‌లో 1.18 కోట్ల దరఖాస్తులకు వర్తిస్తే ఈ ఏడాది 2026–27 ఖరీఫ్‌లో ఆ దరఖాస్తుల సంఖ్య కేవలం 40 లక్షలకు మాత్రమే పరిమితం అయిపోయింది అని చెప్పి ఏకంగా పార్లమెంట్‌లో వెల్లడించారు. అదే ఉచిత పంటల బీమా ఇప్పుడు ఉండుంటే అసలు ఇంకా ప్రతి రైతుకు ఆటోమేటిక్‌గా ఈ–క్రాప్ జరిగేది. ఆటోమేటిక్‌గా ప్రతి ఎకరా ఉచిత పంటల బీమా పరిధిలోకి వచ్చేది. కానీ, ఈ పెద్దమనిషి చేసిన నిర్వాకం ఏమిటి? ఈయన అధికారంలోకి వస్తూనే 2024, జూన్‌లో కనుక, 2023 ఖరీఫ్‌కు సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియమ్‌గా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన రూ.1400 కోట్లు చెల్లించి ఉంటే, ఈ రైతులకు దాదాపు రూ.3 వేల కోట్ల మేలు జరిగి ఉండేది. కానీ అది కట్టలేదు. అలా కట్టి ఉంటే, కేంద్ర ప్రభుత్వ వాటా కూడా వచ్చేది. దాని వల్ల పంటలన్నీ బీమా పరిధిలోకి వచ్చి రైతులకు మేలు జరిగేది. అందుకోసమే ఈ సమీక్ష. చర్చ: తీవ్ర కరవు పరిస్థితుల్లో చాలా నష్టపోయిన రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ డిమాండ్ల పరంగా మనం చేయాల్సిన అంశాల మీద ఒక లోతైన చర్చ జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ సమీక్ష చేస్తున్నాం. ఆ మేరకు పార్టీ తరపున ఈ డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నాం. ఇవీ ఆ డిమాండ్లు: – ప్రభుత్వం వెంటనే కరవు మండలాలు ప్రకటించాలి. – రైతులకు ఉచిత పంటల బీమాను వెంటనే పునరుద్ధరించాలి. ఇప్పటికే కొందరు రైతుల నుంచి వసూలు చేసిన ప్రీమియంను రైతులకు తిరిగి ఇవ్వాలి. – రైతులకు గతంలో ఎగ్గొట్టిన రూ.3 వేల కోట్ల పంటల బీమా పరిహారాన్ని కూడా వెంటనే ఇవ్వాలి. చంద్రబాబునాయుడుగారి వల్లనే రైతుల పంటలకు బీమా అన్నది లేకుండా పోయింది. – గతంలో ఉచిత పంటల బీమా ఉండేది. దాని వల్ల ప్రతి రైతుకు కూడా సాగు చేయకపోయినా కూడా ప్రివెంటివ్ సోయింగ్ కింద ప్రతి ఎకరాకు రూ.15 వేల పరిహారం అందేది. చంద్రబాబునాయుడుగారు ఉచిత పంటల బీమా తీసేసినందువల్ల, నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం స్వయంగా రూ.15 వేల చొప్పున ఇవ్వాలి. – అదే రకంగా పంటలు బేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున ఇవ్వాలి. ఎందుకంటే ఉచిత పంటల బీమా వల్ల మామూలుగా రైతుకు ఒక హక్కుగా వచ్చేది. చంద్రబాబునాయుడుగారు ప్రీమియమ్ కట్టకపోవడం వలన రైతులు ఈ మేరకు నష్టపోయే కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి అది కచ్చితంగా రైతులకు ప్రభుత్వం ఆ మొత్తం చెల్లించాలి. – అదే కాకుండా అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల చొప్పున మూడేళ్లకు రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.19 వేలు కాబట్టి, మిగిలిన రూ.41 వేలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. – అదే విధంగా అదే అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింపచేయాలి. వారికి మూడేళ్లకు కలిపి ఒక్కో రైతుకు రూ.60 వేల చొప్పున ఇవ్వాలి. – మోంథా తుపాన్ వ్లల నష్టపోయిన రైతులకు వెంటనే రూ.846 కోట్లు విడుదల చేయాలి. – ఇంకా ఈ కరువు వల్ల నష్టపోయిన రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ. సాగు చేసిన 56 లక్షల ఎకరాలకు ఆ మొత్తం లెక్క వేస్తే అది దాదాపు రూ.6 వేల కోట్లు అవుతుంది. కాబట్టి వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.6 వేల కోట్లు చెల్లించాలి. – లేదు వేరే పద్ధతిలో వేరే పద్ధతి నెంబర్లు ఏమైనా ఉన్నాయా అని ఉంటే చూపించండి. ఆ మేరకు గతంలో మా ప్రభుత్వ హయాంలో మాదిరిగా సీజన్ ముగిసేలోగా పరిహారం ఇవ్వండి. – రైతులకు సున్నా వడ్డీ కింద గతంలో మన ప్రభుత్వ హయాంలో ఏ మాదిరిగా ఇచ్చేవాళ్లమో, అదే మాదిరిగా ఈ మూడేళ్లకు సంబంధించి రైతులకు కూడా సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపచేయాలి. – కరవు తీవ్రత దృష్ట్యా పశు గ్రాసం కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోలేని పరిస్థితిలో రైతన్నలు ఉన్న పరిస్థితిలో పశు గ్రాసం అనేది ఉచితంగా కచ్చితంగా రైతులకు అందజేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని అందజేయాలి. – ఇంతకు ముందు ఎక్కడ వరదలు వచ్చినా కూడా మన ప్రభుత్వ హయాంలో పశు గ్రాసం ఖచ్చితంగా మనం ముందుగానే పంపే వాళ్లం. వరదలు రిసీవ్ అయిపోయిన వెంటనే ఒక పీరియడ్, ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఆ పీరియడ్ లో నేను వస్తాను అని చెప్పి కలెక్టర్ కి ముందుగానే చెప్పే వాళ్లం. నేను వెళ్లే టైమ్‌కు కలెక్టర్లు కచ్చితంగా ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసి ఇచ్చేవాళ్ళు. – అదే మాదిరిగా పశు గ్రాసం కూడా కచ్చితంగా అందుబాటులోకి తీసుకొని రావడమే కాకుండా ఇప్పటికే లేట్ అయిపోయింది వెంటనే వెంటనే ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలను కూడా చేయాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. – కరవు వల్ల వ్యవసాయ పనులు లేక కూలీల వలసలు ఇప్పటికే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ఆరు నెలల పీరియడ్ లో మరో 150 రోజులు కనీసం ఉపాధి హామీ పనులు క్రియేట్ చేసి వీళ్ళకి తోడుగా నిలబడే కార్యక్రమం చేయాలి. – ఇవి కాక విద్యాదీవెన. వసతి దీవెన. ఈ రెండు పథకాల్లో ఎక్కువ మంది లబ్ధిదారులైన పిల్లలు రైతుల బిడ్డలే. కాబట్టి ఆ రెండు కలిపి మొత్తం బకాయిలు దాదాపు రూ.9 వేల కోట్లు. ఈ డబ్బులన్నీ వీళ్ళు కట్టుకోలేకపోతే, ఫీజులు కట్టుకోలేకపోతే వీళ్ళకి వసతి దీవెన డబ్బులు రాకపోతే పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. – కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ బకాయిలు విడుదల చేసి ఆ రైతులను, వారి పిల్లలకు తోడుగా నిలబడాలి. ఆ పిల్లలు చదువు మధ్యలో ఆపకుండా బాధ్యత వహించాలి. – మరోవైపు తాగునీటి ఎద్దటి లేకుండా తక్షణమే చర్యలు తీసుకుంటూ, ఉచిత ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే కార్యక్రమం వెంటనే స్టార్ట్ చేయాలి. – అక్కడక్కడ ఇబ్బందులు గల పరిస్థితులు ఏదైనా ఉంటే వైసీపీ తరపున మనం చేస్తా ఉన్నాము, కానీ ప్రభుత్వం తరపు నుంచి ఇంతవరకు ఎటువంటి తోడు, ఎటువంటి సహాయం ఇంతవరకు అందలేదు. అది వెంటనే యుద్ధ ప్రాతిపదికన కూడా వెంటనే చేయించే కార్యక్రమం కూడా చేయాలని కోరుతున్నాం. – కరెంట్ కోతలు విపరీతంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కరెంట్ కోతలే. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 దాకా గ్రామాలలో తీవ్రమైన కరెంట్ కోతలు కనిపిస్తా ఉన్నాయి. రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ కదా, దేవుడి ఎరుపు 6 గంటలు, 5 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం కనిపిస్తా ఉంది. – ముఖ్యంగా బోర్ల కింద ఉన్న పంటలు అయితే పూర్తిగా ఎండిపోతా ఉన్న పరిస్థితులు. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి కోతలు లేకుండా కరెంట్ సప్లై చేయాలి. – ప్రతికూల పరిస్థితుల్లో దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందాలి. గత మన ప్రభుత్వంలో రూ.7 లక్షల చొప్పున సాయం చేశాం. – ఇప్పుడు కూడా ఆ కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. ఆ రైతుల కుటుంబాలకు తోడుగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. – ఇంకా ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడేందుకు 80% సబ్సిడీతో నీటి ట్యాంకర్ల ద్వారా రైతులకు సప్లై చేసే కార్యక్రమం చేయాలి. వీటన్నింటిపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఆ దిశలో ఇదీ కార్యాచరణ: ఇవన్నీ చాలా న్యాయమైన డిమాండ్స్. రైతు సమస్యలపై ఇంకా లోతైన అధ్యయనం చేస్తాం. వారి సమస్యల పరిష్కారానికి తగిన కార్యాచరణ కూడా రూపొందిస్తాం. అలా రాబోయే రోజుల్లో రైతులకు మరింత తోడుగా నిలుస్తాం. ఇవే కాకుండా, ఇంకా లోకల్ డిమాండ్స్ ఏమైనా ఉంటే, వాటిని కూడా ప్రస్తావిస్తాం. ఆలోపు పార్టీ జిల్లా అధ్యక్షులంతా ఎక్కడ సమస్య ఉంటే, అక్కడ గట్టిగా గళం విప్పాలి. క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచాలి. అలా రైతులకు తోడుగా ఉంటూ, వారి సమస్యలు ఎలుగెత్తి చాటే కార్యక్రమం చేయాలి. అప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి, మెడలు వంచే కార్యక్రమం కూడా కచ్చితంగా జరుగుతుంది. ఇంకా ఆ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాలి. అందులో భాగంగా తొలుత మండలం, ఆ తర్వాత నియోజకవర్గం, మళ్లీ ఆ తదుపరి జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలి. రైతుల సమస్యలపై ప్రజల్లోనూ అవగాహన పెంచే ప్రయత్నం చేయాలి. ఇక ఎక్కడైనా అవసరాన్ని బట్టి, పరిస్థితి తీవ్రతను బట్టి, స్వయంగా తానూ ఆ కార్యక్రమంలో పాల్గొంటానని శ్రీ వైయస్ జగన్ వివరించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు, పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా.. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయ విభాగం) ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంఛార్జ్ వడ్డి ర«ఘురాం తదితరులు హాజరయ్యారు.