అనంతపురం: ఉమ్మడి అనంత జిల్లాలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కరవును జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని వైయస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కరవు ప్రభావం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో వైయస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ..కరవు సమస్య పరిష్కారానికి అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలో వర్షాభావంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రమేష్ గౌడ్ తెలిపారు. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి తక్షణ పరిహారం అందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. కరవును జాతీయ విపత్తుగా ప్రకటించి జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కూడా కరవు సహాయం అందించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పనులను విస్తృతం చేయాలని సమావేశంలో కోరారు. కరవు ప్రభావిత గ్రామాల్లో తాగునీరు, పశువులకు నీరు, మేత అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోకపోతే వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్సీపీ రైతుల పక్షాన ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతుందని రమేష్ గౌడ్ తెలిపారు. కరవుకు శాశ్వత పరిష్కారం కోసం సాగునీటి వనరుల అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కోరారు.