వయో పరిమితిని 32 ఏళ్లకు పెంచాల్సిందే..

నిరుద్యోగులకు ప్రధాన సమస్యను పరిష్కరించాలి

మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ డిమాండ్

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ, అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్

కానిస్టేబుల్, ఎస్‌ఐ నియామకాలపై స్పష్టత ఏదీ..?

పాసింగ్ ఔట్ అభ్యర్థుల వివరాలను వెల్లడించరేం..?

గోరంట్ల మాధవ్ సూటి ప్రశ్నలు

లోపభూయిష్ట నోటిఫికేషన్ పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించరేం..?

నిరుద్యోగుల పక్షాన పోరాడతా.. ప్రశ్నిస్తాన్న ప్రగల్భాలు ఏమయ్యాయి..?

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ ఆగ్రహం

తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉద్యోగార్థుల విషయంలో నిరుద్యోగులకు వయోపరిమితి సడలింపు ఇవ్వాలని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీ, అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు వయోపరిమితి సమస్యగా మారుతోందని గోరంట్ల మాధవ్ గుర్తు చేశారు. ఓసీ అభ్యర్థులకు మేలు చేకూరేలా వయోపరిమితిని 32 ఏళ్ల వరకు పెంచాలి. నియామకాల్లో అర్హత కోల్పోయే పరిస్థితి రాకుండా నిరుద్యోగ అభ్యర్థులకు ప్రత్యేక వయో సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇచ్చే సడలింపులను పరిశీలించి ఆంధ్రప్రదేశ్‌లోనూ తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లోని పలు అంశాలను ఎత్తిచూపారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఆందోళన చేస్తే వారిపై బైండ్‌ఓవర్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసేలా కూటమి ప్రభుత్వ వ్యవహార తీరు సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం కోసం ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అని, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని మాధవ్ గుర్తు చేశారు. ఆందోళన చేస్తున్న యువతతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఆయన ఇంకా మాట్లాడారంటే...

కానిస్టేబుల్, ఎస్‌ఐ నియామకాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి

ప్రస్తుతం కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకుని పాసింగ్‌ఔట్‌కు సిద్ధంగా ఉన్న అభ్యర్థులకు సంబంధించిన నియామక ప్రక్రియపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలి. ఈ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చాం. నియామక ప్రక్రియలో ఇప్పటికే పూర్తయిన దశలు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియ, పాసింగ్‌ఔట్‌కు సంబంధించిన వివరాలను ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలి.

ఎస్‌ఐ నియామకాలకు సంబంధించిన ప్రక్రియపైనా స్పష్టత ఇవ్వాలి. సుమారు 6,100 ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియపై నిరుద్యోగ యువతలో అనేక సందేహాలు ఉన్నాయి. ఈ ప్రక్రియపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడించాలి. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలి. ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతను ఆకర్షించేందుకు చంద్రబాబు నాయుడు 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు రాని వారికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. చంద్రబాబు హామీలను నమ్మి నిరుద్యోగ యువత చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల విషయంలో యువతకు నిరాశే మిగిలింది. 20 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి ఇప్పుడు వేల సంఖ్యలో పోస్టులకే పరిమితం కావడం ఏమిటి? రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం, వాటి భర్తీకి స్పష్టమైన క్యాలెండర్‌ను ఎందుకు ప్రకటించడం లేదు.

పారదర్శకత ఏదీ...?

టీచర్ పోస్టుల భర్తీ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలి. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ నిబంధనల ప్రకారం భర్తీ చేస్తున్నారు, రోస్టర్, మెరిట్, ఎంపిక విధానం వంటి వివరాలను అభ్యర్థులకు స్పష్టంగా తెలియజేయాలి. నియామక ప్రక్రియపై నిరుద్యోగ యువతలో అనుమానాలు రాకుండా ప్రతి దశను పారదర్శకంగా నిర్వహించాలి. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ నియామకాలకు చర్యలు తీసుకున్నాం. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు కూడా అవకాశాలు లభించాయి.

పవన్ కల్యాణ్ ఇప్పుడు స్పందించరేం..?

నిరుద్యోగ యువత సమస్యలపై గతంలో ప్రశ్నిస్తానని చెప్పిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాల హామీ, పోలీస్ పోస్టుల భర్తీ, వయోపరిమితి సడలింపు, నియామకాల్లో పారదర్శకత వంటి అంశాలపై పవన్ కల్యాణ్ స్పందించాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి, వాటి భర్తీకి స్పష్టమైన ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలి. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, వయోపరిమితి సడలింపు, పారదర్శక నియామక ప్రక్రియకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగ యువత సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రకటించాలి.

 

Back to Top