సత్తెనపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలని సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పిలుపునిచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సత్తెనపల్లి రూరల్ మండలానికి చెందిన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎదురయ్యే న్యాయపరమైన అంశాలకు పార్టీ తరఫున న్యాయ బృందం సహకారం అందిస్తుందని తెలిపారు. అభ్యర్థులకు తన పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ, వార్డు స్థాయి పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల బాధ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.