గుంటూరు: గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను గుంటూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ నూరి ఫాతిమా, వనమా బలవజ్రబాబు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 76 వార్డులు ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి హాజరుకానున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరై సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో అధికార దుర్వినియోగం జరగకుండా ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించి రాజకీయ కార్యకలాపాలను అడ్డుకునే పరిస్థితులు ఉండకూడదని తెలిపారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఒక ఓటరు ఒకే ఓటు వేసే విధంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పోస్టుల విషయంలో చట్టపరమైన నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉన్న పోస్టుల ఆధారంగా వేర్వేరు ప్రమాణాలు ఉండకూడదని పేర్కొన్నారు. ఒకే ఘటనకు సంబంధించి చట్ట ప్రకారం తగిన చర్యలు మాత్రమే తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాలను పార్టీ నాయకులు ప్రజల ముందుకు తీసుకెళ్తారని అంబటి రాంబాబు తెలిపారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: షేక్ నూరి ఫాతిమా గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలకు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో వనమా బలవజ్రబాబు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.