రాష్ట్రంలో కరవు దుస్థితికి చంద్రబాబు కారణం

ముందే తెలిసినా, ఏ మాత్రం జాగ్రత్త పడని వైనం

మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ధ్వజం

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌.

రాయలసీమకు కన్నీళ్లు మిగులుస్తున్న బాబు

ఆరుతడి పంటలకూ నీరివ్వకుండా అన్యాయం

పోలవరం ఎత్తు తగ్గించి ఉత్తరాంధ్రకూ ద్రోహం 

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ఫైర్‌

తాడేపల్లి: రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ అనాలోచిత, అస్తవ్యస్త నీటి నిర్వహణ విధానాల వల్ల రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం తీవ్ర కరవు కోరల్లో చిక్కుకుందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ఫైర్‌ అయ్యారు. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉన్నాయని, రిజర్వాయర్లలో జలకళ ఉందంటూ అనుకూల మీడియాతో ప్రచారం చేయించుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం.. వాస్తవానికి సీమలోని ఆరుతడి పంటలకు సైతం చుక్క నీరు ఇవ్వకుండా రైతుల ప్రయోజనాలను నిలువునా తాకట్టు పెట్టిందని ఆయన మండిపడ్డారు. 2016లో శ్రీశైలంలో కేవలం 73 టీఎంసీల నీరున్నప్పుడే అక్కడక్కడా ఆరుతడి పంటలకు నీరిచ్చిన చరిత్ర ఉందని గుర్తు చేశారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి దాన్ని కేవలం బ్యారేజీ స్థాయికి కుదించడం ద్వారా ఉత్తరాంధ్ర రైతాంగానికి సైతం చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

రాయలసీమకు మొండిచేయి:
    శ్రీశైలం జలాశయంలో గత నెలలో దాదాపు 880 అడుగుల మేర, 185 టీఎంసీల నీరున్నా, రాయలసీమ రిజర్వాయర్లు నింపేలా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ నుంచి నీరు విడుదల చేయలేదు. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యంతో 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడం, శ్రీశైలంలో 880 అడుగుల నీరున్నప్పుడే సాధ్యం. అలా పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇవ్వగలిగితేనే తెలుగు గంగ కానీ, ఎస్సార్బీసీ కానీ, కేసీ కెనాల్‌ కానీ, ఆ ఆయకట్టులో ఉన్న రిజర్వాయర్లు కానీ నింపగలుగుతాం.
    కాగా, ఇప్పుడు శ్రీశైలంలో దాదాపు 862 అడుగుల నీరుంది. అటు చూస్తే రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లు కూడా డెడ్‌ స్టోరేజీకి కొంచెం అటు ఇటుగా ఉన్న పరిస్థితుల్లోకి వచ్చేశాయి. అయినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. కనీసం ఇప్పుడైనా పోతిరెడ్డిపాడు నుంచి నీరు తీసుకోవడంపై దృష్టి పెట్టాలి.

ఇది ‘ఎల్‌నినో’ కాదు.. బాబు తెచ్చిన ’ఎల్లోనినో’:
    రాష్ట్రంలో నెలకొన్న కరవు ప్రకృతి వైపరీత్యం కాదు. ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం తెచ్చిన ’ఎల్లోనినో’ కరవు. ఎందుకంటే రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితి రానుందని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సీఎం చంద్రబాబు వెల్లడించారు. అయినా ఎలాంటి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయకుండా, పూర్తిగా నిర్లక్ష్యం చూపారు. ఫలితంగా ఇప్పుడు ఎల్‌నినో ప్రభావం తీవ్రమై.. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. అందుకే ఇది ఎల్‌నినో కరవు కాదు. ఎల్లోనినో కరవు.
    రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితుల నేపథ్యంలో రాయలసీమ రిజర్వాయర్లన్నీ అడుగంటాయి. గండికోట సహా సీమ ప్రాజెక్టులు ఎండిపోయి నెర్రలు చాచిన దృశ్యాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. శ్రీశైలంలో 2016లో 73.6 టీఎంసీల నీరున్నప్పుడు కూడా ఆరుతడి పంటలను కాపాడారు. ఇప్పుడు అంత కంటే ఎక్కువ నీరున్నా, సీమకు నీళ్లివ్వడంలో సీఎం చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు.
    మరోవైపు హంద్రీనీవా పనులకు రూ.3700 కోట్లు ఖర్చు చేశామని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ, నాసిరకం పనుల వల్ల కాలువల్లో కనీసం 3 వేల క్యూసెక్కుల నీరు కూడా పారడం లేదు.

ఎండిన తోటలు. రైతు బతుకు కల్లోలం:
    రాయలసీమ పల్లెల్లోకి వెళ్లి చూస్తే ఎండిపోయిన చీనీ, మామిడి, అరటి తోటలు, భూమిలోనే ఎండిపోయిన వేరుశనగ, కంది పంటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఐదేళ్లు కష్టపడి పెంచిన చీనీ చెట్లు కాపుకొచ్చే సమయానికి నీరు లేక ఎండిపోతుంటే రైతులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. సమీక్షల్లో ఉద్యాన పంటల రక్షణకు రూ.190 కోట్లు అని ప్రకటించడం హాస్యాస్పదం. ఆ నిధులు ఏ మూలకూ సరిపోవు. 
    మరోవైపు సీమ జిల్లాల్లోని పశువుల సంతల్లో మూగజీవాల గోస ఆ ప్రాంత దుర్భర కరవు పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రభుత్వం ఇకనైనా చొరవ చూపాలి. ఆ దిశలో యుద్ధప్రాతిపదికన పశుగ్రాసం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ కోరారు.

Back to Top