నెల్లూరు: ఎల్ నినో ప్రభావంతో నెల్లూరు జిల్లా తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 40 శాతం వర్షపాతం లోటు ఉండటంతో అనేక ప్రాంతాల్లో పంటల సాగు దెబ్బతిన్నదని, కరువు ప్రభావిత ప్రాంతాలను గుర్తించి రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై సూచనలు, అవసరమైన విత్తనాల పంపిణీ వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాలు లేక పశువులకు మేత కొరత ఏర్పడి, కొన్ని ప్రాంతాల్లో రైతులు పశువులను అమ్ముకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో సాగునీటితో పాటు తాగునీటి అవసరాలపైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాకాణి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించుకుని సోమశిల, కండలేరు జలాశయాలను నింపేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నీటి కొరత కారణంగా రైతులు పంటలు సాగు చేయలేక పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, జిల్లాలోని ప్రజాప్రతినిధులు సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.