కృష్ణా జిల్లా గుడివాడ: వైయస్ఆర్‌సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. గుడివాడ మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నాయకుడు కొడాలి నాని సమక్షంలో ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావు (రాము) పార్టీలో చేరారు. ఆయనతో పాటు గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర గ్రామానికి చెందిన పలువురు యువత వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా కొడాలి నాని వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, వివిధ వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా కాకుండా కొన్ని వర్గాలకే పరిమితమై పనిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార, పోలీసు బలాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వైయస్ఆర్‌సీపీలో చురుగ్గా పనిచేసే వారిని రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.